పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. హత్యలు, దాడులతో టీడీపీ కేడర్ ను భయపెట్టాలనుకుంటున్న జగన్ గారూ శిశుపాలుడిలా మీ పాపాలు పండిపోయాయని అన్నారు. ప్రజావ్యతిరేకత తీవ్రం కావడంతో రాజకీయ ఆధిపత్యం కోసం మీరు చేయిస్తున్న హత్యలు, దాడులే మీ పతనానికి దారులని వ్యాఖ్యానించారు.
దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భర్త పాల్గొన్నాడంటే.. మీ రౌడీమూకలు ఎంతగా బరితెగించాయో అర్థమవుతోందని లోకేశ్ అన్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం బ్లడ్ లోనే ఉన్న మీ పాలనలో పల్నాడు ప్రాంతం రక్తసిక్తమవుతోందని… ఇకనైనా హత్యారాజకీయాలు, దాడులను ఆపాలని చెప్పారు. లేకపోతే.. ఇంతకు నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులు అండగా ఉన్నారని రెచ్చిపోతున్న వైసీపీ నేతలకు ఇదే చివరి హెచ్చరిక అని అన్నారు. తాము తిరగబడితే మీ వెంట వచ్చేది ఎవరు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని కాపాడేది ఎవరు? అని ప్రశ్నించారు.