Home » కేసీఆర్‌ కు ఎమ్మెల్సీల ఝలక్

కేసీఆర్‌ కు ఎమ్మెల్సీల ఝలక్

– కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు
– కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి
-ఇప్పటికే ఎమ్మెల్యేలు పోచారం, సంజీవ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరిక
– కౌన్సిల్‌లో ఖాళీ అవుతున్న ‘కారు’

హైదరాబాద్: తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఫాంహౌసులో తీరికూర్చిని ‘మళ్లీమనమే వస్తం.. వచ్చినంక పదిహేనేళ్లు ఉంటం’ అని ఆశ చూపిస్తున్నా ఎవరూ నమ్మడం లేదు. అక్కడ సరేనని తలూపిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.. కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

తాజాగా బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు.. కారు దిగి కాంగ్రెస్‌కు జైకొట్టారు. వారికి సీఎం రేవంత్‌రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్‌లో ఆహ్వానించారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్య, భానుప్రసాద్, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్‌రెడ్డి నివాసంలో వారికి కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్‌మన్షీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

తెలంగాణ అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్‌లో చేరామని, రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తోందని నమ్మినందుకే తామంతా కాంగ్రెస్‌లో చేరుతున్నామన్నారు. మతతత్వ బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కే ఉందని వారు స్పష్టం చేశారు.

తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కారు దిగి, కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరటం, కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన ట్లయింది. కాగా మరో వారం రోజుల్లో.. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమయినట్లు సమాచారం.

Leave a Reply