Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా గళంగా మారనున్న నారా లోకేష్ యువ గళం

-ప్రజలు చేసే శబ్దంతో ఈ ప్రభుత్వ పునాదులు కదలడం ఖాయం
-కేజీఎఫ్ 1 కంటే 2, బాహుబలి 1 కంటే 2 సూపర్, డూపర్ హిట్ అయినట్లు యువ గళం 2 కూడా హిట్ అవుతుంది
-భారతి రెడ్డికి జన్మదినోత్సవం సందర్భంగా ప్రజల ధనంతో నిర్మించిన 450 కోట్ల రూపాయల ప్యాలెస్ ను ఆమెకు బహుమతిగా జగన్మోహన్ రెడ్డి ఇస్తారేమో?!
-రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మారడం ఖాయం… కొత్త ప్రభుత్వం ఏర్పాటు తథ్యం
-దీనితో, కొంతమంది అవినీతి అధికారులు తిరిగి మాతృ సంస్థకు వెళ్తామని దరఖాస్తు పెట్టుకున్నారట
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజోలు నుంచి ప్రారంభించిన రెండవ దఫా యువ గళం పాదయాత్ర ప్రజాగళంగా మారనుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రజల గళంగా మారనున్న యువ గళం శబ్దానికి పాలకపక్షం పునాదులు కదిలి, కూలిపోయే పరిస్థితులు ఎంతో దూరంలో లేదన్నది స్పష్టం అవుతుందన్నారు.

నారా లోకేష్ ప్రసంగానికి ప్రజల నుంచి చక్కటి స్పందన లభించింది అన్నారు. బస్సు యాత్ర, తుస్సు యాత్రలో, జగన్మోహన్ రెడ్డి సభకు బలవంతంగా తరలించినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్లు ప్రజలు ఎదురు చూసేవారు. కానీ లోకేష్ యువ గళం పాదయాత్ర సభలో మాత్రం ప్రజల నుంచి చక్కటి ప్రతిస్పందన లభించిందన్నారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నారా లోకేష్ చేపడుతున్న యువ గళం పాదయాత్ర విశాఖపట్నం వరకు కొనసాగనుంది. విశాఖపట్నంలో డిసెంబర్ 8వ తేదీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దంపతులు కొత్త ఇంట్లో పాలు పొంగించనున్నారట. దీనితో విశాఖకు భూకంపం రావడం ఖాయమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

డిసెంబర్ 8వ తేదీన వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి జన్మదినోత్సవం కావడంతో, ప్రజాధనంతో నిర్మించిన 450 కోట్ల రూపాయల ప్యాలెస్ ను ఆమె జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కానుక ఇస్తారేమోనని రఘురామకృష్ణం రాజు అన్నారు. విశాఖపట్నం వెళ్లిన, వెనక్కి రాక తప్పదన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటేనే ప్రజలకు భూకంపం గుర్తుకు వచ్చిందంటే, ఈ సందర్భంగా నాకు ఒక పాయింట్ గుర్తుకు వచ్చింది.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలుకలు, కుక్కల వంటి మూగజీవులు చిన్న మార్పును బ్రహ్మాండంగా పసిగడుతాయి. ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి పోవడం ఖాయం… కొత్త ప్రభుత్వం ఏర్పడడం తద్యమని ప్రభుత్వ అధికారులకు ఇప్పటికే చాలా స్పష్టంగా అర్థమయ్యిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

సునీల్ కుమార్ ను పదేళ్లు జైల్లో పెట్టిస్తా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడమన్నట్లుగా ఆడి అక్రమ కేసులు నమోదు చేసి, ప్రజలను వేధించిన సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను పదేళ్లపాటు జైల్లో పెట్టిస్తానని రఘురామకృష్ణం రాజు శపథం చేశారు. గత రెండు రోజులుగా ప్రభుత్వ పెద్దల అవినీతి అక్రమాలకు సహకరించిన అధికారులంతా మాతృ సంస్థలకు తిరిగి వెళ్తామని బదిలీల కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం మారనుందని తెలిసి పోలీసు అధికారుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సునీల్ కుమార్ లాంటి అధికారి బదిలీపై ఎక్కడకు వెళ్లి వెనక్కి రప్పిస్తాం.

