Suryaa.co.in

Editorial

సినిమా టికెట్ల లొల్లేంది?

– రేట్లు తగ్గిస్తే ప్రేక్షకుడికి ఖుషీనే కదా?
– ఏం.. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చుగా?
– మరి పెట్రోలు, స్కూలు ఫీజులు, ఆసుపత్రులు, ఇసుక, సిమెంటు రేట్లూ తగ్గించాలి కదా?
– జనం కోరని టికెట్ల సంగతి సరే.. కోరుతున్న వాటి ధరల తగ్గింపు సంగతేంటీ?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏందో.. ఆంధ్రాలో ఏం చేసినా అతి. మందు రేట్లు అమాంతం తగ్గించేసిన జగనన్న సర్కారు.. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత కాస్త కరుణించి, పిచ్చి బ్రాండ్లో, ఎచ్చి బ్రాండ్లో మందు ధరలయితే కొంచెం తగ్గించింది. అనుకోకుండా మళ్లీ సినిమా ప్రేక్షకుడిపై దయ చూపిస్తూ కరుణామయుడయిన జగనన్న సర్కారు, క్రిస్మస్ సందర్భంగా అమాంతం సినిమా టికెట్ల రేట్లు తగ్గించేసింది. ఒకప్పుడు సినిమా రేట్లు షాక్
cinema-ticketsకొడితే, ఇప్పుడు జగనన్న అసలు దానికి ఫ్యూజులే తీసేశారు. ఫలితంగా వందల సంఖ్యలో హాళ్లు మూతబడుతున్నాయ్. అధికారులకు అర్జంటుగా సినిమా హాళ్ల దోపిడీ ఇప్పుడే గుర్తుకొచ్చినట్లు, వాటి మీద పడి నానా గత్తర చేస్తున్నారు. ఆంధ్రాలో ఇప్పుడు అదో పెద్ద లొల్లి. రచ్చ లాంటి చర్చ. యాంకరాసురుల డిబేట్లూ. సినిమా హీరో, నిర్మాతలు, ఎగ్జిబిటర్ల గావు కేకలు, ఆర్తనాదాలూ. అసలు ఈ సినిమా కథేందో చూద్దాం.

మనలోమాట. ఏ రేటయినా తగ్గిస్తే అంతిమంగా లాభపడేది వినియోగదారుడు. కానీ ఆంధ్రాలో సినిమా రేట్లు తగ్గించినందుకు వినియోగదారులు తప్ప, అంతా వ్యతిరేకిస్తున్నారు. కానీ అదే సినిమా రేట్లను తెలంగాణ సర్కారు అమాంత ం పెంచితే ఎవరూ కిక్కురుమనడం లేదు. ఇదేం అన్యాయమని ప్రశ్నించటం లేదు. రెండు చోట్లా వినియోగదారుడు నవరంధ్రాలూ మూసుకుని ఉండటమే వింత. ప్రజల చైతన్యం అలా అఘోరించింది. ఏం చేస్తాం?! ఎలాగూ వినియోగదారుడు నోరుమూసుకున్నందున, పాలకులు దానిని ‘మౌనం అంగీకారం’ అనుకుని వాళ్ల నిర్ణయాలు వాళ్లు తేసుకుంటున్నారు.

ఇప్పుడు మళ్లీ ఆంధ్రాలో సినిమా టికెట్ల లొల్లి సంగతేందో చూద్దాం. సినిమా రేట్లు గణనీయంగా తగ్గిస్తూ, జగనన్న సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రేక్షకుడు జేబులో ఓ పదిరూపాయలేసుకుని రెక్లెస్‌గా సినిమా చూడొచ్చు. దానితోపాటు ధియేటర్లలో అమ్మే కూల్‌డ్రింకు, పాప్‌కార్న్, సమోసా వంటి చిల్లర
cini2 దోపిడీపై మెరుపు దాడులు చేస్తోంది. మంచిదే కదా? పెద్ద ధియేటర్లలో పాప్‌కార్న్ 50 రూపాయలయితే, కూల్‌డ్రింకు ఖరీదు ఇంకొంచెం ఎక్కువ. సమోసా వంటి తినుబండారాల రేట్లు వాళ్ల దయ, ప్రేక్షుకుడి ప్రాప్తం. అంటే ఒక కుటుంబంలో నలుగురు సినిమాకు వెళితే హీనపక్షం అంతా కలిపి ఏడెనిమిది వందలు తిరుక్షవరం అవుతుంది. నెలలో నాలుగుసార్లు మధ్య తరగతి కుటుంబం సినిమాకు వెళితే, ఇహ ప్రత్యేకించి తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకోనవసరం లేదన్నమాట.

