-బ్లాంక్ ఎఫ్ ఐ ఆర్ ద్వారా ఏపీ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు
-41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టులా?
-త్వరలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తా
-హవ్వ… ప్రజల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులకు రక్షణా?
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ప్రజల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులకు రక్షణ కావాలనే పరిస్థితి ఇంత తొందరగా వస్తుందనుకోలేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మా జగనన్న ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు . సిఐడి చట్టబద్ధంగా పని చేస్తోందని, తప్పు చేయని వారు భయపడాల్సిన పని లేదని, అవసరమైతే కోర్టులకు వెళ్లే స్వేచ్ఛ వారికి ఉంటుందని వార్తాపత్రికలలో వచ్చిన కథనం పై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ… తమ హక్కుల గురించి సిఐడి అధికార ప్రతినిధి చెబితే తప్ప తెలుసుకోలేని దుస్థితిలో తాము లేమని వ్యాఖ్యానించారు. సిఐడి పోలీసులు ఎంతోమందిని అరెస్టు చేయగా, మెజిస్ట్రేట్ లు వారిని కస్టడీకి ఇవ్వకుండా తిరిగి వెనక్కి పంపిన ఉదాంతాలు అనేకం ఉన్నాయన్నారు. అమాయకులను అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులను మెజిస్ట్రేట్ లు తక్షణమే శిక్షించాలని కోరారు. ఇదే విషయమై తాను త్వరలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కలుస్తానని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాలు, బారి కేడ్స్ మధ్య ప్రజల్లోకి వస్తున్నారన్న ఆయన , ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే పంథా ను అనుసరించాలని అపహాస్యం చేశారు. ఎవరైనా ఈ విషయం తెలియకుండా, ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చే ప్రజలను పోలీసులు కొట్టకుండా, ఎమ్మెల్యేలకు దూరం చేస్తే మంచిదని సూచించారు . టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలు చూపించుకొని అన్నింటిలో నెంబర్… వన్ నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు విడ్డూరంగా ఉందన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డ అని అంగీకరించడానికి ఎంతో మనస్తైర్యం కావాలని, ఆ మనస్తైర్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి హైదరాబాదుకు వెళ్ళిన తనని, బ్లాంక్ ఎఫ్ ఐ ఆర్ ద్వారా ఏపీ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు. తనకు ఖచ్చితమైన సమాచారం లభించడంతోనే, తాను తిరిగి ఢిల్లీకి చేరుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని అంతమొందించడానికి చేస్తున్న కుట్రలు కుతంత్రాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు.
తనని ఎందుకు, ఏ సెక్షన్ ప్రకారం అరెస్టు చేయాలనుకున్నారని ప్రశ్నించిన ఆయన , తాను చేసిన తప్పేమిటి అంటూ ప్రశ్నించారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరడమే తాను చేసిన తప్పా? అంటూ ప్రశ్నించిన ఆయన, పాఠశాలలు మూసివేయద్దని కోరడమే నేరమా?? అంటూ నిలదీశారు. తానేమైనా రెండు గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టానా అని ప్రశ్నిస్తూనే, వాస్తవాలను చెప్పేవారు ద్రోహులా అంటూ నిలదీశారు. వాస్తవాలను మాట్లాడే వాక్ స్వాతంత్రం ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం ఇచ్చిందన్నారు. వివక్ష చూపకుండా పాలకులు విచక్షణతో ఆలోచించాలని సూచించారు.
కోర్టుకు, న్యాయస్థానానికి ఎవరూ ఫిర్యాదు చేయలేదట
సిఐడి కస్టడీలో పోలీసుల హింసను అనుభవించిన వారెవరు న్యాయస్థానానికి, మీడియాకు ఫిర్యాదు చేయలేదని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు . సిఐడి ని అబాసు పాలు చేసేందుకే కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నడం విడ్డూరంగా ఉందన్నారు. సిఐడి అధికారులకు కళ్ళు ఉన్నాయా?, లేవా?? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, తాను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు.
ఈ కేసు విచారణ నిమిత్తం సిఐడి పోలీసులకు, న్యాయస్థానం ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. గత మూడేళ్లలో సిఐడి పోలీసులు 150 మందికి పైగా అరెస్టు చేయగా, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఏ ఒక్కరు కూడా, న్యాయస్థానాలకు, మీడియాకు ఫిర్యాదు చేయలేదని పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందన్నారు. తాను సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ నాగార్జున సమక్షంలో మిలిటరీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల నివేదికను పరిశీలించాకే, సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరగా, గత 16 నెలల నుంచి కేసు విచారణకు రాకుండా అడ్డుకున్నారన్న ఆయన, నవంబర్ 4వ తేదీన విచారణకు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు . సిఐడి పోలీసులు హింసించారని టిడిపి ఆఫీస్ ఇంచార్జ్ నరేందర్, వెంగళరావుతో పాటు చాలామంది చెప్పారన్నారు.
