హజ్ యాత్రికులకు ఇదేమి ఖర్మ
నాడు హజ్ యాత్రకు దర్జాగా నేడు బేజారుగా
హజ్ యాత్రకు వెళ్లేందుకు రూ.83వేలు అదనపు భారం పెంచడాన్ని ఖండిస్తున్నాం
చెట్లు, స్థంభాలకు వైసీపీ రంగులు – కాని మసీదులు, దర్గాలకు సున్నాలు లేవు
– ఎం ఏ షరీఫ్, ఎన్.ఎం.డీ ఫరూఖ్, మౌలానా ముస్తాక్ అహ్మద్
పవిత్ర మక్కా అల్లాహ్ గృహానికి వెళ్ళే హజ్ యాత్రికులకు జగన్ రెడ్డి పెద్దా నిరాశే మిగిల్చారు. ఎన్నడూ లేని విధంగా ఏపీ నుండి వెళ్లే హజాత్రికులకు రూ.83 వేలు అదనంగా విమానం చార్జీలు విధించటం విస్మయాన్ని గురిచేసింది. తెలంగాణ నుండి హజ్ యాత్రకు వెళ్లేందుకు రూ.3,05,000 ఖర్చు అవుతుండగా, ఏపీ నుంచి వెళ్తున్న వారికి మాత్రం రూ.3,88,000 ఖర్చు భరించాల్సిన పరిస్థితి.
ఇది కేవలం జగన్ రెడ్డి మైనార్టీ సోదరులకు చేస్తున్న ద్రోహం. హైదరాబాద్ విమానాశ్రయం నుండి విజయవాడ విమానాశ్రయానికి 250 కిలోమీటర్ల దూరం ఉందన్న నెపంతో రూ.83 వేలు అదనంగా చార్జి చెల్లించ వలసిన పరిస్థితి రావడాన్ని ఏపీ హజ్ యాత్రికులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
నాడు చంద్రబాబు నాయుడు కృషి వలన విజయవాడ విమానాశ్రయం నుండి జిద్దాకు (మక్కా) నేరుగా వెళ్ళేందుకు సాధ్యమయ్యింది. నేడు విజయవాడ విమానాశ్రయం నుండి వెళ్లుతున్నామనే సంతోషాన్ని సైతం జగన్ రెడ్డి హరించి అదనపు భారం మోపారు. అంతేకాకుండా హజ్ యత్రికులకు సౌలభ్యం కోసం విజయవాడ, కడపలో హజ్ హౌస్ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు 90 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి మిగిలిన 10 శాతం పనులను చేయకుండా పక్కన పెట్టేశారు. కేంద్రాన్ని ప్రశ్నించే సత్తాలేని జగన్ రెడ్డికి కనీసం ఈ విషయంలోనైనా కేంద్రంతో చర్చలు జరిపి అదనపు భారం తగ్గించే ప్రయత్నం చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
గత 4 ఏళ్లుగా మైనార్టీలను అట్టడుగు స్థాయికి నెట్టేశారు. బూటకపు సంక్షేమంతో మోసపు మాటలతో మైనార్టీలను నయవంచనకు గురి చేస్తున్నారు. మైనార్టీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం అమలు చేసిన దాదాపు 10 పథకాలను రద్దు చేశారు. మైనార్టీ సోదరులపై దాడులు పెరిగాయి, మైనారిటీ ఆడపడుచులపై అఘాయిత్యాలు జరుగుతున్నా జగన్ రెడ్డి పట్టించుకోని పరిస్థితి. దుల్హన్ పథకాన్ని నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఫేక్ ప్రచారాలతో మైనారిటీలతో మరో సారి థోకా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విదేశీ విద్యను నిర్వీర్యం చేసి మైనారిటీ సోదరులకు ఉన్నత విద్యను దూరం చేశారు. మసీదులు, దర్గాలు, షాదీఖానాలు, ఖబరస్థాన్ లకు నిధులు విడుదల చేయని పరిస్థితి.
వక్ఫ్ భూములను వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నా జగన్ రెడ్డి చోద్యం చేస్తున్నారు. చెట్లకు, కరెంట్ స్థంభాలకు వైసీపీ రంగులు వేసేందుకు డబ్బులున్నాయి కాని రంజాన్ మాసంలో మసీదులు, ఈద్గాలకు మాత్రం సున్నాలు వేసేందుకు డబ్బులు లేవు. జగన్ రెడ్డి మైనారిటీ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారు.
మైనారిటీలను ఓటు బ్యాంక్ గా చేసుకొని ఆడుతున్న జగన్ రెడ్డి నాటకం ఆడుతున్నారని అర్ధమయ్యింది. మీ మాయ మాటలు ఇక చెల్లవు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు మైనారిటీ సోదరులు నిద్రపోరు. జగన్ రెడ్డికి రాజకీయ ముగింపు మైనారిటీలతో ఆరంభం.