– బీజేపీ భయంతో ఈసారి సొంత వారికి ఎంపీ సీట్లు?
– మాచర్ల, గుంటూరు, గన్నవరం, శ్రీకాళహస్తి, తాడికొండ లోనూ మార్పు తప్పదా?
– నర్సరావుపేట రేసులో కాసు?
– శిద్దాకు దర్శి అసెంబ్లీ?
– నరసరావుపేట ఎంపీకి మోదుగుల?
– ఈసారి కృష్ణదేవరాయల్‌కు ఎంపీ సీటు అనుమానమే?
– ఒంగోలు లోక్‌సభకు వైవి సుబ్బారెడ్డి?
– నెల్లూరు లోక్‌సభకు వేమిరెడ్డి?
– ఆనం స్థానంలో నేదురుమల్లి తనయుడు?
– మంగళగిరికి మురుగుడు హన్మంతరావు?
– పీకే కులసమీకరణ కసరత్తు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎమ్మెల్యేల పనితీరుపై సీరియస్ కసరత్తు చేస్తున్న ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. ఆ మేరకు పనితీరు బాగాలేని పలువురు ఎమ్మెల్యే-ఎంపీలను మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా, పార్టీకి మొదటి నుంచి అంకితభావంతో పనిచేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను.. కులసమీకరణలో భాగంగా, మరొక నియోజకవర్గానికి మార్చే యోచన చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ టీమ్.. సామాజికవర్గ సమీకరణలను అనుసరించి చేసిన సూచనలను, పరిగణన లోకి తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చె బుతున్నాయి. ప్రధానంగా కోస్తాలో ఈసారి వైసీపీ ప్రముఖులకు ఆశ్చర్యకరమైన రీతిలో స్థానచలనం ఉండవచ్చని పార్టీ వర్గాలు సూచన ప్రాయంగా చెబుతున్నాయి.
రానున్న ఎన్నికలను చావో రేవోగా తీసుకున్న వైసీపీ నాయకత్వం, ఇప్పటినుంచే ఆమేరకు తన వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. నవరత్నాలను విజయవంతంగా అమలుచేస్తున్నప్పటికీ, వ్యక్తిగతంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రముఖులను మరొక నియోజకవర్గానికి మార్చడం, లేదా వారికి సీటు ఇవ్వకూడదన్న ద్విముఖ వ్యూహంతో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అదే సమయంలో బీజేపీ రాజకీయ చదరంగం, భవిష్యత్తు నిర్ణయాలను అంచనా వేస్తున్న జగన్… ఈసారి లోక్‌సభకు పూర్తిగా తన విధేయులు, సొంత మనుషులకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో వారి వారి అవసరాల కోసం పార్టీ మారిన వారి స్థానంలో, ఈసారి పూర్తిగా సొంత మనుషులు-విధేయులకే సీట్లు ఇవ్వాలని పార్టీ అధినేత నిర్ణయించారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబును, అవనిగడ్డ నియోజకవర్గానికి మార్చే అవకాశం ఉందంటున్నారు. అవనిగడ్డలో కాపుల సంఖ్య ఎక్కువగా ఉండటమే దానికి ప్రధాన కారణమంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం, అంబటి పట్ల విముఖతతో ఉన్నట్లు చెబుతున్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని, సత్తెనపల్లికి మార్చే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకతతోపాటు, ఆయన ఎవరికీ పనులు చేయటం లేదని, కేవలం మీడియాను ఆక ర్షించేందుకే పరిమితమవుతున్నారన్న విమర్శలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అనేక గ్రామాల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన సొంత నిధులతో రోడ్డు వేయించగా, ఆళ్ల అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, పనులు చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శ నియోజకవర్గంలో లేకపోలేదు.
ఆయన స్థానంలో చేనేత వర్గానికి చెందిన, మురుగుడు హన్మంతరావుకు సీటు ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. మంగళగిరిలో పద్మశాలి సామాజికవర్గ సంఖ్యాబలం ఎక్కువగా ఉండటమే దానికి కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కేను సత్తెనపల్లికి మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సత్తెనపల్లిలోని కొన్ని మండలాల్లో రెడ్ల అధిపత్యంతోపాటు, టీడీపీలో వర్గ పోరు ఉన్నందున, ఆళ్లను అక్కడి నుంచి బరిలోకి దింపాలని వైసీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి, ఈసారి టికెట్ కష్టమేనంటున్నారు. ఆమెపై సొంత పార్టీలోనే విపరీతమైన వ్యతిరేకత నెలకొంది. పార్టీ నేతల వద్ద ఎన్నికల సమయంలో తీసుకున్న డబ్బులు, తిరిగి ఇవ్వలేదన్న ఆరోపణలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే ముఠాలు కట్టి, మీడియాకెక్కడం తెలిసిందే. తాజాగా ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యప్రసాద్‌ను నియమించడంతో, రాజకీయంగా శ్రీదేవి ప్రతిష్ఠ పలచబడిపోయింది. దానితో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీదేవి అనుచరులు, ఇటీవల ధర్నా చేసిన విషయం తెలిసిందే. శ్రీదేవి పనితీరుపై ప్రజల సంగతి అటుంచితే, సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో డొక్కా మాణిక్యప్రసాద్‌కు సీటు ఖాయమంటున్నారు.
మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు దర్శి ఎమ్మెల్యే సీటు ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానంలో, శిద్దాకు ఈసారి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పార్టీ పనితీరుపై వేణుగోపాల్ కొద్దికాలం నుంచి, అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయకత్వం.. దర్శిలో బూచేపల్లి కుటుంబాన్ని ప్రోత్సహించడం, వేణుగోపాల్‌కు రుచించడం లేదంటున్నారు. ఫలితంగా వివాదరహితుడయిన శిద్దాకు మళ్లీ దర్శి సీటు ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శిద్దా హయాంలో, దర్శిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అయితే పార్టీ ఆదేశం ప్రకారం ఇష్టం లేకపోయినా ఆయన ద ర్శి నుంచి కాకుండా, ఎంపీగా బరిలోకి దిగాల్సివచ్చింది. దర్శిపై ఆయనకు పట్టున్న నేపథ్యంలో, తిరిగి అక్కడి నుంచి శిద్దాకు సీటు ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ఇక ఈసారి నరసరావుపేట ఎంపీ సీటు కృష్ణదేవరాయలుకు దక్కడం అనుమానమేనంటున్నారు. ఆయన గుంటూరు ఎంపీ స్థానం ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన పనితీరుపై, పార్టీ నాయకత్వం కూడా అసంతృప్తితో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో ఆయన ప్రత్యక్షమైన ఫొటోలు, వైసీపీ అసంతృప్తికి ప్రధాన కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీపై విమర్శలకు కృష్ణదేవరాయల్ దూరంగా ఉండటం కూడా, పార్టీ నాయకత్వ అసంతృప్తికి మరోకారణమంటున్నారు.
ఇటీవల సైనిక అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చే సంస్థ యజమానితో.. కృష్ణదేవరాయలు ఉన్న ఫొటో వైరల్ అయినప్పటికీ, టీడీపీ మాత్రం ఎంపీ కృష్ణదేవరాయల్‌కు వ్యతిరేకంగా ఒక్క విమర్శ కూడా చేయని వైనాన్ని, వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి నర్సరావుపేట ఎంపీ సీటు ఇవ్వవచ్చంటున్నారు. ఆమేరకు నాయకత్వం మోదుగలకు స్పష్టమైన హామీ ఇచ్చిందని చెబుతున్నారు.
ఇక నరసరావుపేట అసెంబ్లీ నుంచి గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పోటీచేస్తారని గత కొద్దికాలం నుంచి, విపరీతమైన ప్రచారం జరుగుతోంది. కాసు కుటుంబానికి పెట్టనికోట లాంటి నర్సరావుపేట నుంచి కాసు మహేష్‌రెడ్డి, తొలుత గురజాలకు అయిష్టంగానే వలస వెళ్లారని గుర్తు చేస్తున్నారు. గత కొద్దినెలల నుంచి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి, నరసరావుపేట నియోజకవర్గంలో, ఆతీయ సమావేశాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం నర్సరావుపేటలో టీడీపీ బలహీనంగా ఉండటం, సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో, ఇక్కడ సీటు మార్పు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి జరుగుతున్న ఊహాగానాలపై, పార్టీ నాయకత్వం ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం కొనసాగుతోంది.
అదేవిధంగా అటు ప్రజలు, ఇటు పార్టీ క్యాడర్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను, మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత కొంతకాలం నుంచి, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా లిక్కర్ వ్యాపారానికి సంబంధించి, ఆయనపై టీడీపీ నేతలు చాలాకాలం నుంచి ఆరోపణలు సంధిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ దిగుమతి-క్లబ్బుల నిర్వహణ వ్యవహారంలో, పిన్నెల్లి పాత్ర ఉందని టీడీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక టీడీపీ నుంచి వచ్చిన గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి సైతం, ఈసారి టికెట్ దక్కకపోవచ్చంటున్నారు. గతంలో పోటీ చేసి ఓడిన, ఏసురత్నానికే సీటు దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వకపోవచ్చంటున్నారు. నెల్లూరు మాఫియా-బెట్టింగ్-సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారిందంటూ తరచూ ఆనం చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన అసంతృప్తికి అద్దం పట్టాయి. ఆయన స్థానంలో మాజీ సీఎం దివంగత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు, రాంకుమార్‌రెడ్డికి సీటు దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కూ టికెట్ అనుమానమేనంటున్నారు.
నెల్లూరు ఎంపి బరిలో ఈసారి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమేరకు సీఎం జగన్ ఆయనకు స్పష్టత ఇచ్చారని సీనియర్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వరంటున్నారు. అదే సమయంలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్థానంలో, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అవకాశం ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ భవిష్యత్తు వ్యూహాల నేపథ్యంలో, ఎంపీ సీట్ల విషయంలో సీఎం జగన్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని ఓ సీనియర్ నేత వెల్లడించారు.