* చేనేతలకిచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబు
* నేడు 3 పథకాలకు శ్రీకారం
* రూ.189.62 కోట్లతో ఉచిత విద్యుత్ పథకం అమలు
* మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం
* రూ.5 కోట్ల త్రిఫ్ట్ పథకం నిధులు మంజూరు
* చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ మినహాయింపు
* ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఎంతో మేలు
* మగ్గాలపై నేసే నేతన్నలకు ఏడాదికి రూ.14,956లు
* మర మగ్గాలపై ఆధారపడిన నేతన్నలకు రూ32,604ల లబ్ధి
* చేనేతలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట
* 365 రోజులూ ఉపాధి… నేతన్నల ఆర్థిక వృద్ధికి పథకాల రూపకల్పన
* 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్
* ముద్ర రుణాలు, నూలు సబ్సిడీ అందజేత
* క్లస్టర్లు, టైక్స్ టైల్స్ పార్క్ ల ఏర్పాటు
* మంత్రి లోకేశ్ స్ఫూర్తితో రాష్ట్రంలో వీవర్ శాలల నిర్మాణానికి ప్రణాళికలు
* విశాఖలో రూ.172 కోట్లతో యూనిట్ మాల్ నిర్మాణం
అమరావతి : సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో చేనేతల బతుకుల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఏడాది కాలం నుంచి నేతన్నలు తమ కాళ్ల మీద తామే నిలబడి, గౌరవప్రదమైన జీవనం సాగించేలా బృహత్తర కార్యక్రమాలకు నాంది పలికింది.
ఒకవైపు నేతన్నలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించి వారి ఆర్థిక ఉన్నతికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం తరవాత అత్యధిక మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. 2.50 లక్షల మంది చేనేత వస్త్రాల తయారీనే జీవనాధారంగా చేసుకున్నారు. ఏపీలో 986 చేనేత సహకార సంఘాలు నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నాయి.
రాష్ట్రంలో చేనేత రంగం రూ.1,374 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు ప్రోత్సాహం కరవ్వడంతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కూడా లభించలేదు. దీంతో 2019-24 కాలంలో రాష్ట్ర చేనేత రంగంలో చీకటి కాలంగా మిగిలిపోయింది.
సీఎం చంద్రబాబు నాయుడు, యువగళం పాదయాత్ర ద్వారా మంత్రి నారా లోకేశ్ చేనేత కష్టాలను చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన హామీలనను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చేనేతలకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో నేతన్నలకు ప్రత్యేక యూనిట్లు కేటాయిస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి రూ.10 వేల కోట్ల పెట్టుబడితో నూతన టెక్స్ టైల్స్ పాలసీని తీసుకొచ్చింది.
ఈ పాలసీ ద్వారా 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం, చేనేత వస్త్రాలపై అయిదు శాతం మేర జీఎస్టీ మినహాయింపు, త్రిఫ్ట్ నిధులు మంజూరు పథకాలకు సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుడుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంలో భాగంగా నేతన్నలను వ్యాపారులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు.
నేతన్నకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్
2024లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం కూడా చేనేతలకు మరోసారి అండగా నిలిచింది. 50 ఏళ్లు నిండిన్న నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నారు. 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ మొత్తం పెంచారు. ఈ ఏడాది జూన్ వరకూ రూ.545.50 కోట్లు నేతన్నల పెన్షన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించింది.
ముద్ర రుణాలు, నూలు సబ్సిడీ అందజేత
క్యాష్ క్రెడిట్ కార్డులతో సహకార సంఘాల బలోపేతానికి బ్యాంకు రుణాలు అందజేస్తోంది. గతేడాది 116 చేనేత సహకార సంఘాలకు రూ.40.87 కోట్లను జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా అందజేసింది. ఈ ఏడాది 110 సంఘాలకు రూ.37.75 కోట్లు రుణమివ్వడానికి నిర్ణయించింది. ప్రధాన మంత్రి చేనేత ముద్ర యోజన పథకం(ముద్ర) కింద నేతన్నలకు గతేడాది వర్కింగ్ కాపిటల్ నిమిత్తం రూ.33.25 కోట్లు అందించింది. 3,367 నేతన్నలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల రుణ సదుపాయం కల్పించింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో జూన్ వరకు 294 మందికి రూ.2.57 కోట్లు మంజూరు చేసింది.
ముడి పదార్థాల సరఫరా పథకం నూలు కొనుగోలుపై కూటమి ప్రభుత్వం 15 శాతం సబ్సిడీ అందజేస్తోంది. సహకార సంఘాలకు, వ్యక్తిగతంగా పలువురు నేతన్నలకు రూ.164.24 కోట్ల విలువైన నూలును 15 శాతం సబ్సిడీపై ఇవ్వగా, దీనివల్ల లబ్ధిదారులకు రూ.24.63 కోట్ల మేర లబ్ధి కలిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 135 మంది స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు రూ.13.50 లక్షల విలువైన నూలును ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున కూటమి ప్రభుత్వం అందజేసింది.
