-గుడివాడ అమర్ నాథ్ కు సిగ్గు అనిపించలేదా?
-తాగుబోతులని తాకట్టు పెట్టి 33 వేల కోట్ల అప్పు
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు
మూడు సంవత్సరాల క్రితం జగన్ అధికారంలోకి రావడానికి చెప్పిన మాటలు, చేసిన మోసాల్లో ప్రధానమైంది మద్యపాన నిషేధం. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోందని, మానవ సంబంధాలు ధ్వసం అవుతున్నాయని, మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని, మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేదిస్తామని జగన్ చెప్పారు. ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు.
ఇటీవల గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ మద్యపాన నిషేదం మా మేనిఫెస్టోలో లేదని, మా మేనిఫెస్టో ప్రభుత్వ కార్యాలయ గోడలకు అంటించి ఉంటుంది వెళ్లి చూడండి, అందులో ఏం రాశామో ఒకసారి చదవండి. పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని దానిలో ఉంటే మేము ఒప్పుకుంటామన్నారు. ఇలాంటి అబద్ధాలు, దివాలాకోరు మాటలు మాట్లాడటానికి గుడివాడ అమర్ నాథ్ కు సిగ్గు అనిపించలేదా? ఈ విధంగా మంత్రులు మాట్లాడుతున్నారా? లేక మంత్రులతో జగన్ మాట్లాడిస్తున్నారా? ముఖ్యమంత్రి పథకం ప్రకారమే ఈ విధంగా ప్రచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రే ప్రజల మీద, ప్రతి పక్ష పార్టీ మీద ఎదురు దాడి చేయమని పురిగొల్పుతున్నారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలేదని వాదించమని మంత్రులతో చెప్పిస్తున్నాడు. అందులో భాగంగానే అమరనాథ్ ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. అమరనాథ్ కి వాస్తవాలు కనిపించడం లేదా? జగన్ రెడ్డి యేరు దాటక తెప్ప తగలేసే రకం అనే విషయం మద్యపాన నిషేధం విషయంలో స్పష్టంగా కనపడుతోంది.
జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మధ్యపానాన్ని నిషేధించడానికి, సేవించడానికి, అమ్మడానికి టార్గెట్లు పెట్టారు. డిపార్టమెంటు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి జిల్లాలవారీగా టార్గెట్లు పెట్టారు. నేడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అమలు చేయడమే కాకుండా కమీషన్లకు కక్కుర్తి పడి మద్యం ద్వారా వచ్చే ఆదాయమంతా తనకే రావాలి అనే దుర్భుద్ధితో 106 బ్రాండ్లు విడుదల చేశారు. దేశంలో ఎక్కడాలేని కంపెనీలు మనే ఆంధ్ర రాష్ట్రంలోనే దొరికుతాయి. ఈ బ్రాండ్లను జే బ్రాండ్లు అంటారు. అప్పటి వరకు ఉన్న డిస్లరీలన్ని కబ్జా చేశారు. వాటిని తన ఆక్రమణలోకి తీసుకున్నారు. డిస్టలరీ యజమానులను బెదిరించారు, రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్లను అదుపులోకి తీసుకొని జే బ్రాండ్లు కబ్జా చేసిన కంపెనీలలో తయారు చేస్తున్నారు. కల్తీ మద్యాన్ని వాళ్ల అధికార దుర్వినియోగంతో ఏరులై పారిస్తున్నారు. చిన్న చిన్న దుకాణాలలో, టీ కొట్టుల్లో డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. మద్యం దుకాణాలలో మాత్రం డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేయాలి. ప్రతి రోజు వచ్చిన ఆదాయం తాడేపల్లి ప్యాలెస్ కు చేరాలి కనుకనే డిజిటల్ లావాదేవీలు పెట్టలేదు.
