– ఓటింగ్ శాతం పెరిగితే బోగస్ నేతలు ఢమాల్
– ఓట్ బ్యాంక్ రాజకీయాలకు చెక్ పెడదాం రండి
-సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
విజయవాడ: ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలంటే, ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలని, అపుడే ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు చెక్ పెట్టగలమని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఏ కొద్ది మందో, తమ వాళ్ళు ఓట్ చేస్తే చాలు, అందలం ఎక్కి చెలాయించవచ్చని ఇప్పటి నేతలు భావిస్తున్నారని, అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సింది యువ ఓటర్లే అని అన్నారు. విజయవాడలో శనివారం పొట్టిశ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో యువ ఓటరు చైతన్య వేదికలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
యువ ఓటర్లలో చైతన్యం కలిగించేలా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మనధేశంలో ఎపుడూ 60 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు అవుతోందని, అది నూరు శాతం పెరిగితే, ఫలితాలు తారుమారు కావడం ఖాయమన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడం ద్వారా, ఎన్నికల సంస్కరణలు చేద్దామని, ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఓటు వేయని వారికి సౌకర్యాలు కట్ చేయాలని, ఓటర్లను మభ్యపెట్టే వారిపై కఠిన చర్యలుండాలని అన్నారు.
ప్రపంచంలో 23 దేశాల్లో ఓటు కంపల్సరీ అని, మన దగ్గర ఓట్లు తగ్గేలా పార్టీలే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. యువత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన జేడీ, తాను యువతలో చైతన్యం తెచ్చి, కొత్త ఆలోచనల దిశగా పయనిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాను కీలకపాత్ర పోషిస్తానన్నారు.