– సీఐ వర్సెస్ రేంజ్ ఉన్నతాధికారి
– సీఐ తనను గన్ చూపి చంపేస్తానన్నారంటూ బాధితుడి ఫిర్యాదు
– కేసెందుకు పెట్టలేదని రేంజ్ ఉన్నతాధికారి ఫైర్
– ఆ సీఐ కోసం ఏకమైన ఒక సామాజికవర్గ సీఐ, డీఎస్పీలు
– పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల శరణువేడిన వైనం
– పార్టీకి పనిచేసిన వారిపై కేసు ఎలా పెడతారంటూ ధూళిపాళ్ల ఆగ్రహం
– ప్రస్తుతం పెండింగ్‌లో నా ‘స్వామి’ రంగ వ్యవహారం
( మార్తి సుబ్రహ్మణ్యం)
రాజధాని పోలీసు రేంజ్లో సీఐ – ఒక ఉన్నతాధికారి మధ్య ఆసక్తికరమైన యుద్ధం కొనసాగుతోంది. సదరు సీఐపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు ఎందుకు నమోదు చేయలేదని రేంజ్ ఉన్నతాధికారి.. గత ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో పార్టీకి పనిచేసిన సదరు సీఐపై, కేసెలా పెడతారంటూ అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వాదన.. మధ్యలో ఏకమైన ఒక సామాజికవర్గ సీఐ, డీఎస్పీల మధ్య.. కథ ఆసక్తికంగా మారింది.
అత్యంత విశ్వసనీయవర్గ సమాచారం ప్రకారం.. పెదకాకాని పోలీసుస్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారిపై, గుంటూరు పట్టాభిపురం పోలీసుస్టేషన్లో ఒక ఫిర్యాదు వచ్చింది. పెదకాకాని పీఎస్‌కు చెందిన సదరు అధికారి, తనను డబ్బులు ఇవ్వకపోతే గన్‌తో చంపేస్తానని బెదిరిస్తున్నారని, ప్రైవేటు వ్యక్తులను ఉసిగోల్పుతున్నారని సాగర్‌రెడ్డి అనే వ్యక్తి గుంటూరు పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారట.
అయితే పట్టాభిపురం పీఎస్ అధికారులు ఎంతకూ కేసు నమోదు చేయకపోవడంతో.. సాగర్‌రెడ్డి అనే బాధితుడు రేంజ్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారట. ఆ మేరకు సదరు పెదకాకాని పీఎస్ అధికారి తనను ఎలా బెదిరించిందీ.. ఆయన గుంటూరు అవుటర్ రింగ్ రోడ్‌లోని ఒక హోటల్‌ను కేంద్రంగా చేసుకుని, ఎవరెవరిని ప్రోత్సహిస్తున్నారన్నది పూసగుచ్చినట్లు ఫిర్యాదు చేశారట.
దానితో సదరు పెదకాకాని పోలీసు అధికారి వ్యవహారశైలిపై నివేదిక తెప్పించుకున్న రేంజ్ అధికారి.. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసు అధికారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని, జిల్లా అధికారులపై ఫైర్ అయ్యారట. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారట.
అక్కడి నుంచే అసలు కథ మొదలయింది. తన పై అధికారి గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న సదరు పెదకాకాని పీఎస్ అధికారి.. గుంటూరు, పరిసర ప్రాంతాల్లోని తన సామాజికవర్గ సీఐ, డీఎస్పీలకు విషయం చేరవేశారట. దానితో వారంతా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ను శరణువేడారు. పోలీసు అధికారిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి, వైసీపీకి చెందిన వాడని చెప్పారట. విషయం తెలుసుకున్న నరేంద్ర.. జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారట.
గత ఎన్నికల సమయంలో మాచర్లలో టీడీపీ కోసం పనిచేసిన సదరు పోలీసు అధికారిపై ఎలా కేసు పెడతారు? అయినా ఎప్పటి కేసునో తెచ్చి ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు? ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు వదిలేయండి అన్నారట. ఆ మేర కు ఎమ్మెల్యే చేసిన మేలుకు కృతజ్ఞత చెబుతూ, సంక్రాతి రోజున వారంతా గుంటూరులోని ఆయన ఆఫీసుకు వెళ్లి ధ్యాంక్స్ చెప్పారట.
కాగా దీనికి సంబంధించి పట్టాభిపురం పీఎస్ అధికారులను సంప్రదించగా.. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిపై అనేక ఆరోపణలున్నాయని సమాధానమిచ్చారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరే ంద్రతో, ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఇక కేసు గురించి అడిగేందుకు పెదకాకాని పీఎస్ అధికారితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఆయన కూడా ఫోన్లో అందుబాటులోకి రాలేదు. రేంజ్ అధికారికి సైతం ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన కూడా అందుబాటులోకి రాలేదు.
ఇదిలా ఉండగా.. ఈ అంశంలో మరికొందరు ఎమ్మెల్యేలు రేంజ్ అధికారికి బాసటగా నిలుస్తుండటం విశేషం. ‘ఆయన గత ఎన్నికల సమయంలో ఇక్కడ పార్టీ వైపు గట్టిగా నిలబడకపోతే నాలుగైదు నియోజకవర్గాలు పోయేవి. ఆయన పార్టీకి పనిచేస్తారని అందరికీ తెలుసు. అలాంటి అధికారిపైనే వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం ఏమిట’ని కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలాఉండగా.. పోలీసు, టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. రేంజ్ అధికారి, గత జిల్లా పోలీసు అధికారిపై ఒక పత్రికలో తరచూ వ్యతిరేక కథనాలు రాసేవారు. వాటిని వారిద్దరంటే గిట్టని సీఐలే రాయించేవారనే అనుమానం, పోలీసు ఉన్నతాధికారుల్లో లేకపోలేదు. ఆ క్రమంలో కొద్దినెలల క్రితం, అదే పత్రికలో రేంజ్ అధికారిపై రాసిన వరస కథనాలు సంచలనం సృష్టించాయి. ఫలితంగా ఆ కథనాలు రాసిన విలేకరిని అరెస్టు చేశారు. అయితే ఆ పత్రికా ప్రతినిధి వెనుక, సదరు పెదకాకాని అధికారి హస్తం ఉందన్న అనుమానం ధృవపడిందట. ఈలోగా అదేఅధికారిపై ఫిర్యాదు రావడం యాదృచ్చికంగా జరిగిపోయిందట.
ప్రస్తుతానికి పెదకాకాని పీఎస్ అధికారిపై, బాధితుడు సాగర్‌రెడ్డి గుంటూరులో ఇచ్చిన ఫిర్యాదు వ్యవహారం.. అటు తిరిగి ఇటు తిరిగి, రేంజ్ అధికారి-ప్రజాప్రతినిధి ప్రతిష్ఠగా పరిణమించింది. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.