విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఏపీలో ఓటర్ల జాబితా, ఎన్నికల సంసిద్ధతపై విజయవాడలోని నోవాటెల్‌లో రెండో రోజు సమావేశం కొనసాగుతోంది. సీఈసీ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై ఎన్నికల సంఘం అధికారులు చర్చిస్తున్నారు..
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను వెల్లడించారు. డిసెంబరు 9 వరకు వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. డిసెంబరు 9వ తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా ఒకట్రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు..
మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించామని ముకేశ్ మీనా వివరించారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించామని.. అందులో 5.64 లక్షల పేర్లను అనర్హులుగా తేల్చి తొలగించామని చెప్పారు. ఫాం-7లను గంపగుత్తగా దాఖలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాకినాడ, పర్చూరు, గుంటూరు పశ్చిమ వంటి సెగ్మెంట్లల్లో ఫాం-7 దుర్వినియోగంపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాల ఈఆర్‌వోలు, పర్చూరు ఏఈఆర్‌వో, ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలను సస్పెండ్ చేశామని చెప్పారు. 50 మంది బీఎల్‌వోలపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలిచ్చామన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు జరుగుతున్న బదిలీలను పర్యవేక్షిస్తున్నట్టు సీఈసీకి వివరించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర పోలీసు విభాగం నోడల్ అధికారి, కేంద్ర పోలీసు బలగాల నోడల్ అధికారులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమలు సమయం నుంచి ఎన్నికల నిర్వహణ వరకూ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సీఈసీ అధికారులకు పలు సూచనలు చేశారు..