మరి వినోదం పేరుతో దశాబ్దాల నుంచి విజయవంతంగా జరుగుతున్న జేబు దోపిడీని జగనన్న వచ్చి అరికట్టడం మంచిదే కదా? ధియేటర్‌లో అమ్ముతున్న కూల్‌డ్రింకులు, పాప్‌కార్న్ వంటి తినుబండారాల రేట్లపైనా, సర్కారు కొరడా ఝళిపించడం వల్ల జనం జేబును కాపాడినట్లే కదా? ఇప్పటిదాకా ధియేటర్‌లో
cini క్యాంటిన్లు, పార్కింగ్ రేట్లపై మీడియాలో ఎన్ని వార్తలు రాసినా పట్టించుకున్న దిక్కు లేదు. మరిప్పుడు ఆ పని జగనన్న చేస్తే అభినందించాల్సింది పోయి, ఆ గావుకేకలేందంట? అసలు దానికి విమర్శలెందుకన్నది ప్రశ్న. జగనన్న తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు అదే ఒక కుటుంబం సినిమాకు వెళితే, మహా అయితే రెండు, మూడు వందలు కూడా కాదు. దానివల్ల సగటు మధ్యతరగతి జీవికి జేబు మిగిలితే సంతోషపడక ఆ ఏడుపులు, పెడబొబ్బలు, గాయగత్తరేంటంట?

సపోజ్. పెర్ సపోజ్. ధియేటర్‌లో క్యాంటిన్లు ఓనర్లు నడపరు. పార్కింగూ నడపరు. ఏ సుబ్బారావుకో, పుల్లారావుకో లక్షల రూపాయలకు లీజుకిస్తారు. ఆ సుబ్బారావు, పుల్లారావు తిరుబండారాలు, పార్కింగు రేట్లు, ఇష్టం వచ్చిన ధరకు అమ్మి లాభం సంపాదిస్తాడు. ఇప్పుడు సర్కారు చేస్తున్న దాడుల వల్ల, ఆ సుబ్బారావులు ఒళ్లు దగ్గరపెట్టుకుని ఎమ్మార్పీ ప్రకారం అమ్ముతాడు. లేదంటే కాంట్రాక్టు మాకొద్దంటాడు. అప్పడు గిట్టుబాటు కాకపోతే ఓనరే చచ్చినట్లు అవి నడుపుకుంటాడు. నష్టమేంటంట? ఇక్కడ నష్టపోయేది సుబ్బారావు, పుల్లారావనే కాంట్రాక్టర్లే తప్ప జనం కాదు. కొంచెం.. వాడండి!

ఇక సినిమా రేట్లు తగ్గించడం ప్రేక్షకులని అవమానించడమేనన్నది బుడ్డ హీరో నాని ఆవేదన. రేట్లు తగ్గించడమనేది జనాలను అవమానించడం అని చెప్పిన హీరో నాని.. చరిత్రలో ఒక రాజారామ్మోహన్‌రాయ్, ఒక కందుకూరి వీరేశలింగం మాదిరిగా నిలిచిపోతారు. నిజం. ఎవరైనా రేట్లు తగ్గడం వల్ల వస్తువు ఉత్పత్తి చేసే ఆసామి నష్టపోతాడంటారు. లేదా మార్కెట్ ఉండదంటారు. టమాటో చూడండి. కిలో రూపాయి ఉన్నప్పుడు రైతులు వాటిని రోడ్లమీద పారేస్తుంటారు. ఎందుకంటే పంట గిట్టుబాటు కాలేదు కాబట్టి. కానీ సినిమా కథ అది కాదు కదా నానీ!

సినిమా రేట్లు తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తున్నారంటూ గుండెలు బాదుకుంటున్న నానీ అండ్ అదర్స్.. మహేష్‌బాబు దగ్గర నుంచి ఇదే నానీ వరకూ తమ రెమ్యూనరేషన్లు ఎందుకు తగ్గించుకోరు? సినిమా ప్రొడక్షన్ ఖర్చులు ఎందుకు తగ్గించుకోరు? ఏం.. అమెరికా, నార్వే,స్విస్‌లోనే షూటింగులు చేస్తేనే మేం సినిమాలు చూస్తామని ప్రేక్షకులు మీ చెవులో ఏమైనా చెప్పారా? ఏం.. అప్పట్లో గుండమ్మకథ, మిసమ్మ నుంచి మొన్నటి శంకరాభరణం, నిన్నటి నారప్ప, జాతిరత్నాలు, గాలి సంపత్, ముగ్గురు మొనగాళ్లు, కొండపొలం, ఉప్పెన వంటి సినిమాలన్నీ హిట్ కాలేదా? అవి అమెరికాలో తీసినవేం కాదు కదా? మరి అవి హిట్టయ్యాయా? లేదా? జనం చూశారా లేదా? అవన్నీ లోబడ్జెటు సినిమాలే కదా? మహేష్‌బాబు అదేదో సినిమాలో చెప్పినట్లు ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా ? లేదా? దట్సాల్. కథలో దమ్ముండాలన్నయ్యా? సినిమా కూడా అంతే!

మహేష్‌బాబులు, అల్లు అర్జున్లు, ఎన్టీఆర్లు, ప్రభాసులూ యాభైలు, ముప్పయ్‌లూ తీసుకోకుండా ఏ ఐదో, పదో తీసుకుంటే సినిమా ప్రొడక్షను కాస్టు కూడా తగ్గుతుంది. అసలు మన తెలుగు అగ్రహీరోలతో చేసే ఖర్చును ఏ మళయాళంలోనో, మరాఠీలోనో అయితే పది తీయవచ్చట. ఆ విధంగా అగ్రహీరోలంతా తమ రేట్లు తగ్గించుకుని ముందుకు వెళితే.. టికెట్ రేటు పది రూపాయలు పెట్టినా ఎవరి కొంపలూ మునగవ్. ఏ నిర్మాతా ఆరిపోడు. కానీ ‘కుండలో కూడు కుండలో ఉండాలి. బిడ్డ దుడ్డులా ఉండాలి అని’ చెప్పినట్లు.. హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకోకూడదు. సినిమా టికెట్ల రేట్లు పెరగకూడదంటే ఎట్లబ్బాయ్?

అదేదో హీరోలు రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటే, ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ కాస్టు తగ్గి 60 కోట్లలో అయ్యే సినిమా 10 కోట్లకే వస్తుంది కదా చిట్టి నానీ?! అప్పుడు సినిమా టికెట్ తగ్గితే ప్రేక్షకులు ఇంకా ఎక్కువే వస్తారు కదా? పోనీ.. 60 కోట్ల బడ్జెట్‌తో తీసిన అని సిన్మాలకూ లాభాలొస్తున్నాయా? రావడం లేదు కదా? హీరోల డబ్బులు హీరోలకు వస్తాయి. మధ్యలో మునిగిపోయి అప్పుల అప్పారావులయ్యేది నిర్మాతలే కదా? పరిశ్రమను పోషించే నిర్మాత న ష్టపోతే.. అత్తారింటికి దారేదీ’ సినిమాలో కోట శ్రీనివాసరావు రాయలసీమ యాసలో చెప్పినట్లు ఇండస్ట్రీకి ఎంత బైసాట్లు?

అయితే సిన్మా హీరోలు నానా కష్టాలు పడి ఆ స్థాయికి చేరినందున, వాళ్లను రేట్లు తగ్గించుకోమని చెప్పడం కరెక్టు కాదని, ఎక్కువ డబ్బులు తీసుకునేవాళ్లు ఓ అరడజనుమందికి మించరన్నది కొందరి వాదన. నిజమే. కానీ తమది ఓ కుటుంబమని, నిర్మాతలు నష్టపోతే పరిశ్రమ లేదని, తామంతా కళామతల్లి
cinema-kragahavendrarao ముద్దుబిడ్డలమని వేదికలపై భారీ డైలాగులు కొట్టే హీరోలు, అదే కళామతల్లికి పూజారి లాంటి నిర్మాతలు నష్టపోతుంటే, తమ రెమ్యునరేషన్లు ఎందుకు తగ్గించుకోరన్నది బుద్ధిజీవుల ప్రశ్న. చిన్న సినిమా నిర్మాతలకు ఈ కష్టాలేవీ ఉండవు. వాళ్ల సినిమాలకు థియేటర్లు దొరకవు. అవెలాగూ ‘ఆనలుగురి’ చేతుల్లో ఉన్నందున, ఈ గావుకేకలతో చిన్న నిర్మాతలకు వచ్చిన నష్టమేమీ లేదు.

