– నాటు సారా రహితంగా ఏడు గ్రామాలు ప్రకటించేందుకు సిద్ధం
– నాటు సారా పై 14405 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వండి
మంగళగిరి: నవోదయం 2.0తో నాటుసారా రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చిదిద్దటమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామని ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ స్పష్టం చేసారు.
నవోదయం 2.0 కార్యక్రమం మరింత దృఢంగా అమలు చేసే క్రమంలో గురువారం మంగళగిరి కమీషనర్ కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష నిర్వహించి, ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సమీక్షించడంతో పాటు తదుపరి దశలో అమలు చేయాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను నిర్దేశించారు.
ఐదు దశలుగా రూపొందించబడిన నవోదయం 2.0 కార్యక్రమం రాష్ట్రంలో ఇడీ మద్యాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు రూపొందించబడిందని ఈ సందర్భంగా నిశాంత్ తెలిపారు. ఉత్పత్తి, నిల్వ, వినియోగాన్ని అరికట్టడమే కాకుండా, దీనివల్ల ప్రజలకు కలిగే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం వంటి దుష్పరిణామాలపై అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ముఖ్యంగా, పేద ప్రజల్లో దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రాధాన్యతతో అమలు చేస్తోంది. అదే విధంగా, ఇడీ మద్యం వ్యాపారంతో జీవనోపాధి పొందుతున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ లక్ష్యం నెరవేరేందుకు ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజల సహకారం కూడా కీలకం.
ప్రారంభ దశలో, ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖలు మరియు ఎన్జీవోలు సమన్వయంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, గ్రామ సభలు నిర్వహించి, ఇడీ మద్యపు ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రచార రథాలు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ 14405 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలు ఎక్కడైనా అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుంటే తెలియజేయడానికి వీలు కల్పించాయి. కళా జాతాలు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 378 ప్రదర్శనలు నిర్వహించాయి. అలాగే, ఇడీ మద్యం వల్ల కలిగే నష్టాలను వివరించే రెండు అవగాహన వీడియోలు రూపొందించి, సోషల్ మీడియా, కేబుల్ టీవీలు, సినిమా థియేటర్లలో ప్రసారం చేస్తున్నారు.
2025 ఫిబ్రవరి 19 న ప్రారంభమైనప్పటి నుండి నవోదయం 2.0 ద్వారా గణనీయమైన పురోగతి సాధించామని రాహుల్ దేవ్ శర్మ స్పష్టం చేసారు. ఇప్పటివరకు 2,273 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, 80,601 మంది ప్రజలు పాల్గొన్నారు. 1,100 జాగరీ వ్యాపారులు గుర్తించబడ్డారు, 10,049 మందికి బైండ్ ఓవర్ పెట్టబడింది, 1,181 కేసులు నమోదు చేయబడ్డాయి, 1,118 మందిని అరెస్ట్ చేశారు.
ఇప్పటివరకు 57,575 లీటర్ల ఇడీ మద్యం స్వాధీనం, 2,80,063 లీటర్ల ఫెర్మెంటెడ్ జాగరీ వాష్ నాశనం చేయబడింది. 1,682 కిలోల జాగరీ స్వాధీనం, 56 వాహనాలు సీజ్, 52 మంది జాగరీ వ్యాపారులపై కేసులు నమోదు, 23 మంది అరెస్ట్ అయ్యారు. 50 మంది బాండ్ ఉల్లంఘించినందుకు ₹5,75,000 జరిమానా విధించబడింది. ఏడు గ్రామాలు పూర్తిగా ఇడీ మద్యం రహిత గ్రామాలుగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా, శ్నిశాంత్ కుమార్, రాహుల్‌దేవ్ శర్మ మాట్లాడుతూ అధికారులు అన్ని పెండింగ్ అవగాహన కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పుడు కార్యాచరణ దశ ప్రారంభమైనందున, నేర నియంత్రణ పై దృష్టి సారించాలని సూచించారు. సి క్లాస్ గ్రామాల సంఖ్య తగ్గించాలని, ఇడీ మద్యం రహిత గ్రామంగా ప్రకటించే ముందు పూర్తిగా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. పునరావృత నేరస్తులను పి డి చట్టం కింద నిర్బంధించాలి.
జాగరీ వ్యాపారులు అక్రమ మద్యం ఉత్పత్తికి ముడిసరుకు సరఫరా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రిటైల్ మద్యం దుకాణాలు, బార్లలో మద్య నాణ్యతను పరిశీలించేందుకు సాంపిల్స్ సేకరించాలి. డిస్టిలరీలలో అన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే అవగాహన దశ విజయవంతంగా అమలైన నేపథ్యంలో, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక దాడులు, అక్రమ ముడిసరుకు సరఫరాదారులపై చర్యలు, ఇడీ మద్యం తయారీ దందాను నిర్మూలించేందుకు ముందుకు వెళ్ళనున్నామని నిశాంత్ కుమార్, రాహుల్‌దేవ్ శర్మ అన్నారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఇతర శాఖలతో కలిసి, రాష్ట్రాన్ని పూర్తిగా నాటుసారా నుండి విముక్తం చేయడానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది.
నవోదయం 2.0 విజయానికి ప్రజల సహకారం అత్యంత కీలకం. ప్రజలు 14405 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎక్కడైనా ఇడీ మద్యం అక్రమ వ్యాపారం గురించి సమాచారం అందించాలన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేస్తే, ఆంధ్రప్రదేశ్ ఇడీ మద్యం రహిత రాష్ట్రంగా మారడం సాధ్యమవుతుంది.