September 22, 2026

కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే యరపతినేని

  • 2 కిలోమీటర్ల అంతిమయాత్రలో యరపతినేని
  • భుజం మార్చకుండా శ్మశానం వరకూ అంతిమయాత్రలో పాల్గొన్న యరపతినేని
  • చావులోనూ ఆత్మీయతను బతికించిన టీడీపీ యోద్ధ

( సుబ్బు)

రాజకీయ పార్టీల్లో ఆత్మీయత, మానవసంబంధాలను చెరిపేసి.. రాజకీయ వ్యూహకర్తలు, కన్సల్టెంట్లు, ‘సోషల్‌మీడియా గుమాస్తాలు’ పార్టీలను నడిపిస్తున్న ఈ ‘కృత్రిమ’ మేధ కాలంలో కూడా.. ఇంకా అవి సజీవంగా ఉన్నాయని నిరూపించిన గురజాల టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆవిష్కరించిన మానవీయ కోణమిది.

యరపతినేని శ్రీనివాసరావు.. అవసరాల కోసం పార్టీలు మారకుండా, దశాబ్దాల నుంచి టీడీపీ జెండా మోసే నిఖార్సయిన కార్యకర్తలకు పరిచయం అవసరం లేని పేరిది. కంగారు జంతువులా.. అధికారం ఉన్నా, లేకున్నా కార్యకర్తలను కడుపులో పెట్టుకునే నిఖార్సయిన పదహారణాల తెలుగుదేశం యోధుడు యరపతినేని. కార్యకర్తలే ఆయనకు ఆశ, శ్వాస. అందుకే పసుపు సైనికులకు యరపతినేని అంటే కొండంత ధైర్యం. ఇంకా చెప్పాలంటే అసలు ఆయనే వారి ధైర్యం.

పెళ్లి నుంచి చావు వరకూ.. బర్త్‌డే నుంచి ఓణీల ఫంక్షన్ల వరకూ.. కార్యకర్తల కుటుంబాల్లో ఏం జరిగినా, యరపతినేని అక్కడ ప్రత్యక్షమయి, నేనున్నానంటూ చేతనైన సాయం చేస్తారు. ఎవరూ చెప్పకపోయినా, ఏమీ అడగకపోయినా ఓ కుటుంబపెద్దలా వారి కష్టాల్లో తోడుంటారు. పార్టీలో పనిచేసి నష్టపోయిన కార్యకర్తలను, ఏదో ఒక రూపంలో ఆదుకునే ఆపన్నహస్తం అది.

‘చాలామంది’లా ‘వాడుకుని వదిలేసే’ రాజకీయాలకు యరపతినేని పూర్తి భిన్నం. తనకోసం నిలబడే కార్యకర్తకు తోడుండే నైజమే, ఆయనను ఇన్నిసార్లు ఎమ్మెల్యేను చేసింది. అందుకే యరపతినేని పల్నాడులో ఒక బ్రాండ్.

రాజకీయ ప్రత్యర్ధుల విషయంలో, ఇప్పటి నేతల్లా ఎక్కడా రాజీ పడని పోరాట యోద్ధ. పార్టీ అంటే పార్టీనే. రాజీలు, రాయబారాలుండవ్. కొంతమంది బడా నేతల మాదిరిగా.. కాంట్రాక్టుల కోసం నైతిక విలులకు తిలోదకాలిచ్చే నేత కాదు. పార్టీ కోసం పనిచేసే పసుపు సైనికుల కోసం ఆయన ఎక్కడదాకయినా, ఎందాకయినా వెళతారు. ఎవరితోనయినా యుద్ధం చేస్తారు. అందుకే యరపతినేని ఇమేజ్ ‘నాగార్జున సిమెంట్’లా ఇంకా అలాగే స్ధిరంగా నిలిచింది.

అలాగని ఆయనకేమీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. తండ్రులు, తాతల పేర్లు చెప్పుకుని పొలిటికల్ గ్రౌండ్‌లో దిగలేదు. పోరాటమే ఆయన బ్యాక్‌గ్రౌండ్. కోడెల సాహచర్యమే టీడీపీలో ఆయన నేర్చుకున్న పాఠాలు. పార్టీ కోసం జైలుకు వెళ్లొచ్చిన పోరాట యోద్ధ యరపతినేని!

అయితే.. ప్రజల కోసం.. కార్యకర్తల కోసం ఇంతచేసిన యరపతినేనిని, గురజాల ప్రజలు ఓసారి ఓడించారు. అది వేరే విషయం. అయినా పార్టీ కష్టకాలంలో కార్యకర్తల వెంట నిలబడి-ప్రత్యర్ధులపై కలబడిన యరపతినేని, మరోసారి తన మానవీయకోణాన్ని ఆవిష్కరించారు.

గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో కాపు నాయకుడు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నల్లబోతుల వెంకటేశ్వర్లు 1994లో యరపతినేనికి గురజాల సీటు ఇచ్చిన ప్పుడు, ఆయనకు దన్నుగా నిలబడ్డారు. పార్టీ అంటే ప్రాణం పెట్టే నల్లబోతుల సహకారం గుర్తుంచుకున్న యరపతినేని.. ఆయనకు మార్కెట్ యార్డు ఉపాధ్యక్ష పదవి, మండలపార్టీ కన్వీనర్ పదవి ఇచ్చి రుణం తీర్చుకున్నారు. తన కోసం-పార్టీ కోసం ఎందాకయినా వెళ్లే నల్లబోతుల హటాత్తుగా మృతి చెందారు.

ఆయన మరణవార్త తెలుసుకున్న యరపతినేని, నల్లబోతుల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. అంతేనా? నల్లబోతుల అంత్యక్రియల్లో పాల్గొని శ్మశానం వరకూ.. అంటే రెండు కిలోమీటర్లు భుజం మార్చుకోకుండా నల్లబోతుల భౌతికకాయాన్ని మోసి, తనను మోసిన నాయకుడి రుణం తీర్చుకున్నారు.

కొంతమంది నాయకులు మీడియాలో ప్రచారం కోసం.. కార్యకర్తల పాడెను నాలుగయిదడుగు మోసి, ఫోటోల తర్వాత తప్పుకుంటారు. కానీ యరపతినేని మాత్రం, తన ఉన్నతికి కారణమైన నాయకుల్లో ఒకరయిన నల్లబోతు పాడెను, శ్మశానం వరకూ మోయడం ద్వారా.. టీడీపీలో పైస్ధాయిలో ఆత్మీయత-అనుబంధం కనుమరుగయినా, కిందిస్థాయిలో అది ఇంకా సజీవంగానే ఉందని నిరూపించిన యరపతినేని మానవతావాదానికి, పసుపు సైనికులు జేజేలు పలుకుతున్నారు.
రాజకీయాల్లో ఎప్పటికయినా సజీవంగా ఉండేది ఆత్మీయత-అనుబంధమే తప్ప, కన్సల్టెన్సీల ‘కృత్రిమ’ మేధ.. సోషల్‌మీడియా మేధావుల అరువు ఆలోచనలు.. నకిలీ ఫొటో నవ్వులు కానే కాదు!

Total Visitors: 2,736,249