ఇక నష్టపోయేదీ, రోడ్డునపడేదీ థియేటర్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే వాళ్లే. అలాంటివారికి ఇప్పటికే సర్కారు ఇచ్చే అన్ని సౌకర్యాలూ అందుతూనే ఉన్నందున పెద్ద ప్రమాదం లేకున్నా, రోజువారీ జీవనం
cinema-hallదెబ్బతినడం ఖాయం. సిన్మా రేట్లు తగ్గించినందున, యజమానులు ఆటోమేటిక్‌గా వారి జీతాలూ తెగ్గోస్తారు. కరోనా కాలం మొదలయిన నాటి నుంచి పేపర్లు, చానెళ్ల నుంచి కొన్ని కంపెనీలన్నీ అవే చేస్తున్నాయి. విచిత్రమేమింటే కొన్ని పేపర్లలో, ‘కరోనా కటింగులు’ ఇంకా విజయవంతంగా కొనసాగుతున్నాయి. సో.. నష్టపోతున్న కార్మికుల సంగతే ఇప్పుడు ఆలోచించాల్సింది. ఆరు పోసినవాడే నీరు పోయాలన్నట్లు, ధరలు తగ్గించిన జగనన్న సర్కారే వాళ్లకు న్యాయం చేయాలి.

సరే. కాసేపు ఈ దిక్కుమాలిన సినిమా టికెట్ల లొల్లి పక్కనపెట్టి.. అదే దారిలో మిగిలిన యవ్వారాలపైనా జగనబ్బాయ్ చర్యలు తీసుకుంటే మంచిదన్న వాదనలు, వ్యంగ్యాస్త్రాలు, సోషల్‌మీడియాలో పేలుతున్న
cini3సెటైర్లలోకి వెళదాం. ప్రేక్షకులెవరూ కోరకుండానే సినిమా టికెట్ రేట్ల ధర తగ్గించి, కరుణామయుడి అవతారమెత్తి, జెరూసలేము వెళ్లకుండానే ప్రభువును చూపిన జగనన్నకు, ఆంధ్రాజనం రుణపడి తీరాలి. సిన్మా రేట్లు తగ్గించిన జగనన్నను జనం ఇప్పుడు ప్రభువులానే చూస్తున్నారు.

మరి అదే కరుణామయుడయిన జగనన్న.. సిమెంట్, ఇసుక, ప్రైవేటు స్కూళ్లు-కాలేజీలు, ప్రైవేటు-కార్పొరేట్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా జనం కోరకముందే సినిమా రేట్ల స్థాయికి తగ్గిస్తే.. అఖిలాంధ్రజనం జగన్నాధుడికి జేజేలు పలికి, ఆయన ఫొటో పెట్టుకుని పూజించడం ఖాయం. మరి అంత విశాల హృదయం జగనన్నకు ఉందా? ఈ కరుణ, ప్రేమ అంతా కమ్మోరిచేతుల్లో ఉన్న సినిమా పరిశ్రమకే పరిమితమా అన్నదే ప్రశ్న.

జగనన్న అలా సిన్మారేట్లు తగ్గించారో లేదో, మరి మిగిలిన యవ్వారం మాటేంటీ? మీ భారతీ సిమెంట్ ధర ఎందుకు తగ్గించవోయ్? మీరు కాంట్రాక్టు ఇచ్చిన కంపెనీ నుంచి ఇసుక రేట్లు ఎందుకు తగ్గించలేదోయ్? అన్నక్యాంటీన్ల సంగతి ఏం తేల్చావోయ్? ఇవన్నీ కాదోయ్.. ముందు నీ సాక్షి పేపరు రేటు తగ్గించు. అందరికీ అందుబాటులో ఉండాలనే సిన్మా రేట్లు తగ్గించామంటున్నారు గందా? మరి నీ లెక్క ప్రకారమే మిగిలినవి కూడా అందుబాటులో ఉంచాలి కదోయ్ జగనూ.. అని విపక్షాలు ఎకసెక్కాలాడుతుంటే, సోషల్‌మీడియా అయితే ఒక రేంజ్‌లో ఆడుకుంటోంది. ఏం చేస్తాం? లోకులు పలు కాకులు. సీతమ్మనే అనుమానించారు. కేవలం నెలకు ‘వందపైసలు’ మాత్రమే జీతం తీసుకుంటూ, అవినీతికి ఆరు కోట్ల మైళ్లు దూరంగా బతుకుతూ.. నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయిన మన జగనన్న ఒక లెక్కా? జమా??

LEAVE A RESPONSE