-తెలంగాణ పై బిజెపి మిడతల దండు దాడి
-మత ఆలజడులను సృష్టించేందుకు బిజెపి కుట్ర
-సభ్య సమాజం తల దించుకునే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యాలు
-మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఫైర్
సమాజ హితానికి నష్టం వాటిల్లే విధంగా, మత కల్లోలాలకు దారి తీసేవిధంగా, మత ఘర్షణలను రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను సమాజం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కాన్నారు. బుధవారం హైదరాబాద్ అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుత, ప్రశాంత వాతావరణం ఉన్న తెలంగాణలో మత ఆలజడులను సృష్టించేందుకు బీజేపీ నాయకత్వం తెలంగాణ పై మిడతల దండు దాడి చేసినట్టుగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.
బిజెపి నాయకుల తీరు దేశ సమైఖ్యత, సమగ్రత లౌకిక వాదానికి పెను ప్రమాదంగా మారుతున్నదని ఆందోలన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తల దించుకునే విధంగా, తెలంగాణ ప్రశాంత వాతావరణాన్ని కల్లోలం చేసే విధంగా ఉన్నాయని అన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యాలు శాసన సభ్యులు మాట్లాడాల్సిన మాటల్లాగా లేవన్నారు. చాలా జుగుప్సకరంగా, సమాజంలో మత కల్లోలాలు రెచ్చగొట్టే విధంగా అల్లర్లకు దారి తీసే విధంగా ఉన్నాయన్నారు. సమాజ హితం దృష్ట్యా రాజాసింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించాలని, కానీ ఇందుకు భిన్నంగా రాజాసింగ్ వ్యాక్యాలు ఉన్నందున భారత రాజ్యాంగం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గతంలో దళితుల అలవాట్లు, వారు తినే ఆహార పదార్థాలపై అనుచిత వ్యాఖ్యాలు చేసి వారి మనోభావాలు కూడా దెబ్బతినడానికి రాజాసింగ్ కారణమైనాడని గుర్తు చేశారు. ఇలాంటి వారిపట్ల ప్రభుత్వం ఉధాసీనంగా వ్యహరించకుండ కఠినంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే జరిగే నష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి పరిపాలన చేస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా చిత్తశుద్దితో రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బిజెపి నాటకం ఆడితే బిజెపిని ప్రజలు క్షమించరని పేర్కొన్నారు.
సమాజానికి మార్గదర్శిగా ఉండే వ్యక్తులను మాత్రమే నాయకులుగా ఎంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటామాడే వారిని దూరం పెట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా రాజాసింగ్ అయినా మరెవ్వరు మాట్లాడిన కట్టడి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొంత మంది తమ పరిధిని దాటి రెచ్చగొట్టే వ్యాక్యాలు చేస్తున్నారని, ప్రజలకు మార్గదర్శుకులుగా, దిక్సూచిగా ఉండాల్సిన నాయకులు మాట్లాడే బాషా ఆదర్శంగా ఉండాలన్నారు. కానీ కొంత మంది దీనికి భిన్నంగా వాడుతున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు.