– పరమత సహనం చూపే హిందువులంటే అంత అసహనమా?
ఒకప్పుడు తన సొంత పత్రికలో యేసు ప్రభువు ఫోటో విషయంలో చిన్న పొరపాటు జరిగితే, “తప్పు నా అశ్రద్ధ వల్ల జరిగింది.. నన్ను క్షమించండి” అంటూ స్వహస్తాలతో సంతకం చేసి పశ్చాత్తాపం ప్రకటించిన జగన్, నేడు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుని ప్రసాదం అపవిత్రమైందన్న చేదు నిజం మీద రుబాబు చేస్తున్నారు.
నాడు “ప్రభువా! క్షమించు” అని రాసిన లేఖలో పశ్చాత్తాపం ఉట్టిపడింది. ఒక చిన్న సబ్-ఎడిటర్ చేసిన పొరపాటుకు కూడా తానే బాధ్యత వహిస్తున్నానని, క్రైస్తవ సోదరుల మనోభావాలు దెబ్బతిన్నాయని తల్లడిల్లిపోయారు. మరి ఆనాడు “ప్రభువా! క్షమించు” అని వేడుకున్న అదే చేతులతో, ఈనాడు హిందువుల విశ్వాసాలను వెక్కిరిస్తున్నట్లుగా మాట్లాడటం అత్యంత విచారకరం.
ఆనాడు మీ పత్రికలో “జర్నలిజం విలువలు” గురించి ఊదరగొట్టారు, మరి నేడు “ధర్మం” గురించి మాట్లాడే ధైర్యం ఎందుకు రావడం లేదు? ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలనుకోవడం రాజకీయాల్లో చెల్లుతుందేమో కానీ, ఆ ఏడుకొండల వాడి చెంత అది సాధ్యం కాదు. ఒకప్పుడు మీరు కోరిన క్షమాపణ కేవలం ఒక ‘డ్రామా’ కాదని నిరూపించుకోవాలంటే, తిరుమల విషయంలో జరిగిన పాపానికి కూడా అంతే నిజాయితీగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇక్కడ కనిపిస్తున్న విచిత్రం ఏమిటంటే.. తన మతానికి సంబంధించిన చిన్న తప్పు జరిగితే “శిక్షకు కూడా సిద్ధం” అని ప్రకటించిన నాయకుడు, అన్యమతస్తుల మనోభావాల విషయంలో మాత్రం వేళాకోళం చేస్తున్నారు. నాడు “సాక్షి కుటుంబం శతకోటి క్షమాపణలు తెలుపుతోంది” అన్నారు. మరి మీ వైకాపా చేసిన ఈ మహా పాపానికి మీ బంధుగణం ఎన్ని కోట్ల ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది? అని భక్తులు సూటిగా అడుగుతున్నారు మిస్టర్ జగన్.
