Suryaa.co.in

National

ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా- భాజపాకు మిశ్రమ ఫలితాలు

దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఆశించినంతగా రాణించలేకపోయింది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ మూడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుని భాజపాకు షాక్ ఇచ్చింది. అటు బంగాల్లో టీఎంసీ క్లీన్స్వీప్ చేసి మొత్తం నాలుగు స్థానాల్లో గెలుపొందింది.
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల్లో దాదాపు అధికార పార్టీలకు చెందిన అభ్యర్థులే గెలుపొందారు. మొత్తం మూడు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. భాజపా, కాంగ్రెస్, శివసేన ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అసోంలో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలను అధికార ఎన్డీఏ కైవసం చేసుకున్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం అశించిన ఫలితాలు రాబట్టుకోలేక పోయింది.అసోంలో థోవ్రా, భవానీపుర్, మరియాని, గోసెన్ గావ్, తముల్పుర్లో భాజపా, దాని మిత్రపక్షం యూడీడీఎప్ అభ్యర్థులు గెలుపొందారు.
బెంగాల్లో టీఎంసీ హవా..
బంగాల్లో అధికార టీఎంసీ హవా కొనసాగింది. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలు దిన్హాటా, శాంతిపుర్, గోసబ, ఖార్దహలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది.
ఇందులో రెండు భాజపా నుంచి కైవసం చేసుకున్నవి కావడం గమనార్హం.
హిమాచల్లో భాజపాకు షాక్..
హిమాచల్ ప్రదేశ్లో అధికార భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది.ఉపఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలు జుబ్బల్-కోట్కాయ్, ఫతేపుర్, అర్కీలో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది.
మండీ లాక్సభ స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థి, మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభా సింగ్ గెలుపొందారు.
కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. సింగ్డిలో అధికార భాజపానే గెలిచింది. హంగల్లో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసిన జేడీఎస్కు డిపాజిట్ కూడా దక్కలేదు.
మధ్యప్రదేశ్లో ఖండ్వా లోక్సభ్ స్థానంలో భాజపా గెలిచింది. పృథ్వీపుర్, జోబత్ అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార పార్టి గెలిచింది. రాయ్గావ్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
రాజస్థాన్‌లో ఉపఎన్నికలు జరిగిన ధరియావాడ్‌, వల్లభ్‌నగర్‌ స్థానాలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
మిజోరంలో తూయిరియాల్ అసెంబ్లీ ఉపఎన్నికలో అధికార మిజోనేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది.
హరియాణా ఎల్లెనాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఐఎన్ఎల్డీ అభ్యర్థి అభయ్ చౌతాలా భాజపా అభ్యర్థిపై గెలుపొందారు.
బీహార్లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. కుశేశ్వర్ అస్థాన్లో అధికార జేడీయూ గెలిచింది. తారాపుర్లోనూ జెండా ఎగురవేసింది.
మేఘాలయలో రెండుచోట్ల ఎన్నికలు జరిగితే…అధికార ఎన్పీపీ, యూడీపీ అభ్యర్థులు గెలిచారు.
కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ లోక్సభ స్థానంలో శివసేన విజయం సాధించింది.
ఆంధ్రప్రదేశ్ బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార వైకాపా గెలిచింది.
తెలంగాణ హుజూరాబాద్ ఉపఎన్నికలో భాజపా గెలుపొందింది.

LEAVE A RESPONSE