Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో కొత్తగా సినిమా టికెట్ల రేట్లను ఎక్కడా తగ్గించలేదు

– గతంలో ఉన్న రేట్లే ఇప్పుడు అమలవుతున్నాయి
– దీనివల్ల ఎగ్జిబిటర్లకు ఎటువంటి నష్టం ఉండదు
– ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేయడం లేదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

తాడేపల్లి, డిసెంబర్ 28: సినిమా పరిశ్రమలో మాట్లాడే కొంత మంది వ్యక్తులు బోడి గుండుకు, మోకాలికి ముడి వేస్తూ సినిమా టికెట్ల రేట్లు తగ్గించామని అంటున్నారని, రాష్ట్రంలో కొత్తగా సినిమా టికెట్ల రేట్లను ఎక్కడా తగ్గించలేదని, గతంలో ఉన్న రేట్లే అమలవుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. గతంలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు ప్రతి సినిమా విడుదలకు ముందు కోర్టుకు వెళ్ళి రెండు వారాల పాటు రూ.300 లు, రూ.200 లు, రూ.100 లు అమ్ముకోవడానికి పర్మిషన్ కోరుతూ ఆర్డర్ తెచ్చుకునే వారన్నారు. దారుణంగా, భయంకరంగా సినిమా టికెట్ల రేట్లను పెంచి అమ్మేవారన్నారు. ఒక కమిటీ వేసి సినిమా టికెట్ల ధరలు ఎంత ఉండాలో నిర్ణయించాలని గత ప్రభుత్వాలకు కోర్టులు సూచించాయన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహనరెడ్డి ఒక కమిటీని ఏర్పాటు చేసి సినిమా టికెట్ల రేట్లు గతంలో మాదిరిగానే ఉండాలని, కోర్టులకు వెళ్ళి పెంచుకునే పరిస్థితి ఉండకూడదని జీవో 35 ను తీసుకువచ్చామన్నారు. గతంలో ఉన్న సినిమా టికెట్ల రేట్లను తమ ప్రభుత్వం ఎక్కడా తగ్గించనే లేదన్నారు. గతంలో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే సినిమాలు నడుస్తున్నాయన్నారు. కోర్టుల పర్మిషన్ తో అడ్డగోలుగా దోచుకోవడానికి అవకాశం లేకుండా మాత్రమే చేశామన్నారు. సినిమా టికెట్ల రేటు తగ్గితే ఎగ్జిబిటర్లు నష్టపోతారని చెబుతున్నారన్నారు. సినిమా టికెట్ రేటు ఎంత అమ్మితే వచ్చిన దాన్నంతా ఎగ్జిబిటర్ తీసేసుకుంటాడా అని ప్రశ్నించారు. రూ.100 లకు టికెట్ అమ్మితే వచ్చిన మొత్తాన్ని ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కు వెళ్ళకుండా ఎగ్జిబిటర్ కు వెళ్తుందా అని అన్నారు. ఎగ్జిబిటర్లు క్యాంటీన్లు, సైకిల్, కార్లు, స్కూటర్ స్టాండ్లను నడుపుకుంటారని, ప్రభుత్వం వాటి జోలికి వెళ్ళలేదన్నారు.

టికెట్ ధర ఎంత ఉన్నా రూ. 3 లు చొప్పున ఇచ్చే మెయింటినెన్స్ ఛార్జిని ప్రభుత్వం తగ్గించలేదన్నారు. ఎగ్జిబిటర్ కు డిస్ట్రిబ్యూటర్ పట్టణ ప్రాంతాల్లో ఒకలా, గ్రామీణ ప్రాంతంలో మరోలా, ఏసీ, నాస్ఏసీ అయితే ఇంకోలా అద్దెను చెల్లిస్తాడన్నారు. ఒకవేళ టికెట్ రేట్లు తగ్గితే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కు వచ్చే కలెక్షన్లు తగ్గుతాయని, ఎగ్జిబిటర్ కు వచ్చే నష్టమేమీ ఉండదన్నారు. ఎగ్జిబిటర్ ను అడ్డం పెట్టి పైనున్న వాళ్ళు ఆడుతున్న గేమ్ గా దీన్ని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాల వల్ల ఎగ్జిబిటర్ కు ఎటువంటి నష్టం లేదని, ఎక్కడా సినిమా టికెట్ల రేట్లు తగ్గించిన పరిస్థితి లేదని, గతంలో ఉన్న రేట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కోర్టులకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకునేందుకు గత ప్రభుత్వాలు కమిటీ ఏర్పాటును గాలికొదిలేశారన్నారు.

రాష్ట్రంలో 90 శాతం ఏసీ థియేటర్లు ఉన్నాయని, 10 శాతం మాత్రమే నాస్ఏసీ థియేటర్లు ఉన్నాయన్నారు. 10 శాతం నాస్ఏసీ థియేటర్లు ఎక్కువగా రూరల్ ఏరియాలో ఉన్నాయన్నారు. ఈ థియేటర్లలో 100 సీట్ల కెపాసిటీ ఉంటే వాటిలో 10 శాతం సీట్లకు మాత్రమే రూ.10 ల టికెట్ ధర ఉంటుందని, ఇలా రాష్ట్రంలో వెయ్యి టికెట్లు కూడా అమ్మే పరిస్థితి ఉండదన్నారు.

దీన్ని చిలవలు, పలవలుగా చేసి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు చర్యలు చేయడం లేదన్నారు. టికెట్ ధరలను సీఎం జగన్మోహనరెడ్డి సరిగా నిర్ణయిస్తున్నారా లేదా అని ప్రజలనే అడగాలని సూచించారు. బడ్డీ కొట్లకు వచ్చే డబ్బులు సినిమాలకు రాకపోతే సినిమాలు ఎవరూ చేయరన్నారు. ఎవరైనా డబ్బు కోసమే సినిమాలు చేస్తారన్నారు. బడ్డీ కొట్లకే డబ్బులు వస్తే అప్పుడు అందరూ బడ్డీ కొట్లే పెడతారని చెప్పారు. సీఎం జగన్మోహనరెడ్డిపై కొంత మందికి వ్యక్తిగతంగా ద్వేషం ఉంటుందన్నారు. మంచి చేసినా, చెడు చేసినా ఆరోపణలు చేస్తూనే ఉంటారని మంత్రి కొడాలి నాని అన్నారు.

LEAVE A RESPONSE