Suryaa.co.in

Andhra Pradesh

జనవరి 7 నుంచి జాతీయ సేంద్రీయ సమ్మేళన్‌

–ప్రారంభించనున్న మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు
–ఆర్గానిక్‌ ఉత్పత్తులతో 100 స్టాల్స్‌ ఏర్పాటు
–ఉత్తమ రైతులు, వివిధ రంగాల ప్రముఖులకు సత్కారం
–మీడియా సమావేశంలో మేళ నిర్వహణా కమిటి అధ్యక్షుడు ముత్తవరపు వెల్లడి

విజయవాడః సేంద్రీయ సాగును ప్రోత్సహించడం, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఏపీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో జాతీయ కిసాన్‌ సమ్మేళన్‌ నిర్వహిస్తున్నట్టు మేళ నిర్వహణాధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ,గో ఆధారిత వ్యవసాయ దారుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు, భారతీయ కిసాన్‌ సంఘం అధ్యక్షుడు జే.కుమారస్వామి, మేళ నిర్వహణా కమిటీ కార్యదర్శి వి.దుర్గ ప్రసాదరాజు, చెప్పారు.

విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక ఎంజీ రోడ్‌లోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో జరుగనున్న ఈ జాతీయ స్థాయి సమ్మేళన్‌ను మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ప్రారంభిస్తార న్నారు. ఈ సమ్మేళన్‌లో ఇప్పటి వరకు ఏపీతో పాటు తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 100కు పైగా ఆర్గానిక్‌ ఉత్పత్తుల స్టాల్స్‌ ఉంటాయన్నారు. సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, బట్టలు, మొక్కలు, మెడిసిన్స్‌తో పాటు సేంద్రీయ సాగు కోసం వినియోగించే యంత్ర పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయన్నారు.

తొలిరోజు జై కిసాన్‌ ఆధ్వర్యంలో సేంద్రీయ సాగులో అత్యుత్తమ ప్రతిభాపాటవాలు కనపర్చిన ఆదర్శ రైతులతో పాటు సేంద్రీయ వ్యవసాయం కోసం పనిచేస్తున్న వివిధ రంగాలకు చెందిన 26 మంది ప్రముఖులు, పాత్రికేయులకు సన్మానం చేయబోతున్నట్టు చెప్పారు. రెండో రోజు మిద్దెతోటలసాగుపై సెమినార్‌ జరుగుతుందన్నారు. ముగింపురోజైన 9వ తేదీన ఆరోగ్యమే మహా భాగ్యంపై డాక్టర్‌ రామచంద్రరావు ప్రసంగం ఉంటుందన్నారు.ఈ సమ్మేళన్‌లో కనీసం వెయ్యి మందికి పైగా రైతులు పాల్గొంటారని చెప్పారు. సేంద్రీయ పాలసీని తీసుకొచ్చే దిశగా అడుగులేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఈ జాతీయ సమ్మేళన్‌లో భాగస్వామి కాబోతుందన్నారు.

రైతు సా«ధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తోన్న మహిళా సంఘాలు, రైతులు ఈ సమ్మేళన్‌లో తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించ బోతున్నా రన్నారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయకుమార్‌ కూడా ఈ సమ్మేళన్‌లో కీలకోపన్యాసం చేయబోతున్నారని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ఆత్మహత్యల్లేని రైతాంగాన్ని తయారు చేయడం కోసం సేంద్రీయ సాగును ప్రోత్సహించడమే ఈ సమ్మేళన్‌ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

LEAVE A RESPONSE