Suryaa.co.in

Andhra Pradesh

ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాకు సొమ్ము

  • రైతు సహాయక కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు

  • రైతులకు 50 శాతం సబ్సిడీతో టార్పాలిన్ల సరఫరా

  • ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డు

  • కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి.. ప్రతి అడుగులో రైతుకి పెద్దపీట వేస్తాం

  • అన్నదాతకు ఎలాంటి కష్టం లేకుండా అండగా నిలబడతాం

  • గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది

  • గత పాలకులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.1674 కోట్లు బకాయిపెట్టేశారు

  • పౌరసరఫరాల శాఖనూ అప్పుల్లో ముంచేసింది

  • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించింది

  • చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రానికి పునర్వైభవం తెస్తాం

  • ఏలూరు రైతుల ధాన్యం బకాయిల చెల్లింపు కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

  • రైతులకు రూ. 674 కోట్ల ధాన్యం బకాయిల విడుదల

ఏలూరు: ‘కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతు పక్షపాతిగా నిలబడుతుంది. రైతన్నకు పెద్దపీట వేస్తుంది. రైతుకి ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడుతుంది. అన్నదాతకు ఆర్ధిక కష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిలబడుతుంద’ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.

ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టిందనీ, రైతాంగం పడిన కష్టాలు ప్రత్యక్షంగా చూశామని, అలాంటి కష్టాలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ధాన్యం అమ్మిన 48 గంటల్లోపు సొమ్ము ఖాతాల్లో పడే ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పంటల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకి అండగా నిలిచేందుకు పౌరసరఫరాల శాఖ, కూటమి ప్రభుత్వం నిరంతరం పని చేస్తాయని హామీ ఇచ్చారు.

సోమవారం ఏలూరు జిల్లా కేంద్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులకు గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను విడుదల చేశారు. గత ప్రభుత్వం రైతులకు రూ. 1674 కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు ఉంచింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ. 674 కోట్లను ఏలూరులో మనోహర్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులకు రూ. 472 కోట్ల ఒకేసారి రైతుల ఖాతాల్లో వేసే ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ధాన్యం బకాయిలు ఆలస్యం అయినందుకు ప్రభుత్వం తరఫున రైతులను క్షమాపణలు కోరుతున్నాను. గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఎన్నో కష్టాలు పడినా తట్టుకుని మీరంతా ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ధాన్యాన్ని అమ్ముకున్నా చేతికి డబ్బు చేరలేదు. నిబంధనలకు లోబడి రైతులు ధాన్యం అమ్ముకున్నా ప్రతి అడుగులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల వల్ల ఎంత నష్టం వాటిల్లిందో చూశాం.

అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాల్లో పర్యటించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని అడిగితే, నాటి ప్రభుత్వంలో ఉన్న వారు రైతుల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందిపెట్టారు. మిల్లర్ వద్దకు ధాన్యాన్ని తరలిస్తే రెండు రోజుల తర్వాత రమ్మనడం, స్లిప్పు తీసుకువెళ్తే తేమ శాతం తేడా ఉందని చెప్పడం. రైతుల నుంచి డబ్బు వసూలు చేయడం వంటి పనులు చేశారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులకు బ్యాంకర్లు ఫోన్లు ఎత్తడం మానేశారు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆవేదన గురించి సమీక్ష జరిపితే అధికారులు చెప్పిన లెక్కలు చూసి భయం వేసింది. పౌరసరఫరాల కార్పోరేషన్ ని రూ. 40,550 కోట్ల రుణాల్లో ముంచేశారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 1674 కోట్ల ఉన్నాయని చెబితే వారిని ఎలా ఆదుకుంటామో అర్ధం కాలేదు. నెల రోజుల్లోపే నిధులు సమకూర్చుకుని వారికి ఇవ్వాలని కూర్చున్నాం. అధికారులను ఢిల్లీకి పంపి నాబార్డు, ఎన్సీడీసీ అధికారులతో మాట్లాడి రుణాలు తెచ్చే ప్రయత్నాలు చేశాం.

గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక అరాచకాలకు బ్యాంకర్లు ఫోన్లు ఎత్తడం మానేశారు. పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తే రైతులకు వెంటనే బకాయిలు చెల్లించే ఏర్పాటు చేయమన్నారు. ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి తెలియపర్చి సమన్వయపరచుకుంటూ గత నెలలో రూ. వెయ్యి కోట్లు చెల్లించే అద్భుత కార్యక్రమం చేశాం. మిగులు రూ. 674 కోట్లు ఇప్పుడు ఒకేసారి చెల్లించి రైతులకు భరోసా కల్పించే కార్యక్రమం చేపట్టాం.

రైతులకూ ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్తింపు

గత ఐదేళ్లుగా రైతులు పడిన కష్టాలు మామూలు విషయం కాదు. ధాన్యం కొనుగోళ్ల నుంచి గిట్టుబాటు ధర వరకు అప్పట్లో మీ తరఫున పోరాటాలు చేశాం. టీడీపీ నేతలు కూడా రైతుల పక్షాన పర్యటనలు చేశారు. జనసేన పార్టీ తరఫున కౌలు రైతు భరోసా యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఈ జిల్లాలో 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడాన్ని నమ్మలేకపోయాం. కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులకు గౌరవం దక్కే ఏర్పాటు చేస్తాం.

పండించిన పంటకు సకాలంలో చెల్లింపులు చేయాలన్న ఆలోచనను ఈ రోజు అమలు చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను రైతు సహాయ కేంద్రాలుగా మార్చాము. ఈ పంట ద్వారా సీసీఐసీ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేసి కౌలు రైతులందర్నీ ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మమ్మల్ని నిలబెట్టిన రైతుల రుణం తీర్చుకుంటాం. గత ప్రభుత్వంలో దళారులు రైతు భరోసా కేంద్రాలను వారి స్వార్ధానికి వాడుకున్నారు.

రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికీ 62 శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వ్యాపారవేత్తలతోపాటు రైతులకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సౌకర్యం కల్పిస్తాం. రైతు సహాయక కేంద్రాలకు వెళ్తే సంతృప్తి కలిగే విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తాం.

వచ్చే ఖరీఫ్ లో 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం పక్షాన మాటిస్తున్నాం. గత ప్రభుత్వం గోతాలు, ధాన్యం రవాణా విషయంలో రైతులకు అండగా నిలిచింది లేదు. వ్యవసాయ పరికరాలను విస్మరించారు. కూటమి ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ నుంచి రైతులకు 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించాము. రైతులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుంది. మా మీద నమ్మకంతో ఓటు వేసి బాధ్యత అప్పగించిన ప్రజల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 150 కందిపప్పు సరఫరా చేస్తున్నాం. బియ్యం విషయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వం కంప్యూటర్ చీటీ పేరిట దొంగ ప్లాన్ వేసి కొంత మంది మిల్లర్లకే రైతులు అమ్మే విధంగా పథకం వేసింది.

కూటమి ప్రభుత్వంలో రైతులు దగ్గరలో ఉన్న మిల్లర్లకే ధాన్యం అమ్మే విధంగా చర్యలు తీసుకుంటాం. రైతులను కాపాడుకుంటాం. ఎక్కడా నష్టపరచం. పౌరసరఫరాల శాఖ రుణాలు రూ.40 వేల కోట్లలో వచ్చే మార్చి 31 నాటికి రూ. 10 వేల కోట్లు తిరగి బ్యాంకర్లకు చెల్లించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కష్టపడుతున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో అద్భుతమైన వేర్ హౌస్ లు ఏర్పాటు చేస్తాం. ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడదు. ప్రతి గింజా కోనుగోలు చేసే విధంగ పని చేస్తాం. వ్యవసాయ శాఖ, మార్కెంటింగ్ శాఖ, పౌరసరఫరాల శాఖలు సమన్వయంగా పని చేసి ఈ క్రాప్ ద్వారా నష్టపోయిన ప్రతి గింజకి పరిహారం అందే ఏర్పాటు చేస్తామ’ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, రోషన్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ, పౌరసరఫరాల శాఖ ఎండీ వీర పాండియన్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి శెల్వి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE