– అవును.. ఓటర్లు ‘బంగారు’ కొండలే
– నోటిస్తేనే ఓటేస్తామంటున్న ఓటర్లు
– కొత్తగా తులం బంగారం డిమాండ్
– ఎందుకివ్వరని పార్టీ నేతల ముందు ఆందోళన
– ‘మూడువేల’ ముచ్చట మాకొద్దు
– తులం బంగారమే ముద్దని పట్టు
– కొరిటికల్ గ్రామస్తుల కొంటె కోరిక
– ఇంటికి లక్ష అడుగుతున్న మునుగోడు ఓటరు
– టీఆర్‌ఎస్ రేటు 5వేలు, బీజేపీ 3 నుంచి 5 వేలు, కాంగ్రెస్ 500
– అన్ని పార్టీల వద్ద డబ్బులు తీసుకున్న ఓటర్లు
– ఓటెవరికి వేస్తారో మాత్రం చెప్పరు
– మాన్షన్‌హౌస్ వద్దు.. టీచర్స్, హండ్రెడ్‌పైపర్స్ ముద్దు
– ముందే మందు బ్రాండ్లను డంప్ చేసిన ప్రధాన పార్టీలు
– వైన్‌షాపుల్లో పెద్ద బ్రాండ్లు మాయం
– ఓటర్లకు మందు, విందుతో ముగిసిన ముగిసిన మునుగోడు ప్రచారం
– అభ్యర్ధులకు జేబులకు కోట్ల రూపాయల చిల్లు
– అవినీతి ఆరోపణలు పట్టని మునుగోడు ఓటరు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికల ప్రచారంలో అభ్యర్ధులు సహజంగా ఓటరు కాళ్లు గడ్డాలు పట్టుకుని ప్రాధేయపడుతుంటారు. మీరే మా దేవుళ్లంటారు. మీరు బంగారుకొండలంటారు. ఇంకా అనేక మార్గాల ద్వారా వారిని ప్రసన్నం చేసుకుంటారు. ఒకాయన గుడిసె హోటల్‌లో దూరి, దోసెలేసే మాస్టరును పక్కకు జరిపి ఆయనే దోసెలేస్తాడు. ఇంకోకాయన ఇస్త్రీ చేసే ఆమెను పక్కకు జరిపి, ఆయనే ఇస్త్రీ చేస్తాడు. మరొకాయనేమో ఆటో డ్రైవర్ ను పక్కకునెట్టి, తానే డ్రైవింగ్ చేస్తాడు. ఇవన్నీ ఎన్నికల ప్రచార విన్యాసాలే. అవును నిజమే. ఓటర్లు బంగారు కొండలే. అందుకే వారు ఇప్పుడు.. అచ్చంగా ఆ బంగారమే డిమాండ్ చేస్తున్నారు.
అబ్బ ఊరుకోండి.. మీరూ మీ ఎకసెక్కాలని అనకండి. ఇది నిజంగా మునుగోడు ఓటరు, అభ్యర్ధుల ముందు పెడుతున్న డిమాండ్లు. డిమాండ్ ఒక్కటే కాదండోయ్.. మాకు బంగారం ఎందుకివ్వరని చొక్కా పట్టుకున్నంత పనిచేస్తున్నారు. పాపం ఈ కొత్త తరహా డిమాండేమిటో తెలియక, అటు అభ్యర్ధులు జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటికే మందు, మాంసం పేరుతో నెలరోజుల నుంచి తిరుగుతున్న ‘మీటరు’కు.. కళ్లు బైర్లు కమ్ముతున్న అభ్యర్ధులు, ఇప్పుడు ఈ ‘బంగారం డిమాండ్’తో బిత్తరపోతున్నారు. ఇవీ.. మునుగోడు ఉప ఎన్నిక చిత్ర విచిత్రాలు.
ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో, చిత్రవిచిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. ఒకవైపు ఓటు అమ్ముకోవద్దని స్వచ్ఛంద సంస్థలు, మాజీ అధికారులు చెవినిల్లుకట్టుకుని ప్రచారం చేస్తున్నారు. డబ్బుకు అమ్ముడుపోయి, ఆత్మాభిమానం తాకట్టుపెట్టుకోవద్దని హితవు చెబుతున్నారు. ఓటుకు నోటు తీసుకుంటే.. గెలిచిన వారిని నిలదీసే నైతిక అర్హత ఉండదని, గడ్డం పట్టుకుని మరీ నచ్చచెబుతున్నారు. కానీ వారి గోడును మునుగోడు.. ‘తూ నా బొడ్డు’ అని జమ్మిచెట్టు ఎక్కించింది. అవినీతి ముచ్చట్లు మాకెందుకని.. ఆ తర్వాత ప్రోసీజరేమిటో చూడండని పార్టీ నేతలకు ఆర్డర్లేస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు, అవినీతి కబుర్లు పక్కనపెట్టి.. ‘ఓటేస్తే మాకేంటంట’ అని , ‘అహ నాపెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావు మాదిరిగా, లాజిక్కులు మాట్లాడుతున్నారు. సరే.. ఎలాగూ సమాజసేవ చేసేందుకు ఒక్కో పార్టీ వందలకోట్ల రూపాయలు కేటాయించింది కాబట్టి, వారంతా ఓటుకుఇంత అని లెక్కగట్టి మరీ ఇస్తున్నారు. ఆ ప్రకారంగా అధికార టీఆర్‌ఎస్ ఓటుకు 5 వేలు, బీజేపీ 3 నుంచి 5 వేలు, కాంగ్రెస్ 500 రూపాయలు.. పువ్వుల్లోపెట్టి మరీ ఓటరు ఇంటికి చేరుస్తున్నాయి. అందులో కొన్ని పార్టీలు ఈపాటికే వాటిని ఓటరు ఇళ్లకు పంపిణీ కూడా చేసేశాయట. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి.. ఓటర్ల ఆన్‌లైన్ మనీ సేవలందిస్తోందన్నది, టీఆర్‌ఎస్-కాంగ్రెస్ ఆరోపణ.