ఇది రైతులకు కాదు… ప్రజాస్వామ్యానికి పరీక్ష
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అడుగడుగునా పాలకులు అడ్డుకోవాలని చూస్తున్నారన్న రఘురామకృష్ణంరాజు, ఇది రైతులకు పరీక్షా సమయం కాదని… ప్రజాస్వామ్యానికే పరీక్ష అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనాగరికంగా సాగుతున్న అరాచక, రాచరిక పాలన మధ్య ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎంపీ తన సొంత రాష్ట్రంలో అడుగుపెట్టలేని పరిస్థితి అని, పొరుగు రాష్ట్రంలో ఉన్న భార్యా పిల్లలు, మనవడిని చూసుకోలేని దుస్థితి దాపురించిందన్నారు. నరకుడు మన రాష్ట్రంలో ఇంకా బతికే ఉన్నాడని, ఎవరి రూపంలో ఉన్నాడో ప్రజలందరికీ తెలుసునన్నారు.
హైకోర్టు తీర్పుకు వక్ర భాష్యాలు
అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి హాజరయ్యే వారిని, వారికి కొంచెం దూరంగా ఉండి తమ సంఘీభావాన్ని తెలియజేయవచ్చునని జస్టిస్ రఘునందన్ రావు తన తీర్పులో పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన తెలియజేసే అవకాశాన్ని కల్పించాలని కోరగా, పాదయాత్రకు దూరంగా నిరసనను తెలియజేసుకోవచ్చునని జడ్జి ఆదేశించారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం నిరసన తెలియజేసే హక్కు ఉన్నట్లుగానే, పాదయాత్రకు సంఘీభావాన్ని తెలిపే హక్కు లేదా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. డీఎస్పీలు బాలచంద్రారెడ్డి, మాధవ రెడ్డి, కలెక్టర్ మాధవి లతా రెడ్డి కోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని చెబుతూ… పాదయాత్రకు 600 మంది రైతులంతా ఒకేసారి హాజరు కావాలని షరతులు విధించడం విడ్డూరంగా ఉందన్నారు .
అమరావతి రైతుల పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ కావాలని కోరుకున్నట్లు, తమ కోరిక తీరిందని మంత్రులు వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబులు బాహాటంగానే పేర్కొనడం, వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ కావాలని కోరుకున్న మంత్రులు, తమ కోరిక తీరిందని కొబ్బరికాయలను కూడా కొట్టడం పరిశీలిస్తే, అమరావతి రైతుల పాదయాత్ర పై మంత్రులు ఎంత అక్కసుతో రగిలిపోతున్నారో అర్థమవుతుంద న్నారు. ఈనెల 27న కోర్టు మళ్ళీ విచారణ చేపట్టనున్న నేపథ్యంలో బాలచంద్రారెడ్డి, మాధవ రెడ్డి, మాధవి లతా రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులు కోర్టుకు ఏమని నివేదిస్తారో చూడాలన్నారు. ఇక తిమ్మిని బమ్మిని చేసే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ నివేదిక కూడా ఎలా ఉంటుందోనని సందేహాన్ని వ్యక్తం చేశారు. కళ్ళు లేని చెవులు మాత్రమే ఉన్న న్యాయ వ్యవస్థలో, న్యాయం జరగడం కాసింత ఆలస్యం కావచ్చునని అన్నారు. న్యాయం జరగకపోయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గవద్దని రఘురామకృష్ణం రాజు కోరారు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయం, ప్రతి రైతు కంట కన్నీరు కారేలా చేస్తోందన్నారు. అమరావతి రైతులకే రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉందన్నారు.
