– మోడీ మౌనం వ్యూహాత్మకమా ? లొంగుబాటా?
– మోడీకి భారత రాజకీయవేత్తలు లోకువ.. మోడీ ట్రంప్ కు లోకువా ?
(వి. ఎల్. ప్రసాద్)
సౌరవిద్యుత్ కాంట్రాక్టుల కోసం ఒడిస్సా , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, ఛత్తీస్ ఘడ్ , జమ్ము కాశ్మీర్ అధికారులకు , రాజకీయవేత్తలకు అదానీ గ్రీన్ సంస్థ 2,100 కోట్లు ముడుపులుగా ఇచ్చిందని , లంచాల వ్యతిరేక చట్టాలకు కట్టుబడి ఉంటామనే హామీని అతిక్రమించి ఆయా రాష్ట్రాల్లోని ప్రోజెక్టుల కోసం అమెరికాలో ఋణ సేకరణ చేసిందని , గత ఏడాది నవంబర్ లో జో బైడెన్ ప్రభుత్వ పాలనలో అమెరికా న్యాయశాఖ గుర్తించడం , ఆ మేరకు విదేశీ అవినీతి కార్యక లాపాల చట్టం క్రింద కేసులు నమోదు చేయడం అందరికి గుర్తుండే ఉంటుంది.
అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీలోకి అక్రమంగా 3 బిలియన్ డాలర్ల కు పైగా రుణాలు , బాండ్లు సేకరించిందని గత నవంబర్ లో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. అదానీ బంధువైన సాగర్ అదానీ , మరో ఏడుగురిపై కేసులు కూడా నమోదు చేసింది అమెరికా ప్రభుత్వం. కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిలిపి వేసి ఆదానీకి , మోడీకి ఊరట కలిగించింది .
ట్రంప్ తో సమావేశం కొరకు మోడీ అమెరికా బయలుదేరే ముందు ట్రంప్ ప్రభుత్వం నుండి ఈ ప్రకటన వెలువడింది. అదానీ కోసం ట్రంప్ ఇచ్చిన బహుమతిగా మోడీ ఆనందించి ఉంటారు. ట్రంప్ , మోడీ ల మధ్య స్నేహం ఉందనేది అందరికీ తెలిసినదే. కానీ పొట్ట చేత పట్టుకుని అమెరికాకు చేరిన భారతీయులు , అమెరికా అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన భారతీయులకు ఊరట కల్పించలేక పోయింది ట్రంప్ ప్రభుత్వం.
అదానీ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని మోడీని ట్రంప్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం అదానీ కోసం ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా భరిస్తున్నారు మోడీ . అన్నిటికి తలాడిస్తున్నారు. నష్ఠ దాయక ఒప్పందాలు చేస్తున్నారు. ఇదంతా అదానీ కోసమే . విదేశీ అవినీతి కార్య కలపాల చట్టం ( FCPA – 1977 ) అమలునే ఆపివేశాడు ట్రంప్ .అదానీ కోసం ఎన్ని అడ్డ దారులైన తొక్కేందుకు మోడీ సిద్ద పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దీనికి ఉదాహరణ సౌర విద్యుత్ ప్రోజెక్టుల కోసం సరిహద్దు భద్రతా నిబంధనలను తుంగలో తొక్కి , అదానీ సంస్థలను అనుమతులు ఇవ్వడం. సరిహద్దు భద్రతా నిబంధలను సవరించి ప్రపంచం లోనే అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి కేంద్రం గుజరాత్ లోని ఖావ్ డా లో నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగింది. 2020 లో ప్రధాని స్వయంగా ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. దేశ సరిహద్దు నుండి 10 కి .మీ వరకు ఎలాంటి నిర్మాణాలు చేప్పట్టరాదనే రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారు.
