ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ సభ్యత్వాన్ని అందించి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల బీజేపీ కీలక నేతలు డాక్టర్ లక్ష్మణ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా, చీఫ్ విప్ గా, ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డి సేవలందించారని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా కిరణ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలిపారు. కిరణ్ తండ్రి అమర్ నాథ్ రెడ్డి మంత్రిగా పని చేశారని, కిరణ్ సీఎంగా చేశారని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ అని, రంజీ స్థాయి వరకు ఆడారని తెలిపారు. కిరణ్ తన ఇన్నింగ్స్ ను కాంగ్రెస్ లో ప్రారంభించారని, ఇప్పుడు బీజేపీలో కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నారని చెప్పారు.