వ్యవసాయ రుణాల్లో జాతీయ బ్యాంకులదే పెద్ద వాటా!

- మొత్తం పంపిణీలో 64.5% జాతీయ బ్యాంకుల రుణాలే
- పంట రుణాల్లో గ్రామీణ బ్యాంకు టాప్ లక్ష్యంలో వెనుకబడిన ఎస్బీఐ, సహకార బ్యాంకులు
హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రాష్ట్రంలో రైతులకు అందిన రూ.96,943 కోట్ల వ్యవసాయ రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా రూ.62,567 కోట్లు (64.5 శాతం). ప్రైవేటు బ్యాంకులు రూ.15,140 కోట్లు (15.6%), తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.12,724 కోట్లు (13.1%), సహకార బ్యాంకులు రూ.5,319 కోట్లు (5.5%) అందించాయి. ఎస్ఎల్బీసీ 51వ సమావేశం నివేదికలోని బ్యాంకుల వారీ గణాంకాలు ఈ వివరాలను వెల్లడించాయి. వ్యవసాయానికి మొత్తం వార్షిక లక్ష్యం రూ.1,81,035 కోట్లు కాగా, ఇప్పటివరకు 53.55 శాతం నెరవేరింది.
ఎస్బీఐ లక్ష్యంలో వెనుకంజ
లీడ్ బ్యాంకు ఎస్బీఐ రూ.40,285 కోట్ల వ్యవసాయ లక్ష్యానికి రూ.20,871 కోట్లు (51.81%) ఇచ్చింది. రాష్ట్రంలో అందిన మొత్తం వ్యవసాయ రుణాల్లో ఇది 21.5 శాతం. అయితే పంట రుణాల్లో మాత్రం రూ.21,211 కోట్ల లక్ష్యానికి రూ.6,726 కోట్లతో 31.71 శాతం వద్దే ఆగిపోయింది. యూనియన్ బ్యాంకు రూ.15,091 కోట్లు (46.71%) ఇచ్చి మొత్తం వ్యవసాయ రుణాల్లో 15.6 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది.
పంట రుణాల్లో గ్రామీణ బ్యాంకు టాప్
ఖరీఫ్‌లో అందిన రూ.42,885 కోట్ల పంట రుణాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకుదే అగ్రస్థానం. రూ.7,827 కోట్లతో (18.3%) ఆ బ్యాంకు ముందుంది. కెనరా బ్యాంకు రూ.7,506 కోట్లు (17.5%), ఎస్బీఐ రూ.6,726 కోట్లు (15.7%), యూనియన్ బ్యాంకు రూ.4,744 కోట్లు (11.1%), ఇండియన్ బ్యాంకు రూ.3,608 కోట్లు (8.4%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పంట రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 65 శాతం కాగా, ప్రైవేటు బ్యాంకుల వాటా 8.5 శాతమే.
ఇతర జాతీయ బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 98.29 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 81.89 శాతం, ఇండియన్ బ్యాంకు 61.41 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 58.86 శాతం వ్యవసాయ లక్ష్యాన్ని సాధించాయి. కెనరా బ్యాంకు 49.3 శాతం వద్ద ఉండగా, సెంట్రల్ బ్యాంకు 42.85 శాతంతో వెనుకబడింది. సెంట్రల్ బ్యాంకు పంట రుణాల్లో సాధన 10.98 శాతమే.
పంట రుణాల లో ప్రైవేటు బ్యాంకులు అంతంత మాత్రమే
ప్రైవేటు బ్యాంకులు మొత్తంగా 71.03 శాతం లక్ష్యం సాధించాయి. అయితే వీటి రుణాలు ఎక్కువగా అనుబంధ కార్యకలాపాలకే వెళ్లాయి. పంట రుణాల్లో వీటి సాధన 41.89 శాతమే. హెచ్డీఎఫ్సీ రూ.3,499 కోట్లు (49.3%), యాక్సిస్ రూ.2,619 కోట్లు (168%), ఐసీఐసీఐ రూ.1,741 కోట్లు (39.88%), కోటక్ రూ.1,382 కోట్లు (102%) ఇచ్చాయి. ఐసీఐసీఐ పంట రుణాల్లో కేవలం 6.94 శాతం సాధించింది.
సహకార బ్యాంకులు అట్టడుగున
సహకార బ్యాంకుల (టీజీసీఏబీ) తీరే అత్యంత నిరాశాజనకంగా ఉంది. రూ.18,084 కోట్ల లక్ష్యానికి రూ.5,319 కోట్లు (29.41%) మాత్రమే ఇచ్చాయి. పంట రుణాల్లో 32.71 శాతం, వ్యవసాయ టర్మ్ రుణాల్లో 12 శాతం మాత్రమే సాధించాయి.
