– హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లమసీ అధికారి ప్రాంకీ స్టర్మ్
ఉస్మానియా యూనివర్శిటీ: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తప్పుడు సమాచారాన్ని తొలగించడం కీలకమని హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ డిప్లమసీ అధికారి ప్రాంకీ స్టర్మ్ అన్నారు. తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తుందన్న ఆయన… ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించటం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలమని స్పష్టం చేశారు. పాఠకులు, వీక్షకుల కోసం జర్నలిస్టులు తప్పుడు సమాచారానికి ఎలా అడ్డుకట్టవేయవచ్చో వివరించారు.
ఉర్దూ టీవీ జర్నలిస్టుల కోసం తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటంపై ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగంతో కలిసి అమెరికన్ కాన్సులేట్ నిర్వహిస్తున్న కార్యశాలను ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవటం, తొలగించటంపై 35మంది ఉర్దూ జర్నలిస్టులకు శిక్షణనిస్తున్నారు. ఇప్పటికే 40 మంది తెలుగు టీవీ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వటంతో పాటు సర్టిఫికెట్లను అందించారు.
ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ మాట్లాడుతూ…. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉస్మానియాలో సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఉర్దూను బాధనా మాధ్యమంగా ప్రవేశపెట్టిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ మాద్యమ టీవీ జర్నలిస్టులకు ఫ్యాక్ట్ చెక్ పై శిక్షణ ఇవ్వటం సంతోషాన్నిచ్చిందని అన్నారు. అమెరికన్ కాన్సులేట్ తో విశ్వవిద్యాయంతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేశారు. ఫ్యాక్ట్ చెక్ కార్యశాలకు మద్దతుగా నిలిచిన అమెరికన్ కాన్సులేట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
పరిమిత వనరుల కారణంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తి జరగుతోందని… ఫలితంగా ప్రజల వాస్తవిక అవగాహనను దెబ్బతీస్తోందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వినియోగదారుల జవాబుదారీ తనంతో పాటు సమాచార ప్రచురణ, ప్రసారం విషయంలో స్వతంత్ర వాస్తవ తనిఖీలు అవసరమని అభిప్రాయపడ్డారు.
తప్పుడు సమాచారం ప్రధాన స్రవంతి మీడియాలోకి రాకుండా నిరోధించటానికి వాస్తవ తనిఖీ నైపుణ్యాలు, సాంకేతికతలు ఉర్దూ జర్నలిస్టులకు ఎంతగానో ఉపకరిస్తాయని ఓయూ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ స్టీవెన్ సన్ కోహిర్ అన్నారు. ప్రాజెక్టు లక్ష్యాలను వివరించిన ఆయన… బ్లెండెడ్ మోడ్ లో 40 గంటల పాటు శిక్షణ ఉంటుందని అన్నారు.
జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వటానికి జాతీయ, అంతర్జాతీయ నిజనిర్ధారణ నిపుణులు కార్యశాలకు హాజరవుతున్నారు. ఈ కార్యశాల ఉర్దూ మీడియాలో బలమైన నిజనిర్ధారణ బృందాన్ని తయారు చేసేందుకు దోహదపడుతుందని….. GNI, డేటా లీడ్స్ లీడ్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.