-అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీ రాజకీయంలో భాగంగా నేను భావిస్తున్నా
-అభినందించడానికి జూ.ఎన్టీఆర్ కొత్తగా వచ్చిన నటుడు కాదు..
-చంద్రబాబు ఎంత పనికిమాలిన వ్యక్తో మోడీ, అమిత్ షాకు తెలుసు
-కేంద్రమంత్రి అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై వైయస్‌ఆర్ సీపీ రీజనల్ కోఆర్డీనేటర్, మాజీ మంత్రి కొడాలి నాని
విజయవాడ: ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా ఎవరినైనా కలిశారంటే.. దాని వెనుక పూర్తి రాజకీయ కారణాలే ఉంటాయని, బీజేపీని ఎలా విస్తరింపజేయాలనే ఉద్దేశం తప్ప వారికి వేరే ఆలోచన ఉండదని, అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ని అమిత్‌షా కలిసినట్టుగా తాను భావిస్తున్నానని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేంద్రమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాజకీయ కారణాలు లేకుంటే మోడీ, అమిత్ షా ఎవరితోనూ మాట్లాడరన్నారు. జూ.ఎన్టీఆర్‌తో దేశమంతా ప్రచారం చేయించే అవకాశం ఉందని భావిస్తున్నానన్నారు.
కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారంటే..
‘‘దేశంలో బీజేపీని ఎలా విస్తరింపజేయాలి. కూటములు లేకుండా బీజేపీని సొంత కాళ్లపై ఎలా అధికారంలోకి తీసుకురావాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి, ప్రతిపక్షంలోకి ఎలా తీసుకురావాలనే పనిగా మోడీ, అమిత్ షా పనిచేస్తారు. వారికి వేరే ఉద్దేశం ఉండదు. మోడీ, అమిత్ షా ఎవరితోనైనా మాట్లాడినా పూర్తిగా రాజకీయ కారణాలు తప్ప.. అభినందించడానికి, యాక్షన్ బాగుందని కితాబివ్వడానికి కలవరు. జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా వచ్చిన నటుడు కాదు. 25 సినిమాలపైనే చేశాడు. జూ.ఎన్టీఆర్ సినిమాలు అమిత్ షా చాలా చూసి ఉంటాడు. కొత్తగా అభినందించడానికి పిలిచారని నేను భావించడం లేదు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వలేదు. ఎందుకంటే చంద్రబాబు ఎంత పనికిమాలిన వ్యక్తి అనే విషయం అమిత్‌షాకి తెలుసు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, బీఆర్ నాయుడు కలిసి చంద్రబాబు, పవన్‌లను అద్భుతం అంటారు. ఎందుకంటే వారు అంతకంటే దిగజారిన వ్యక్తులు కాబట్టి.. చంద్రబాబు ఎంత పోటుగాడో మోడీ, అమిత్‌షాకి బాగా తెలుసు. వారి పార్టీని విస్తరింపజేయడానికి అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో వెళ్తుంటారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి ఉంటారని నేను అనుకుంటున్నాను’’ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.