మద్యం V.Aని, తయారీని విపరీతంగా పెంచారు. దాదాపు I.M.F.L కేసులు లక్షకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. 30 వేల పైన బీరు కేసులు అమ్ముతున్నారు. మూడు కోట్లు పైన విలువ చేసే మద్యాన్ని ప్రజలచే తాగిస్తున్నారు. ప్రజలు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారు. లక్షాలాది మంది ఆసుపత్రుల పాలు అవుతున్నారు. ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తిన వారు వైద్యం చేయించడానికి ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఇలా లక్షలాది కుటుంబాలు చితికిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ధన దాహామే ఈ పరిణామాలకి కారణం. ముఖ్యమంత్రి స్వయంగా మద్యం డిస్టలరీలను ఆక్రమించి తన బినామీలను పెట్టి కల్తీ మద్యం తయారు చేయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండరు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మద్యాన్ని వాళ్లే తయారు చేస్తున్నారు. మద్యం అమ్మకాలు కూడా వాళ్లే చేస్తున్నారు. తాగుబోతులని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. నేడు 840 బార్లకు 2025 సంవత్సరం వరకు లైసెన్స్ లు ఇస్తున్నారు. మద్యపాన నిషేధంలో ముఖ్యమంత్రి మాట తప్పారు, మడమ తిప్పారు. తాగుబోతులని తాకట్టు పెట్టి 33 వేల కోట్లు అప్పు తెచ్చారు. మరో 25వేల కోట్లు అప్పు తేడానికి ప్రణాళికా రచిస్తున్నారు. కూలి పనులు చేసుకొని బతికే కుటుంబాలు ముఖ్యమంత్రి ధన దాహానికి చితికిపోతున్నాయి. ప్రజలు కల్తీ మద్యాన్ని తాగి అనేక రకాలైన అనారోగ్య సమస్యలకి గురిఅవుతున్నారు.
S.G.S ల్యాబ్స్ చెన్నై వాళ్లు జె బ్రాండ్లు తయారు చేసిన మద్యం కంపెనీలలో నకిలీ మద్యం బ్రాండ్లలలో వివిధ రకాల విష పదార్థాలు ఉన్నాయని, ఆ మద్యాన్ని తాగడం వల్ల దీర్ఘకాలిక జబ్బుల బారిన పడి మరణిస్తారని రిపోర్టులిచ్చాయి. దాదాపు మూడు సార్లు రిపోర్టులు ఇచ్చారు. రిపోర్టులు వచ్చాయి కనుకనే వారు పేర్కొన్న కొన్ని మద్యం బ్రాండ్లను షాపులలో కనకపడకుండా మాయం చేశారు. మద్యంలో విష పదార్థాలు ఉండటం అవాస్తవం అయివుంటే మద్యం పై పరీక్షలు నిర్వహించిన లేబరేటరీస్ కు సంబంధించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకునే వాళ్ళు, రకరకాల ఇబ్బందులు పెట్టుండే వాళ్ళు. జగన్ రెడ్డి వాటికి ఉపక్రమించ లేదంటే నూటికి నూరు శాతం మద్యంలో విష పదార్థాలు ఉండడం వాస్తవం అనేది అర్థమవుతుంది. ఇటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేయించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం చాలా ఘోరం. దాదాపు 6వేల కోట్ల మద్యం తయారీ జరుగుతుంది. దాని తయారికి, అసలు ధరకి వెయ్యి కోట్లు పోతే దాదాపు 5వేల కోట్ల ఆదాయం సంవత్సరానికి మిగులుతుంది. దాదాపు 5సంవత్సరాలలో 25వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతుంది.
విచ్చలవిడిగా కల్తీ మద్యం, నాటు సారా రాష్ట్రంలో ఏరులై పారుతుంది. నేటి తరానికి నాటు సార అంటే ఏంటో కూడ తెలియదు. 1990కి ముందు నాటు సారా అందుబాటులో ఉండేది. ప్రతి వైసీపీ నాయకుడు కూడ గ్రామాలలో నాటు సారా తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకునేవారు. నాటు సారాని ఆదుపు చేయకుండా, దశల వారిగా మద్యపాన నిషేధం చేస్తానని మహిళల తలలు నిమిరి మాయ మాటలు చెప్పారు. పాద యాత్రలో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నేడు ఇచ్చిన మాటని తుంగలో తొక్కారు. ఆడుపడుచుల తాళిబొట్లతో కాల యముడిలా ఆడుకుంటున్నాడు.
ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వాళ్ల ఖజానాకి ఎక్కడ చిల్లు పడుతుందో అని మేనిఫెస్టోలో అసలు మద్యపాన నిషేధం లేదని ఎదురు దాడికి పాల్పడుతున్నారు. మేనిఫెస్టోలోని ప్రధానమైన అంశం దశల వారిగా మద్యపాన నిషేదాన్ని గాలికి వదిలేసి మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పుకోవడానికి జగన్ రెడ్డికి సిగ్గుండాలి. మహిళలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. మద్యపాన నిషేధం అమలు చేయకపోవడం, మద్యం తయారి పట్ల, మద్యంలో అమలయ్యే విధానాల పట్ల సమయం వచ్చినప్పుడు మహిళలే తగిన బుద్ధి చెప్తారని పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు.