– రాష్ట్రాలతో పోటీ కాదు.. ఆయనకు ఆయనే పోటీ
– రాజసూయ యాగం లెక్కన పెట్టుబడుల యజ్ఞం
ఎన్నో సార్లు, ఎన్నో రాష్ట్రాలు, ఎంతోమంది పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. ఇప్పటి వరకు నాయుడు కూడా మూడు సార్లు నిర్వహించారు. ఇది ప్రత్యేకమైనది. దేశం, ప్రపంచం ఆయన విశ్వరూపం చూసింది. మొట్టమొదటి సారి దేశ విదేశాలకు స్వయంగా ఆయన వెళ్లి, మంత్రులను పంపి ఆహ్వానించి, ఒక యుద్దమే చేశారు.
వేలమందితో అద్బుతమైన వేదికను తీర్చి దిద్దడం నుండి ఆహ్వానితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. రాజసూయ యాగం లెక్కన ఈ పెట్టుబడుల యజ్ఞం నిర్వహించారు. వేరే రాష్ట్రాలలో వివిధ దశల్లో వున్న వాటి నుండి ఒప్పుకొన్నవి కూడా.. పెట్టుబడి దారులు ఆంధ్రాకు తీసుకు వచ్చేశారు. దీని వెనుక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అధికార యంత్రంగం మొత్తం పరుగులు పెట్టి వారి అనుమానాల నివృ తి నుండి, రాష్ట్ర, దేశ పాలసీల మార్పుల నుండి, మౌలిక వసతుల కల్పన, భూములు చూపించడం వరకు చేతల్లో చూపించారు.
పెట్టుబడిదారుల మౌత్ పబ్లిసిటీ కూడా బాగా పనిచేసింది. దానికి తోడు నాయుడి అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్లతో నిరంతర సమీక్షలు, మంత్రులకు బాధ్యత ఇచ్చి, ఆయన వయసుకు మించి పడ్డ కష్టం, తపన ఫలితాలు ఇచ్చాయి. రాష్ట్రాలతో పోటీ కాదు. ఆయనకు ఆయనే పోటీ. 20 లక్షల ఉద్యోగాలు కాదు, తరువాతి టార్గెట్ 50 లక్షల ఉద్యోగాలు అంటుంటే అర్థం చేసుకోవచ్చు. ఇవి వచ్చాయి కదా అని ఊరుకోము, పెట్టుబడులు అనేది నిరంతర ప్రక్రియ అని ఉద్ఘాటించారు. పరీక్ష వ్రాసిన ఒక విద్యార్థిలా.. సదస్సు ముగిశాక అక్కడే మీడియా సమావేశం పెట్టి ఆ యజ్ఞ నిర్వహణా ఫలాల గురించి ప్రకటించారు. అనుమానాలను నివృత్తి చేశారు. ఇది కేవలం పెట్టుబడుల సదస్సు కాదు, మేధోమథనం, వినూత్న ఆవిష్కరణల వేదిక అని ఆయన ఉద్ఘాటించారు.
పెట్టుబడులు: కేవలం రెండు రోజుల భాగస్వామ్య సదస్సు ద్వారా రూ. 13,25,716 కోట్లు విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఇది ఆంధ్రప్రదేశ్ పట్ల పారిశ్రామికవేత్తలకు ఉన్న అపారమైన విశ్వాసానికి నిదర్శనం.
18 నెలల్లో అద్భుతం: గత 18 నెలల్లో రాష్ట్రంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ. 21 లక్షల కోట్లు, దీని ద్వారా 17 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. కార్యరూపం దాల్చే పెట్టుబడులు: ఈ పెట్టుబడుల్లో రూ. 8.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఇప్పటికే కేబినెట్ క్లియర్ చేసింది. సుమారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు మెటీరియలైజ్ అయ్యే దిశగా పయనిస్తున్నాయి.
“పోటీ పడి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ స్థాయిలో పెట్టుబడులు తీసుకువచ్చిన మంత్రులు, అధికారులను అభినందిస్తున్నాను.” సుమారు 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. క్వాంటం వ్యాలీ 2026 జనవరికి కార్యరూపం దాల్చనుంది. క్వాంటం కంప్యూటర్ల తయారీకి కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం గొప్ప విషయం.
పరిశోధన & అభివృద్ధి (R&D): RTIH (Research, Technology, and Innovation Hub) ద్వారా వినూత్న ఆవిష్కరణలు, స్టార్టప్‌లను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. డీప్ టెక్నాలజీలు (ఏరోస్పేస్, క్వాంటం, ఏఐ) అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
MSME పార్కులు: రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) పార్కులను ఏర్పాటు చేసి పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. ఇది శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ అభివృద్ధి వికేంద్రీకరణకు దారితీస్తుంది.
మెడ్ టెక్ పార్క్: ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తారు. అలాగే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) సెంటర్ కూడా ఇక్కడే ఏర్పాటు అవుతోంది.
శ్రీసిటి లక్ష్యం: ప్రస్తుతం 240 యూనిట్లు ఉన్న శ్రీసిటిలో మరో 4,000 ఎకరాలను అందుబాటులోకి తెస్తున్నారు. 50 దేశాలకు చెందిన కంపెనీలను తీసుకువచ్చి, 1.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యం.
లాజిస్టిక్ హబ్: పోర్టులు, రైలు, రోడ్ లాంటి ఇన్ఫ్రాను అభివృద్ధి చేయడమే కాకుండా, ఈస్ట్ టు వెస్ట్ లాజిస్టిక్స్ డెవలప్ చేయాలని నిర్ణయించారు.
బ్రాండ్ రివైవల్: గతంలో రద్దైన విద్యుత్ పీపీఏలు, పరిశ్రమలను మూసేయించడం వంటి ‘బ్యాడ్ పీరియడ్’ (2019-24) వల్ల దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను కేవలం 18 నెలల్లోనే సరిచేయగలిగారు.
సింగపూర్ ఒప్పందం: దెబ్బతిన్న బ్రాండ్‌ను రివైజ్ చేయడంలో భాగంగా, గతంలో అమరావతి భాగస్వామిగా ఉన్న సింగపూర్ సంస్థను ఇతర ప్రాంతాల్లో పనిచేసేలా ఒప్పించి, తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చారు.
ఎస్క్రో ఖాతా: పరిశ్రమలకు విశ్వాసం కల్పించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సావరిన్ పవర్‌ను కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థాయికి చేరుకున్నామని సీఎం తెలిపారు. దీనివల్ల మూడేళ్లలోనే పెట్టుబడులన్నీ ఉత్పత్తి దశకు వస్తాయి.
దార్శనికత: 10 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ. 83 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థను సాధించడం, కోటి మందికి ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
నిరంతర పర్యవేక్షణ: పెట్టుబడుల అమలు కోసం ప్రతి 15 రోజులకు ఎస్ఐపీసీ (SIPOC), ఎస్ఐపీబీ (SIPB) సమావేశాలు నిర్వహిస్తూ, అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి మాటల్లో గుడ్ గవర్నెన్స్- డెవలప్మెంట్ పట్ల ఉన్న నిబద్ధత స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ వేగవంతమై, జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సదస్సు నిరూపించింది.