అలాగే ఎక్స్ట్రా ఆర్టిస్టులుగా తానా అంటే తందానా అన్న వారిని కూడా కారాగారంలో బంధిస్తాం. ఢిల్లీకి వెళ్లిపోతే, కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని అనుకుంటున్నారేమో… మా స్టడీ మేము చేశామని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. సునీల్ కుమార్ తో పాటు ప్రస్తుత సిఐడి చీఫ్ సంజయ్, గతంలో సిఐడిలో విధులు నిర్వహించి ప్రస్తుతం బీహార్ లో విధులను నిర్వహిస్తున్న సునీల్ నాయక్ వంటి అధికారులపై చర్యలు తప్పవన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాభియోగ కేసుల్లో నిందితురాలిగా విచారణ ఎదుర్కొన్న శ్రీలక్ష్మి, ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ నుంచి తెలంగాణకు తిరిగి వెళ్లాలనుకుంటున్నారట.

అలాగే సీతారామాంజనేయులు కేంద్ర సర్వీసులోకి వెళతానని ప్రభుత్వ పెద్దల అనుమతిని కోరుతున్నారట. అలాగే, కోస్ట్ గార్డ్ సర్వీస్ కు చెందిన వెంకట్ రెడ్డి కూడా మాతృ సంస్థకు వెళ్తానని చెబుతున్నారట. వీరంతా బదిలీపై ఎక్కడకు వెళ్ళి వారు చేసిన తప్పులకు శిక్ష తప్పదు. మైనింగ్, గనుల శాఖ సంచాలకునిగా విధులను నిర్వహించిన వెంకట్ రెడ్డి, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు 400 నుంచి 500 కోట్ల రూపాయల పెనాల్టీలు వేసి ప్రత్యర్థి పార్టీల నాయకులను ఇబ్బందులు పెట్టారు. ఇక ఇసుక కాంట్రాక్టు జెపి సంస్థకు కట్టబెట్టామని చెప్పినప్పటికీ, కాంట్రాక్టు తీరిపోయిన తర్వాత కూడా అదే సంస్థ ముందు పెట్టి ప్రభుత్వ పెద్దల బంధువులు ఇసుకను దోచుకున్నారు.

ఇసుకను దోచుకోవడం కోసం తోడ్పడిన వెంకట్ రెడ్డి మాతృసంస్థ కు వెళ్ళిపోతానని దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ, ఆయన్ని అంత సునాయసంగా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవ రెడ్డి వరస్ట్ గా వ్యవహరించారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకోవడానికి అన్ని విధాలుగా సహకరించారు. ప్రభుత్వ పెద్దలు వేల కోట్ల రూపాయలు కన్నాలు వేయడానికి తోడ్పడిన వాసుదేవ రెడ్డి కూడా ఇప్పుడు బదిలీపై వెళతానని అంటున్నారు.

ఇలా ప్రభుత్వ శాఖలలోని 13 మంది కీలక అధికారులు మాతృ సంస్థకు, కేంద్ర సర్వీసులకు వెళ్తామని దరఖాస్తులు చేసుకోవడం వెనక, వారికిప్పటికే సినిమా అర్ధమయ్యింది. ప్రజల నాడిని అర్థం చేసుకున్న అధికారులు బదిలీపై వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వ పెద్దలు మాత్రం వాలంటీర్లతో ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారని రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. వాలంటీర్లకు జేబులో సొమ్ము ఇస్తున్నట్లుగా బిల్డప్పులు ఇస్తూ, వారితో ప్రజలని భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

భయపెట్టాలనుకోవడాన్ని ప్రజలు భరిస్తారు… సమయం వచ్చినప్పుడు తలలు తీసేస్తారు. ప్రభుత్వంలో ఉన్న వారికి పదవిపోవడం అంటే తలకాయలు పోయినట్టేనని రఘురామకృష్ణం రాజు తెలిపారు . ఓట్ల రూపంలో వారికి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం, దారుణంగా తీర్పు ఇస్తారని… ఇది రాబోయే రోజుల్లో మనమంతా చూస్తామన్నారు. ప్రస్తుతానికి టీజర్లు చూపించి, పోలింగ్ రోజున ప్రజలు అసలు సినిమా చూపిస్తారన్నారు.

