Suryaa.co.in

Telangana

సందడిగా నారద జయంతి వేడుకలు

నారద మహర్షి గురించి అపోహలు ప్రచారంలో ఉన్నాయని, వాస్తవానికి లోకహితం కాంక్షించే అసలైన పాత్రికేయుడు అని జాతీయ పత్రిక ‘ఆర్గనైజర్’ సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్ అభిప్రాయపడ్డారు. 1826 వ సంవత్సరం లోనే కోల్ కతా లో ప్రారంభమైన ఉద్దండ్ మార్తాండ్ పత్రిక ‘నారద మహర్షి’ ముఖచిత్రంతో ప్రచురితం అయ్యిందని వెల్లడించారు.‌, ఆ తర్వాత నారద మహర్షి ని పత్రికా రంగ ఆద్యుని గా గుర్తించాల్సి ఉన్నప్పటికీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కనుమరుగు చేశారని అభిప్రాయ పడ్డారు. పాత్రికేయులు నారద సూత్రాలలోని 75,76,77 వ సూత్రాలను ఆదర్శంగా తీసుకొని సరైన ప్రశ్నలు అడగటం, సరైన వ్యక్తి ని అడగటం, సరైన సమయంలో వార్తను ఇవ్వటం ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు.

సమాచార భారతి ఆధ్వర్యంలో ” తొట్ట తొలి ఆదర్శనీయ పాత్రికేయుడు” నారద మహర్షి జయంతిని పురస్కరించుకొని పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరిగాయి. రెడ్ హిల్స్ లోని FTCCI ఆడిటోరియంలో లబ్ద ప్రతిష్టులైన పాత్రికేయుల సమక్షంలో వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్ సంపాదకులు ముఖ్యఅతిథిగా విచ్చేశారు పాత్రికేయులు సమాచారాన్ని అందించేటప్పుడు వార్తలు రిపోర్ట్ చేసేటప్పుడు లోకహితం దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు సమాజ శ్రేయస్సుతో అందించే వార్తలే నాణ్యతతో నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

సమాచారభారతి అధ్యక్షులు డా. జి గోపాలరెడ్డి సమాచారభారతి ఆవిర్భావం ఎందుకు జరిగింది, జాతీయ భావ ఆలోచనా స్రవంతి ని నిలబెట్టాల్సిన అవసరం గురించి వివరించారు. యువ పాత్రికేయులకు విలువలతో కూడిన పాత్రికేయత పై తర్ఫీదు ఇవ్వటం, సామాజిక మాధ్యమం లో పనిచేస్తున్న పౌర పాత్రికేయుల సదస్సు లు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సమాచారభారతి నిర్వహిస్తోందని తెలిపారు.

“వడ్లమూడి స్మారక పురస్కారం” సీనియర్ పాత్రికేయులు, స్వతంత్ర టీవీ అవుట్ పుట్ ఎడిటర్ రమా విశ్వనాథన్ కి,’ భండారు సదాశివ రావు స్మారక’ పురస్కారం సీనియర్ పాత్రికేయులు సామవేదం జానకీరామ్ కి, ‘ సమాచారభారతి కాలమిస్ట్’ పురస్కారం శ్యామసుందర్ వర యోగి కి, ‘సమాచారభారతి యువపురస్కారం’ యువ పాత్రికేయులు కొంటు మల్లేశం కి ఇవ్వడం జరిగింది. కార్యదర్శి ఆయుష్ నడింపల్లి సారధ్యంలో సమాచార భారతి సభ్యులు కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకొన్నారు.

LEAVE A RESPONSE