క్లస్టర్లు, టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు…
కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో అయిదు ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తోంది. రాష్ట్రంలో టెక్స్ టైల్స్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఎమ్మిగనూరుతో పాటు రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు నిర్మించనుంది. ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కును 77 ఎకరాల్లో నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన కూడా చేసింది.
చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు కూడా ఏర్పాటు చేయనుంది. మంగళగిరి మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014-19లో రూ.50.15 కోట్లతో 54 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. జాతీయ హ్యాండ్లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 2024-25లో రూ.10.44 కోట్లతో 10 క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. ఈ క్లస్టర్లతో 2,020 మంది లబ్ధిపొందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ సాయంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రూ.38.21 కోట్లతో భారీ చేనేత క్లస్టర్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ క్లస్టర్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి లబ్ధి చేకూరనుంది. మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన వీవర్ శాల మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది
రూ.80 కోట్ల మేర ఆప్కో అమ్మకాలు
మారుతున్న కాలనుగుణంగా నూతన వస్త్రాల తయారీలో అయిదు జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. చేనేత వస్త్రాల విక్రయాలకు రాష్ట్రంతో పాటు దేశంలోని ఏడు నగరాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. ఆప్కో నేతృత్వంలో ఈ కామర్స్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే చేనేత వస్త్రాలను డెలివరీ చేస్తోంది. ఏడాది కూటమి పాలనలో ఆప్కో షోరూమ్ ల ద్వారా రూ.80 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఈ కామర్స్ ద్వారా రూ.40 లక్షల మేర అమ్మకాలు జరపడం విశేషం.
నేటి తరం అభిరుచులకు అనుగుణంగా చేనేత రెడీమేడ్ వస్త్రాలను రూపొందించి ఆప్కో షోరూమ్ ల ద్వారా అమ్మకాలు చేపట్టింది. ఏడాదిలో రాష్ట్రంలో అయిదు ఆప్కో షోరూమ్ లను ప్రభుత్వం ప్రారంభించింది. నేతన్నలకు 365 రోజుల పాటు పనిదినాలు కల్పించడంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ తోనూ ఒప్పందం చేసుకుంది.
ఓడీఓపీ అవార్డుల వెల్లువ
రాష్ట్రంలో చేనేత రంగానికి సీఎం చంద్రబాబునాయుడు తీసుకుంటున్న సత్ఫలితాలిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే వన్ డ్రిస్ట్రిక్-వన్ ప్రొడెక్ట్(ఓడీఓపీ) అవార్డులు. కేంద్ర ప్రభుత్వం 29 ఓడీఓపీ అవార్డులు ప్రకటిస్తే, అందులో 9 అవార్డులు ఏపీకే సొంతమయ్యాయి. వాటిలో 4 అవార్డులు చేనేత ఉత్పత్తులు దక్కాయి. ఓడీఓపీ రాష్ట్ర స్థాయి అవార్డుల్లో ఏపీ బంగారు పతకం సాధించింది. భవిష్యత్తులో మరిన్ని ఓడీఓపీ అవార్డుల సాధనే ధ్యేయంగా చేనేత కార్మికులకు నైపుణ్యం పెంపుదలకు శిక్షణా కార్యక్రమాలు, తయారైన ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపునకు పెద్దపీట వేస్తోంది. 20 చేనేత ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం రూ.24 లక్షలు వెచ్చిస్తోంది.
నూతన డిజైన్లకు ప్రోత్సాహం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేత వస్త్రాల వినియోగం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా నేతన్నలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏపీ స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా అయిదు జిల్లాల్లో నైపుణ్య శిక్షణలు నిర్వహించగా 180 మంది లబ్ధి పొందారు. చేనేత కార్మికుల్లో నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో, నూతన డిజైన్లపై దరఖాస్తులను కూటమి ప్రభుత్వం నేతన్నల నుంచి ఆహ్వానించింది. ఉత్తమ డిజైన్లకు రూ.5 లక్షల వరకూ బహమతులు అందజేయనుంది.
నేడు 3 పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ, సీఎం చంద్రబాబునాయుడు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి గురువారం శ్రీకారం చుడుతున్నారు. చేనేత దుస్తులపైనా 5 శాతం జీఎస్టీ మినహాయింపు పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. చేనేతలకు రూ.5 మేర త్రిఫ్ట్ నిధులు మంజూరు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.190 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది.
జీఎస్టీ మినహాయింపునకు ఏడాదికి రూ.15 కోట్లను నేతన్నలకు చెల్లించాలని నిర్ణయించింది. ఉచిత విద్యుత్ పథకంతో మగ్గాలపై నేసే నేతన్నలకు నెలకు1,233ల చొప్పున్న ఏడాదికి రూ.14,956లు, మర మగ్గాలపై ఆధారపడిన వారికి నెలకు రూ. 2,717ల చొప్పున్న 32,604ల మేర లబ్ధి కలగనుంది. చేనేత కుటుంబాలకు త్వరలో ఆరోగ్య బీమా పథకం వర్తింప జేయడానికి ప్రణాళికలు రూపొందించింది. త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టింది.