లక్షల కోట్లు కొట్టేసి… ప్రజల ముఖాన ఎంగిలి మెతుకులు వేసే ప్రయత్నం
లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుని మళ్లీ ప్రజల బ్రతుకులతో వ్యాపారం చేయడానికి ఎన్నికల్లో మూడు నుంచి ఐదు వేల రూపాయలను ఎంగిలి మెతుకుల్లా వారి ముఖాన వేయాలని చూస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ఈ దరిద్రులు, మోసగాళ్లు ఎక్కడ నుంచి డబ్బులు తీసుకువచ్చి ఇస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. డబ్బులు తీసుకొని ఓటు వేయడం తప్పు… కానీ ప్రజల నుంచి దోచుకున్న డబ్బులు కొంత ఇస్తే తీసుకోవడం తప్పేమీ కాదు.

వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే లకు దొంగ సర్వే నివేదికలను చూపించి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ కోసం 20 నుంచి 25 కోట రూపాయలు చెల్లించాలని పార్టీ పెద్దలు అడుగుతున్నట్టు తెలిసింది. అధికారులు బదిలీలకు దరఖాస్తులు పెట్టుకున్నారంటేనే రాష్ట్రంలో వైకాపా పార్టీ సినిమా ఏమిటో అర్థం అవుతోంది. వైకాపాకు భవిష్యత్తు లేదు. ఎమ్మెల్యే టికెట్ కోసం 20 నుంచి 25 కోట్ల రూపాయలు చెల్లించి ఓడిపోయే పరిస్థితిని కొని తెచ్చుకోవద్దు. అధికారులు బదిలీకి దరఖాస్తు పెట్టుకున్న అధికారుల తీరును చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

చరిత్రలో మద్యం వ్యాపారం చేసిన వారు బాగుపడినట్లు దాఖలాలు లేవు
చరిత్రలో మద్యం వ్యాపారం చేసిన వారు బాగు పడినట్లుగా దాఖలాలు లేవని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ ఎం డీ గా వ్యవహరించిన వాసుదేవ రెడ్డి మద్యపాన ప్రియులకు ఎంతో అన్యాయం చేశారు. ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ కాకుండా, రెక్టిఫైడ్ స్పిరిట్ ను కరెక్ట్ గా ప్యూరిఫైడ్ చేయకుండా, 8 రోజుల కాలవ్యవధి కూడా పూర్తికాకముందే ఆ మద్యాన్ని ప్రజల మీదికి వదిలారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని సేవించి 5 లక్షల మంది మృతి చెందినట్లుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి తెలిపారు. సారా వ్యాపారం ద్వారా ఇతరుల కుటుంబాలను నాశనం చేసిన వారు ఎవ్వరు బాగు పడినట్లు చరిత్రలో లేదు.

తాగి చెడిపోయిన వారితోపాటు, మద్యాన్ని తాపించే వ్యాపారాన్ని నిర్వహించిన వారు కూడా బాగుపడరన్నారు. ప్రభుత్వంలోని పెద్దలు స్వలాభం కోసం ప్రజల రక్త మాంసాలతో పాటు, డబ్బులను, ఆరోగ్యాన్ని హరించారని మండిపడ్డారు. ఎంతోమంది మగువలను మాంగల్యానికి దూరం చేసి, ఇప్పుడు నేను మీ బిడ్డను, మీ మనవడిని, మీ మావయ్య ని అని కల్లబొల్లి కబుర్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇలా చేసిన వారు ఎవరికైనా తమ చివరి రోజులు దరిద్రంగా దుర్భరంగా ఉంటాయి. ఇది ప్రపంచ చరిత్ర నేర్పిన పాఠం.