ఇక నిబంధనల ప్రకారం, ఎన్నిక జరిగే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయకూడదు. కానీ మునుగోడు అందుకు రివర్సు. సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న గ్రామాల రోడ్లకు, ఉప ఎన్నిక పుణ్యాన మోక్షం దక్కింది. గ్రామస్తులు అడగడమే ఆలస్యం. అభ్యర్ధులు ఆయా గ్రామాలకు ప్రైవేటు వాహనాల్లో ఇసుక-కంకర-సిమెంటు తెచ్చి, అత్యంత భక్తి శ్రద్ధలతో రోడ్లు పూర్తి చేయించిన విన్యాసాలు, ముగిసిన మునుగోడు ప్రచారంలో కనిపించాయి.
పనిలో పనిగా మందు తాగే అలవాటున్న ఓటరు, ‘ఇప్పుడు కూడా పాత సరుకేనా? బోరు కదా బాసూ’ అని కొత్త బ్రాండ్లు తెప్పించమని, పార్టీ నేతలకు ఆర్డర్లేస్తున్నారు. జనరల్‌గా వారు తాగే మ్యాన్షన్‌హౌస్, రాయల్‌స్టాగ్, ఓసీ వంటి రెగ్యులర్ బ్రాండ్లకు బదులు.. హండ్రెండ్ పైపర్స్, టీచర్స్ వంటి ఖరీదైన బ్రాండ్లు పట్టుకురమ్మని ఆర్డరేస్తే, పార్టీ నేతలు నవరంధ్రాలూ మూసుకుని, ఆ బ్రాండ్లను సరఫరా చేసి మందుబాబులను మెప్పిస్తున్నారు. ఫలితంగా మునుగోడులోని వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఆ రెండు ఖరీదైన బ్రాండ్ల స్టాక్ తుడిచిపెట్టుకు పోయిందట. మందు పంపిణీ విషయంలో టీఆర్‌ఎస్-బీజేపీ పోటీపడగా, పాపం కాంగ్రెస్ మాత్రం వెనుకబడిపోయిందట.
ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీలను ఇరికించేందుకు చేసే ఆరోపణలు, ప్రచార వ్యూహాలు.. ఒక్కోసారి బాగా డబ్బున్న అభ్యర్ధులకు, ప్రాణసంకటంలా మారుతుంటాయి. ఇప్పుడు మునుగోడులో అదే జరిగింది. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటుకు తులం బంగారం ఇస్తున్నారంటూ, టీఆర్ఎస్చాపకిందనీరులా ప్రచారం ప్రారంభించింది. కోమటిరెడ్డి కూడా ధవంతుడు కాబట్టి, జనం వాటిని పూర్తి స్థాయిలో నమ్మినట్లున్నారు. దానితో మునుగోడు మండలం కొరిటికల్ గ్రామస్థులు.. మూకుమ్మడిగా తులం బంగారం డిమాండ్ చేయడంతో, కమలదళాలు ఖంగుతిన్నాయట.
నిజానికి ఓటుకు మూడు వేలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమయింది. అందులో భాగంగా కొరిటికల్ గ్రామానికి వెళ్లిన బీజేపీ నేతలు, తాము అనుకున్నట్లుగానే ఓటుకు మూడు వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఓటుకు తులం బంగారం ఇస్తామని చెప్పి, మూడు వేలు ఇస్తున్నారేంటి? ‘మాకు తులం బంగారం ఇస్తేనే ఓటేస్తాం. లేకుంటే లేదు’ అని బరాబర్ చెప్పడంతో, పాపం కమలదళాలలు కళ్లుతేలేసి వెళ్లిపోయారట.
అయినా ఓటర్లు ఎక్కడయినా డబ్బులడుగుతారు. ఊళ్లలో రోడ్లేయమంటారు. బోర్లు వేయమంటారు. గుడి కట్టించమంటారు. కానీ.. ఎప్పుడూ లేని విధంగా, తులం బంగారం ఇస్తేనే ఓటు తథాస్తు అనడం, ఇప్పుడే చూస్తున్నామని రాజకీయ పార్టీలు తలపట్టుకున్నాయట. ఉప ఎన్నికకే తులం బంగారం అడిగితే .. రేపు జనరల్ ఎలక్షన్స్‌లో, అరకిలో బంగారం కావాలంటేరేమోనని ఇప్పటినుంచే బేజావుతున్నాయి.