-బాబు-పవన్ సన్మానానికి సమయం అడిగాం
-సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదు
-అశ్వనీదత్, అల్లు అరవింద్ వెల్లడి
అమరావతి: ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్ , నిర్మాతలు సి.అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, డి.సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.