చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ తీర్థం స్వీకరించారు. నల్లాల ఓదెలు, మంచిర్యాల జడ్పీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి దంపతులకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, చెన్నూరు, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.
అంతకుముందు ఓదెలు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నిన్నటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఓదెలు తన రాజకీయ జీవితాన్ని టీఆర్‌ఎస్‌తో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2010లో రాజీనామా చేసి.. మరోసారి గెలుపొందారు. 2014లోనూ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.