– కలెక్టర్లు జోక్యం చేసుకోవాలి
– జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి
చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, మండల రెవెన్యూ ఆఫీసర్స్ క్రైస్తవులుగా మారిన వారికి కులం సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నారని జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం, షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించిన వారు క్రైస్తవులుగా సెల్ఫ్ డెకరేషన్ చేస్తే, బీసీ -సి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వారు చర్చికి వెళుతున్నప్పటికిని, క్రైస్తవుడిగా సెల్ఫ్ డిక్లరేషన్ చేయకపోతే, వారికి ఎస్సీ సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వాలని, చర్చికి వెళ్లినంత మాత్రాన క్రైస్తవులు అయిపోయినట్టు కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
షెడ్యూల్ కులం వారు కాకుండా మిగతా ఏ కులం ఎస్టీ, బీసీ, ఓసీ వారైనా క్రైస్తవులుగా నమోదు చేసుకున్నప్పటికిని వారి కులం సర్టిఫికెట్ మారదు. కొంతమంది మండల రెవెన్యూ అధికారులు అవగాహన లేక కొంతమంది క్రైస్తవుల మీద ద్వేషంతో, కులం సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కొంతమంది ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇది విద్యార్థుల అడ్మిషన్, స్కాలర్షిప్ లకు అప్లై చేసుకునే సమయం గనుక పేదలు ఇబ్బందికి గురి కాకుండా ఉండేందుకు కలెక్టర్లకు, జిల్లా రెవెన్యూ అధికారులకు, లెటర్ రాయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ని కోరినట్టు మోసిగంటి తెలిపారు. దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్స్, కోర్టు తీర్పులు జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ వెబ్ సైట్ లో పెట్టబోతున్నట్టు వెల్లడించారు. క్రైస్తవులు కులం సర్టిఫికెట్ పొందడంలో ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావడానికి 7075482182 కి ఫోన్ చేయవచ్చని క్రైస్తవ సమాజానికి సూచించారు.