అశాశ్వతమైన డబ్బుల కోసం లక్షలాది మంది ప్రజల జీవితాలను చిద్రం చేసే ఈ వ్యాపారాన్ని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమ వ్యక్తిగత లాభం కోసం చేయడం దారుణం. కనీస ప్రమాణాలు పాటించకుండా, ప్రజల ప్రాణాలను లాగేయటం సిగ్గుచేటు. ప్రజలకు వాళ్ళు చేసిన ఈ అన్యాయానికి వారు కూడా బలికాక తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న సాక్ష్యం… అయితే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని చేతులు ముడుచుకొని కూర్చోవాలని చెప్పడం లేదు. ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలి. ఇలాంటి ద్రోహులను ఎలాగైనా తిప్పి కొట్టాలి.

రాష్ట్రంలోని ప్రజలను పోలీసు వెధవలు , ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకొని భయకంపితులను చేశారు . ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై చెత్త కేసులు నమోదు చేసి వేధించడం దారుణం. భయం గుప్పెట్లో ఉన్న ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం మూర్ఖత్వం. భయంతోనే తిరుగుబాటు మొదలవుతుంది. భయపెడుతున్న వ్యవస్థ పై జనం బదులు తీర్చుకోవాల్సిన అవసరం ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

విశాఖ నుంచి తరలిపోతున్న ఐటీ కంపెనీలు
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రస్తుతం మిలీనియం టవర్స్ ను ముఖ్యమంత్రి సమీక్ష కార్యాలయం ఏర్పాటు కోసం ఖాళీ చేయాలని ఆదేశించడంతో, ఎన్నో ఐటి కంపెనీలు రాష్ట్రం వదిలి తరలి వెళ్తున్నాయి. దేశవ్యాప్తంగా శాఖలు కలిగిన ఒక ఐటీ కంపెనీకి విశాఖలో కూడా బ్రాంచ్ ఉంది. దాదాపు 700 నుంచి 800 మంది పనిచేస్తున్నారు.

ఇప్పుడు ఆ ఐటి కంపెనీ మిలీనియం టవర్స్ లో నుంచి కార్యాలయం ఎత్తివేయాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో, రాష్ట్రం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. విశాఖ నుంచి గంపగుత్తగా ఐటీ కంపెనీలు తరలిపోయే పరిస్థితి నెలపొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ వాసుల కష్టాలు గాజాలో గజగజ వణుకుతున్న ప్రజలను తలపిస్తున్నాయి. భారతీ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా భయంతో విశాఖవాసులు హడలిపోతున్నారు.

అదే రోజు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో కాలు పెడుతుండడమే దానికి కారణం అంటున్నారు.. ముఖ్యమంత్రి నివసించనున్న ప్యాలెస్ కు సమీపంలో సముద్ర తీరంలో కూడా ఒకటి రెండు కిలోమీటర్లు ఎటువంటి బోట్లు తిరగకూడదని నిషేధాజ్ఞలు విధించారట. కే జి ఎఫ్ 2 సినిమాలో మాదిరిగా ఇంట్లో నుంచే షిప్ లో వెళ్లిపోతాడేమోనని ప్రజలు అనుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

సాక్షి దినపత్రికకు అడ్వర్టైజ్మెంట్లో రూపంలో లాభం
ఆటాడుకుందాం రా పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ద్వారా క్రీడాకారులకు ఎంత మేలు జరుగుతుందో తెలియదు కానీ సాక్షి దినపత్రికకు మాత్రం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో లాభం వస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆటాడుకుందాం రా కార్యక్రమానికి ఎవరైనా ప్రముఖ క్రీడాకారుల ఫోటోను ఉపయోగించి ఉంటే బాగుండేది. దానికి కూడా ముఖ్యమంత్రి ఫోటోనే ముద్రించడం హాస్యాస్పదంగా ఉంది.

నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్ర దినదినాభివృద్ధి చెందుతూ, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించే విధంగా కొనసాగాలని రఘురామ కృష్ణంరాజు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారనుందని తెలిసి అధికారులు బదిలీపై వెళ్లిన లాభం లేదు. ఈ ప్రభుత్వం ఉన్న కొన్ని నాళ్లలో పశ్చాతాపంతో ప్రజలకు మేలు జరిగే విధంగా పనిచేస్తే మంచిదని హితవు పలికారు. విశాఖ వాసులకు రానున్నది గడ్డుకాలం. ఎవరైనా రాష్ట్ర హైకోర్టును లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించితే మంచిదన్నారు.

LEAVE A RESPONSE