– ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రామాయపట్నం పోర్టుకు రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయడం శుభపరిణామం
– ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రామాయపట్నం పోర్టుకు సీఎం శ్రీకారం
– గోదావరి వరదలకు – పోలవరానికి లింకు పెట్టి రాజకీయం చేయడం తగదు
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వంగా గీత, అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అభివృద్ధి చేసి, తద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పోర్టుల నిర్మాణం చేపట్టారు. మొత్తం 14 పోర్టులు నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా, రేపు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేస్తున్నారు. చాలా సంతోషం, ఏపీకి ఇది చాలా శుభపరిణామం.
ఏపీ పునర్విభజన చట్టంలో దుగ్గరాజుపట్నం పోర్టును పొందుపరిచినా, ఆ పోర్టు నిర్మాణానికి ఆలస్యం జరుగుతున్న పరిస్థితుల్లో, రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని అనేకమార్లు పార్లమెంటు లోపల, బయటా కోరాం. చివరికి కేంద్రం చేపట్టకపోయినా, రామాయపట్నం పోర్టు కూడా ఆలస్యమౌతున్నందువల్ల, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. ఈ పోర్టును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్ ని అంతా అభినందించాలి. దాదాపు రూ. 5 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. పర్యావరణ అనుమతులు తీసుకు వచ్చారు. ఈ పోర్టు వస్తే.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పోర్టు కోసం చాలా కాలం నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తడ నుంచి చూస్తే కృష్ణపట్నం ప్రైవేటు పోర్టు మాత్రమే ఉంది, ఆ తర్వాత రామాయపట్నం వస్తుంది, త్వరలో మచిలీపట్నం పోర్టు కూడా వస్తుంది. ఇవన్నీ పూర్తయితే, రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుంది.
ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
పోర్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకం కానున్నాయి. ఎయిర్ పోర్టులు, రోడ్లు, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా మేమంతా మా గళాన్ని వినిపిస్తున్నాం. రాజీ లేకుండా పోరాటం చేస్తున్నాం. రామాయపట్నం పోర్టుకు రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంఖుస్థాపన చేయడం శుభ పరిణామం. పోర్టులు, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు దఫాలుగా ప్రతిపాదనలు పంపించాం. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆమోదించాలి. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వేల కోట్ల రూపాయలు రహదారులకు శంఖుస్థాపనలు చేశారు. 38 ఫ్లైఓవర్లు మంజూరు చేస్తానని వాగ్దానం చేశారు. వీటన్నింటినీ త్వరితగతిన మంజూరు చేయాలి. టూరిజం అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు ప్రతిపాదనలు పంపాం. సింహాచలం, అంతర్వేది, అన్నవరం దేవాలయాలను టూరిజం పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరాం. అలానే, రాష్ట్రంలో ఉన్న ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయాలి. కొత్తగా జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో జిల్లాల్లో కూడా ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేయాలి. కేంద్రాన్ని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే.. ఒకటి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, రెండు రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, విభజన హామీలు నెరవేర్చాలి. గోదావరి వరదలు, పోలవరం ఎత్తుపై పొలిటికల్ కామెంట్లు చేయటం కరెక్టు కాదు. గోదావరిలో జులై మాసంలో ఇంత వరద ఎప్పుడూ రాలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నిధులు ఇచ్చి, పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) – కేంద్రం సమన్వంతోనే జరుగుతుంది. రామాయపట్నం పోర్టుకు పర్యావరణ అనుమతులు రావడం, రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంఖుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. రాష్ట్రంలో మూడు ప్రధాన పోర్టులు- రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించి ల్యాండ్ యాక్విజేషన్, పర్యావరణ అనుమతులు, పునరావాసం.. పూర్తి చేస్తున్నాం. మొట్టమొదట రామాయపట్నం పోర్టుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, సేవలకు సంబంధించి.. అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. అలానే, రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి, అటు మత్స్య సంపదను పెంచడంతోపాటు.. మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించడం, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం జరుగుతుంది. మరోవైపు రూ. 20 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది, వచ్చే రెండేళ్ళలో పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరాం. అలానే, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ.. 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. ఇందులో 3 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం జరిగింది. మిగతా 13 కాలేజీలకు కూడా పర్మిషన్లు ఇవ్వాలని కోరాం. హెల్త్ కేర్ అంశంలో అన్ని మౌలిక వసతులు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా సీఎం కృషి చేస్తున్నారు.
ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రంతో నిత్యం పోరాడుతూనే ఉన్నాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగింది. ల్యాండ్ యాక్విజేషన్ జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి, చొరవతో రాష్ట్రంలో సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ మీడియా సమావేశంలో ఎంపీ బ్రహ్మానందరెడ్డి కూడా పాల్గొన్నారు.