అమరావతి అంటే కోపం లేదు… సొమ్ములు లేకనే
అమరావతి అంటే తమకే మీ కోపం లేదని, రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకనే చెప్పారని రఘురామకృష్ణంరాజు అన్నారు. కర్నూల్ లో హైకోర్టు నిర్మిస్తే అభివృద్ధి జరిగిపోతుందని, విశాఖపట్నంలో గుండు కొట్టిన ఋషికొండపై సచివాలయం నిర్మిస్తే సరిపోతుందని తమ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని అన్నారు. ఈనెల 27వ తేదీన హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా సరేనని మానసికంగా సిద్ధపడుదామని రైతులకు రఘురామకృష్ణం రాజు సూచించారు. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పునిస్తే అంగీకరించడానికి బాలచంద్రారెడ్డి, మాధవి రెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించడానికి సిద్ధంగా లేరన్నారు. వారికి వంత పాడడానికి మంత్రులు, ఎంతోమంది వారి అనుచరులు ఉన్నారన్నారు. అయినా సరే కోర్టు అనుమతి ఇచ్చిన మేరకు 600 మంది పాదయాత్రను కొనసాగించాలన్నారు. ఒకవేళ ఎవరైనా అనారోగ్యం పాలైతే, కొత్తవారు దరఖాస్తు చేసుకొని పాదయాత్రలో పాల్గొనవచ్చునని తెలిపారు. కొంతమంది నాయకుల ముసుగులో అన్యాయం చేస్తున్నారన్నారు. వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అమరావతి రైతుల పాదయాత్రలో అగ్రభాగాన నడుస్తున్న శివారెడ్డి, తిరుపతి రావు, శ్రీనివాసరావు, యుగంధర్, శైలజ తో పాటు మిగతా పాదయాత్రికులు అందరూ మనోధైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు.
అమిత్ షా నుంచి ప్రత్యుత్తరం అందింది
అమరావతి గురించి, రైతుల పాదయాత్ర గురించి రాష్ట్ర కేబినెట్ మంత్రులు మాట్లాడుతున్న తీరుపై తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాయగా, తనకు ప్రత్యుత్తరం అందిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. త్వరలోనే అమిత్ షాను కలిసి, అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలు వివరిస్తానని తెలిపారు. పోలీసులు ఉత్తుత్తిగానే కేసులు పెట్టారని, కేసులు ఉన్నవారు చెప్పే మాటలు ప్రజలు విశ్వసించరని సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 33 కేసులలో నిందితుడుగా ఉన్నారని, అయినా ఆయన తాను నిర్దోషినని చెప్పుకుంటున్నానని గుర్తు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి తో పాటు, విజయసాయిరెడ్డి లపై నమోదయిన కేసులన్నీ నిజమేనని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చెప్పదలిచారా అంటూ ప్రశ్నించారు. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పై తెలంగాణ సిఐడి పోలీసులు గృహహింస చట్టం కింద చార్జిషీట్ దాఖలు చేశారని, ఆయన తన నేరాన్ని అంగీకరిస్తున్నారా అని నిలదీశారు.
41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టులా?
41 ఏ నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులు చేసిచితక బాదడం, వీలైతే చంపేయడం వంటి ఆటలు ఇక సాగవని రఘురామకృష్ణం రాజు అన్నారు. నరక చతుర్దశి సందర్భంగానైనా ఈ భావజాలం పోలీసులలో తగ్గిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, న్యాయస్థానాల తీర్పులకు వక్ర భాష్యాలు చెప్పడం మానుకోవాలన్నారు.
షర్మిల చెప్పిందంటే నిజమే కావచ్చు
కడప ఎంపీ స్థానం కోసమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చెప్పారంటే నిజమే అయి ఉంటుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య వల్ల లబ్ధిదారులు ఎవరన్నది త్వరలోనే తేలనుందన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సాక్షి దినపత్రికలో ప్రచురించకపోవడం పట్ల రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను చెప్పు తీసుకొని కొట్టినట్టువంటి ఈ నిర్ణయానికి సంబంధించిన వార్త భూతద్దం పెట్టి వెతికిన సాక్షి దినపత్రికలో కనిపించలేదన్నారు.
రాష్ట్ర కళ్యాణం కోసం పని చేస్తే బాగుంటుంది
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడడం మానివేసి, రాష్ట్ర కళ్యాణం కోసం పని చేస్తే బాగుంటుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి మరల్చేందుకే పవన్ కళ్యాణ్ వివాహాల ప్రస్తావన తీసుకు వస్తున్నారన్నారు. మంత్రులు పదేపదే, పవన్ కళ్యాణ్ వివాహాల గురించి మాట్లాడడం తో సహనం నశించిన ఆయన, న్యాయస్థానం ఆదేశాల మేరకు భరణం ఇచ్చే విడాకులు తీసుకున్నానని చెప్పారని గుర్తు చేశారు. ఇందులో బూతు ఏముందో తనకైతే అర్థం కాలేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ కు నోటీసులు ఇచ్చే హక్కులు ఉన్నప్పటికీ, పునర్ వివాహమే నేరం అన్నట్లుగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగించిందన్నారు. చట్ట ప్రకారమే పునర్వివాహం చేసుకోవడాన్ని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ప్రశ్నిస్తున్నారా?, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారా? అంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ కూడా అరెస్టు చేస్తామని అంటారేమోనని, పోలీసు రాజ్యంలో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు.