– టిడ్కో ఇళ్లకు నాలుగేళ్ల తాళంపై టీడీపీ ఎమ్మెల్యే వినూత్న నిరసన
ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు నాలుగేళ్లుగా తాళాలు ఎందుకు వేసారంటూ నల్ల కండువాతో ప్లేబోర్డుతో అసెంబ్లీ వెలుపల వర్షం పడుతున్నా, నిలువు కాళ్లపై గంట సేపు నిలబడి పాలకొల్లు శాసనసభ్యులు డా. నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డా.నిమ్మల మాట్లాడుతూ మహిళల సొంత ఇంటి కల నెరవేర్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు ప్రారంభించి 90 శాతం పూర్తిచేస్తే, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి గాని, ఒక్క అరబస్తా సిమెంట్ గాని పెట్టకుండా మిగిలిన 10 శాతం పూర్తి చెయ్యకుండా మేము కట్టిన ఇళ్లకు వాళ్ల పార్టీ రంగులు వేసుకుంటున్నారన్నారు.
కట్టిన ఇళ్లు ఉండగా కూడా నెల నెలా 4 వేలు అద్దె భారంతో ఈ 4 సంవత్సరాలలో 2 లక్షలు అద్దె రూపంలోనే నష్టపోయామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నారు. ప్రతిపక్షంలో జగన్ పాదయాత్రలో ఊరువాడ ఉచితంగా ఇస్తానని చెప్పి, నేడు అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మడమ త్రిప్పి ఇళ్లను బ్యాంకులకు తాకట్టు పెట్టి, లబ్ధిదారులను అప్పులపాలు చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితంగా ఇచ్చిన అరకొర ఇళ్లల్లో కూడా త్రాగునీరు, ఎస్ .టి.పి. ట్యాంకు, వీధిలైట్లు వంటి అత్యవసర సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారన్నారు. వెనువెంటనే రంగులు కాదు, మిగిలిన 10 శాతం పూర్తిచేసి అన్నమాట ప్రకారం ఉచితంగానే టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.