గౌ. ముఖ్యమంత్రి వర్యులు,
వై.యస్. జగన్మోహనరెడ్డి గారికి
ఏదైనా ఒక దేశం, రాష్ట్రం మాఫియా గుప్పిట్లో చిక్కితే ఇక దానికి విముక్తి ఉండదని 1980 ల నుంచి లాటిన్ అమెరికా దేశాల అనుభవం నిరూపిస్తోంది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్ తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోంది. ఇటీవల రాష్ట్రంలో రూ. 9,251 కోట్ల విలువైన 2 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కాల్చివేశామని పోలీసులు చెబుతున్నారు. అంటే కేవలం దొరికిన గంజాయి ఇన్ని లక్షల్లో ఉంటే ఇక దొరకని గంజాయి ఎన్ని లక్షల కిలోల్లో ఉంటుంది.
గతంలో విశాఖ మన్యంలో కేవలం వందల ఎకరాల్లో జరిగే గంజాయి సాగు వైసీపీ పాలనలో 15 వేల ఎకరాలకు విస్తరించింది. ఏటా 8 వేల కోట్ల విలువైన గంజాయి రాష్ట్రం నుంచి తరలి వెళ్తోంది. వైసీపీ నేతలు అక్రమ సంపాద కోసం మన్యంలో గంజాయిని వాణిజ్య పంటగా మార్చుకుని అమాయకులయిన గిరిజనుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. మరో వైపు సీఎం ఇంటి సమీపంలోనే గంజాయి విక్రయాలు జరుతున్నా చర్యలు శూన్యం. చివరకు ఆన్ లైన్ లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాంటే రాష్ట్రంలో పరస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోంది. వీటిపై టీడీపీ తరపున ప్రశ్నిస్తే నర్సీపట్నం నుంచి అర్ధరాత్రి మా ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ఇప్పుడు పోలీసులే ఏకంగా 2 లక్షల కిలోల గంజాయి పట్టుకున్నామంటున్నారు, ముఖ్యమంత్రి దీనికేం సమాధానం చెబుతారు ? రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి, డ్రగ్ మాఫియాపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు 12. అక్టోబర్ 2021 డిల్లీలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తర్వాతే పోలీసుల్లో కదలికవచ్చి నవంబర్ 2021లో ఆఫరేషన్ పరివర్తన చేపట్టారు. కానీ మేం చెప్పేవరకు ప్రభుత్వానికి, పోలీసులకు రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి, డ్రగ్ మాఫియా గురించి తెలియదా?
మరో వైపు ఏపీలో గంజాయి పరిమాణం 3 ఏళ్లలో 3 రెట్లు పెరిగిందని, 2020లో ఏకంగా 1,06,042.7 కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు, మత్తుకు బానిసలై 2020లో 385 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పార్లమెంట్ లో లిఖితపూర్వకంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ చెప్పారు. 2021 పోలీసు వార్సిక నివేదికలో మన రాష్ట్రంలో గతేడాది కంటే 15 శాతం మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, దాడులు పెరిగాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మాకాల వల్లే రాష్ట్రంలో మహిళపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి.
అక్రమ సంపాదన కోసం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్ మాఫియా, జూద క్రీడల్ని పెంచిపోషించటం వాస్తవం కాదా? హెరాయిన్ మాఫియాపై, క్యాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నానిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? పేకాట క్లబ్బుల్లు నిర్వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఖరి వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొంది. తమ అవినీతి, అక్రమాల్ని సహకరించేందుకు డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్ ని తొలగించి సొంత కులానికి చెందిన వ్యక్తిని డీజీపీగా నియమించారు. ముఖ్యమంత్రి ఇకనైనా గంజాయి మాఫియా, జూద క్రీడలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో గంజాయిని నివారించి రాష్ట్ర యువత భవిష్యత్ కాపాడాలి.