-కరకట్ట కమలాసన్ రోజుకో మాట మాట్లాడతాడు
-అసెంబ్లీకి పంపండి… మంగళగిరిని నెం.1గా నిలబెడతా
-రాజధాని నిర్మాణాలతో లక్షమందికి ఉపాథి అవకాశాలు
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్
మంగళగిరి: రాజధానిని అనుసంధానించే సీడ్ యాక్సిస్ రోడ్డును ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కోర్టు కేసులు వేసి అడ్డుకున్నారు, మంగళగిరి అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేసులను ఉపసంహరించుకోవాలి, 2నెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో రాజధానిని అనుసంధానించే రోడ్లనిర్మాణాలన్నీ పూర్తిచేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.
మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొలనుకొండ ఆర్ఆర్ రచన అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాజధాని నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తే లక్షమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ కు అవకాశం ఇవ్వడంవల్ల రాష్ట్రం ఏవిధంగా నాశనమైందో విద్యావంతులంతా ప్రజలను చైతన్యవంతం చేయాలి.
ముఖ్యమంత్రికి ఊరూరా ప్యాలెస్ లు కట్టుకోవడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు. కరకట్ట కమలాసన్ రోజుకో మాట మాట్లాడతాడు. మంగళగిరికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అవకాశం లేకపోతే గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి కి ఐటి పరిశ్రమలు ఎలా వచ్చాయి?
అభివృద్ధి చేయాలంటే చిత్తశుద్ధి అవసరం. అధికారంలో లేకపోయినా నేను ఒక ఐటి కంపెనీని రప్పించి 150మందికి ఉద్యోగావకాశాలు కల్పించాను. సొంత నిధులతో 29సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాను. టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని వీవర్స్ శాలను ఏర్పాటుచేశాం. 25సంవత్సరాలుగా ఇక్కడ అధికారం అనుభవించిన మురుగుడు కుటుంబం, ఆర్కే నియోజకవర్గానికి ఏం చేశారు?
నేను చేసిన అభివృద్ధిలో 10వవంతైనా చేయగలిగారా? కార్పొరేషన్ పేరుతో మంగళగిరి-తాడేపల్లి ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప చేసిందేమీ లేదు. అధికారంలో లేకపోతే భారీగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా. నాకు అవకాశం ఇస్తే మంగళగిరిని దేశంలోనే నెం.1 స్థానంలో నిలబెడతా. గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుతో 40వేలమంది స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. మంగళగిరికి ఐటి కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తానని లోకేష్ చెప్పారు.
యువనేత ఎదుట అపార్ట్ మెంట్ వాసుల సమస్యలు
కొలనుకొండ రచన అపార్ట్ మెంట్ వాసులు లోకేష్ కు సమస్యలు చెబుతూ… మా ప్రాంతంలో అప్రోచ్ రోడ్లు ఏర్పాటుచేసి రాజధాని, జాతీయ రహదారికి అనుసంధానం చేయాలి. డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. విట్, ఎస్ఆర్ఎం వంటి విద్యాసంస్థలకు వెళ్లే రోడ్లు బాగుచేయాలి. ప్రభుత్వోద్యోగుల సిపిఎస్ రద్దు అంశాన్ని పరిశీలించాలని కోరారు. యువనేత లోకేష్ సమాధానమిస్తూ… అధికారంలోకి వచ్చాక బ్లాక్ డెవల్ మెంట్ మోడల్లో రోడ్లు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, పార్కులు వంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. కేవలం పన్నుల కోసమే పంచాయితీని కార్పొరేషన్ గా మార్చారు.
స్థానికులతో చర్చించి మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాం. అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపించండి, అభివృద్ధిలో దేశంలోనే నెం.1 నియోజకవర్గంగా మంగళగిరిని నిలబెడతా. చంద్రబాబు, పవన్ తో కొట్లాడి మంగళగిరి అభివృద్ధికి నిధులు తీసుకొస్తా. ఎన్నికల రోజున కావాలని ఇబ్బందులు సృష్టిస్తారు, ఓపిగ్గా నిలబడి ఓటుహక్కు వినియోగించుకోండి. రాబోయేది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలనే విషయం మరువవద్దని యువనేత లోకేష్ విజ్ఞప్తి చేశారు.