ఖావ్ డా ప్రాజెక్ట్ పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 1 కి .మీ దూరంలోనే ఉంది. ఆ ప్రాంతంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీ అధికారంలో ఉండడం వల్ల సాధ్యమయ్యింది. భూముల కేటాయింపులు కూడా ఉదారంగా అప్పగించారు. భద్రతా నిభందనలు సవరించి మరీ అప్పగించారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహా రావు సరళీకృత ఆర్ధిక విధానాలను అనుసరించి ,మిశ్రమ ఆర్ధిక వ్యవస్థతో మొదలైన ప్రైవేటు ప్రస్థానం.. నిదానంగా కార్పొరేట్ అధిపతులకు ఎర్ర తివాచీ పరచి జీ హుజూర్ అనే స్థితికి ప్రభుత్వాలు దిగజారాయి.
గతంలో దేశ కీలక సంస్థలు అన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉండేవి. ఇప్పుడు ప్రపంచీకరణ, సరళీకరణ పేరుతో బడా కార్పొరేట్ల రాజ్యంగా మారి, వేల కోట్ల పెట్టుబడులతో దేశ ఆర్ధిక వ్యవస్థను, ప్రభుత్వాలను శాసించే స్థితికి చేరుకున్నాయి. వీటి ధాటికి ప్రభుత్వాలే నిలదొక్కుకోలేక కూలి పోతున్నాయి. అంటే వీరే కూల్చివేస్తున్నారు.
శ్రీలంకలో పవన విద్యుత్ ప్రాజెక్టు నుండి వైదొలుగుతున్నట్లు అదానీ సంస్థ వెల్లడి చేసింది. అమెరికాలో కేసులు నమోదు కావడం, మోడీ ఈ ప్రాజెక్టు కోసం గత శ్రీలంక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసాడని , నూతనంగా శ్రీలంక ప్రధానిగా ఎన్నికైన దిసనాయకే అదానీ ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. అదానీ ప్రాజెక్టులపై సమీక్ష కూడా చేపట్టింది. అందుకే అదానీ ఆ ప్రాజెక్టు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించవలసి వచ్చింది. ట్రంప్ భేటీలో అదానీ విషయం వచ్చిందా అని ఓ విలేఖరి ప్రశ్నిస్తే.. వ్యక్తిగత విషయాలు చర్చించడం భావ్యం కాదు అని నమ్మగర్బంగా సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే లంచాలు ఇవ్వడం , సంపదను దోచుకోవడం వ్యక్తిగత విషయాలుగా మారి పోయాయా ? ట్రంప్ కు మోడీ లోకువైనట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అదే మోడీకి దేశంలోని రాజకీయ నాయకులు లోకువైనారు. ట్రంప్ ఎంత అడ్డగోలుగా మాట్లాడినా , తాజా బ్రిక్స్ సమావేశం పట్ల అడ్డగోలుగా మాట్లాడి , బ్రిక్స్ దేశాలకు అదనంగా 10 % సుంకాలు విధిస్తామని , భారత్ ను కూడా వదిలేదిలేదని గుచ్చి గుచ్చి మాట్లాడడం..మోడీ ఎడల చులకన భావం ఉండడమే.
పదే పదే ఎక్కడైనా, ఏ సమావేశం లోనైనా భారత్ ఊసు తీసుకురావడం ట్రంప్ కు పరిపాటిగా మారింది. అధికారం చేపట్టిన లగాయితు డాంబికాలు పోతూ , నేను లేస్తే మనిషిని కాదు అంటూ హుంకరించడం మొదలు పెట్టాడు. జులై 9 లోపు నాతో ఒప్పందానికి రాకపోతే సుంకాలు భారీగా వడ్డిస్తానని ప్రకటించాడు.
జులై 9 కూడా అయిపోయింది. ఏ దేశము అమెరికాతో ఒప్పందానికి రాలేదు. చేసేది లేక మరల ఆగస్టు 1 వరకు పొడిగించాడు. 14 దేశాలకు ఎంతెంత సుంకాలు విధించేది అందులో తెలియజేసాడు. రష్యాతో వ్యాపారం చేస్తే భారత్ , చైనాలకు 500 శాతం సుంకాలు విధిస్తానని కూడా ప్రకటించాడు. అన్నిటికి మోడీ మౌనం దాల్చడం వ్యూహాత్మకమా ? లేక లొంగుబాటా అనేది కాలమే నిర్ణయించాలి.