Suryaa.co.in

Andhra Pradesh

ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ

– భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు

విశాఖ : రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహారీగోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని తేల్చిచెప్పింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నంత కాలం తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని సింగిల్‌ జడ్జి స్పష్టం చేశారు.

అవసరమైతే సీజే బెంచ్‌ వద్ద ఉన్న పిల్‌లో ప్రతివాదిగా చేరి గత ఉత్తర్వుల సవరణ కోసం అభ్యర్థన చేయవచ్చని పిటిషనర్‌కు సూచించారు. మరోవైపు నేహారెడ్డి వేసిన వ్యాజ్యంలో విశాఖ జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ప్రతివాదిగా చేరేందుకు అనుమతిచ్చారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి. కృష్ణమోహన్‌ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

భీమిలి (భీమునిపట్నం) బీచ్‌ వద్ద సముద్రానికి సమీపంలో సీఆర్‌జడ్‌ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) నిబంధనలను ఉల్లంఘించి శాశ్వత నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ మూర్తియాదవ్‌ సీజే ధర్మాసనం ముందు గతంలో పిల్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. తక్షణం నిర్మాణ పనులను నిలిపి వేయాలని ఉత్తర్వులిచ్చింది. యంత్రాలను సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించింది.

కట్టడాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. దీంతో భీమిలి బీచ్కు సమీపంలో నిర్మించిన ప్రహరీగోడ కూల్చివేతకు విశాఖ జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్‌(జోన్‌-1) ఈ నెల 18న తుది ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నేహారెడ్డి హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద ఇటీవల వ్యాజ్యం వేశారు. సింగిల్‌ జడ్జి ఈ వ్యాజ్యాన్ని ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న సీజే బెంచ్‌ వద్ద ఉన్న పిల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం, మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిల్పై సీజే బెంచ్‌ విచారణ జరిపింది.

నేహారెడ్డి వేసిన వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి విచారించడమే సబబు అని అభిప్రాయపడింది. వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి వద్దకు పంపింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి. కృష్ణమోహన్‌ సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు.

LEAVE A RESPONSE