– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయభేరి
– ప్రతి రౌండ్లోనూ సత్తా చాటిన కాంగ్రెస్
– 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు
– ఫలించిన కాంగ్రెస్ లోకల్ నినాదం
– ‘కారు’కు రెండో పంక్చర్
– సీఎం రేవంత్‌రెడ్డిదే ఈ విజయం
– కేటీఆర్‌కు రెండో ఓటమి
– ప్రచారంలో కేటీఆర్ ఫస్ట్
– పోల్ మేనేజ్మెంట్, ఫలితాల్లో రేవంత్ బె స్ట్
– ఖంగుతిన్న ‘కమలం’
– ఫలించని కిషన్‌రె డ్డి, సంజయ్ ‘హిందూకార్డు’
– కాంగ్రెస్‌ను గెలిపించిన ముస్లిములు
– ఓడినా ధీటుగా పోరాడిన బీఆర్ఎస్
( సుబ్బు)
హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ వైపే మొగ్గుచూపింది. ఐదారు వేల మెజారిటీతో గట్టెక్కుతుందనుకున్న కాంగ్రెస్ మెజారిటీ 20 వేలు దాటగా.. ప్రచారంలో దూసుకుపోయిన బీఆర్ఎస్.. ఫలితంలో మాత్రం దారుణంగా చతికిలపడింది. కాంగ్రెస్ పోల్మేనేజ్మెంట్ ముందు కేటీఆర్ వ్యూహం వెలవెలబోయింది.
అయితే.. బీఆర్ఎస్ అభ్యర్ధి రాజకీయంగా కొత్త అయినప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండిపెంటెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో బేర బాలకిషన్ కు అత్యధికంగా 175 ఓట్లు వచ్చాయి.
నోటాకు 924 మంది ఓటు వేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇదే బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్‌రెడ్డికి 25 వేలు ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ ఓట్లు కూడా రాకపోవడం విశేషం. ఇది సీఎంగా రేవంత్‌రెడ్డి రెండో విజయం కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు రెండవ ఓటమి. బీఆర్ఎస్కు ఈ ఉప ఎన్నికలో సెంటిమెంట్ అస్త్రం పనికిరాలేదు. టీడీపీ సానుభూతిపరులు, కమ్మ సామాజివర్గం, సెటిలర్లు బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత వైపు మొగ్గుచూపినా.. మాగంటి గోపీనాధ్ మూడుసార్లు గెలిచిన మెజారిటీ కంటే, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ సాధించిన మెజారిటీనే ఎక్కువ కావడం విశేషం. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయభేరి మోగించిన కాంగ్రెస్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ, అప్రతిహత జైత్రయాత్ర కొనసాగించింది.
ఈ రెండు ఉప ఎన్నికలూ రేవంత్ సీఎంగా, కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జరిగినవే. ఇక ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ పరాజయం మూటకట్టుకున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో సంధించిన హిందూకార్డు, ఎందుకూ అక్కరకు రాకుండా పోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అభ్యర్ధి ఎంపిక నుంచి ప్రచారం వరకూ తన భుజం మీద వేసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తన పార్టీ అభ్యర్ధికి కనీసం గతంలో వచ్చిన ఓట్లు కూడా తీసుకురావడంలో విఫలమయ్యారు. ముస్లిములకు వ్యతిరేకంగా హిందూ ఓటు బ్యాంక్ పోలరైజేషన్‌కు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వాడిన హిందూ అస్త్రం కనీస స్ధాయిలో కూడా ఫలించలేదు. ఇక జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయాన్ని ముస్లిములు శాసించగా, తెరవెనుక మజ్లిస్ కథ నడిపింది.
సూటిగా చెప్పాలంటే ఇది మజ్లిస్ దన్నుతో కాంగ్రెస్ సాధించిన విజయం. మొత్తంగా ఇప్పుడ ది కాంగ్రెస్ ‘నవీన’ జూబ్లీహిల్స్‌గా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తొలిసారి విజయం సాధించింది. కౌంటింగ్ మొదలైన తర్వాత అన్ని రౌండ్లలోనూ బీఆర్ఎస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ హవా సాగింది. ఎక్కడా బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత ఆయనకు పోటీ ఇవ్వలేకపోయారు. ఇక బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్‌రెడ్డి కనీస స్ధాయిలో పోటీ ఇవ్వలేక, కౌంటింగ్ మధ్యలోనే నిష్ర్కమించిన విషాదం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు.. వరంగల్ నుంచి ఎంతమంది బీజే పీ కార్యకర్తలను తరలించి, ప్రచారంలో మోహరించినా ఫలితం దక్కలేదు.
రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డికె అరుణ వంటి ప్రముఖుల ప్రచారం ఎలాంటి ఫలితం ఇవ్వలేకపోయింది. ఇక ఈ ఉప ఎన్నికలో బీజేపీ-టీడీపీ పొత్తు పెద్దగా ఫలించినట్లు కనిపించలేదని ఫలితం రుజువు చేసింది. ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ, జూబ్లీహిల్స్‌లో మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్లు కనిపించింది. పైగా టీడీపీ కార్యకర్తలు-కమ్మ సామాజికవర్గం గంపగుత్తగా బీఆర్ఎస్కు జైకొట్టడం విశేషం. ఈ ఎన్నిక సీఎం రేవంత్‌రెడ్డి సత్తాను మరోసారి చాటింది. సీఎంగా ఉండి ప్రతిరోజూ ప్రచారానికి వచ్చిన రేవంత్.. డివిజన్‌కు ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించి ఫలితం రాబట్టారు.
ఆర్ధిక వనరుల వ్యవహారంలో ,ఎవరికీ అందనంత ఎత్తులో కాంగ్రెస్‌ను ఉంచిన రేవంత్.. మజ్లిస్‌తో చేసిన సమన్వయం సూపర్‌హిట్టయింది. లోకల్ అభ్యర్ధి-బీసీకి టికెట్ ఇవ్వడ ం.. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులిద్దరూ ఓసీలు కావడం కాంగ్రెసుకు కలసివచ్చింది. ఈ ఉప ఎన్నికలో విజేత నవీన్ యాదవ్ అయినప్పటికీ.. అసలు విజేత మాత్రం రేవంత్‌రెడ్డి మాత్రమే అన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఈ ఉప ఎన్నిక విజయంతో రేవంత్ నాయకత్వం వద్ద మరోసారి కీలకనేతగా మారారు. బీహార్ ఎన్నికల్లో బొక్కాబోర్లాపడి.. దారుణ విషాదంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి, జూబ్లీహిల్స్ గెలుపు ఎడారిలో ఒయాసిస్సు లాంటిదే. ఫలించని కేటీఆర్ వ్యూహం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం కోసం కేటీఆర్ ఏర్పాటుచేసిన వార్‌రూమ్ వ్యూహాలు ఏమాత్రం ఫలించలేదు.
మీడియా-సోషల్‌మీడియా ప్రచారంలో కాంగ్రెస్ కంటే ముందున్న బీఆర్ఎస్.. పోల్మేనేజ్మెంట్లో మాత్రం కాంగ్రెస్‌తో ఏమాత్రం పోటీపడలేక చేతులెత్తేసింది. బీఆర్ఎస్ మీడియా మేనేజ్మెంట్ ముందు అధికార కాంగ్రెస్ వెలవెలబోయినప్పటికీ, క్షేత్రస్థాయిలో చేసిన పోల్మేనేజ్మెంటే నవీన్యాదవ్ను గెలిపించేందుకు కారణమయింది. రేవంత్‌రెడ్డి నెరవేర్చని ఎన్నికల హామీలను.. కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఏకరువు పెట్టినప్పటికీ, జూబ్లీహిల్స్ ఓటరు మాత్రం చేయెత్తి జైకొట్టారు. ఇది గత రెండేళ్లలో రెండుసార్లు వచ్చిన ఉప ఎన్నికల్లో కేటీఆర్ సారధ్యం-సామర్ధ్యానికి వచ్చిన తీర్పు.
అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ను గెలిపించినందుకు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ దిగజారిపోయిన పార్టీ అని.. తనను విమర్శిస్తే బలపడతానని బీఆర్ఎస్ భావిస్తోందని విమర్శలు గుప్పించారు. అజారుద్దీన్‌పై ఉన్న కోపాన్ని తనను విమర్శించడం ద్వారా తీర్చుకుంటున్నారని అన్నారు. బీహార్‌లో ఐదు స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించిందని అసదుద్దీన్ తెలిపారు. బీజేపీని ఆపే శక్తి ఆర్జేడీకి లేదని ఆయన అన్నారు. తమకు ఓటు వేసిన బీహార్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఐదు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని, బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామని ఒవైసీ అన్నారు.
బీజేపీని కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ భ్రష్టు పట్టిస్తున్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీని కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని.. వీరి కారణంగా పార్టీ అధికారంలోకి రావడం లేదని, పార్టీ కోసం పనిచేసిన వారిని ఎదగనీయడం లేదని గోషామహల్ బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పార్టీ పరిస్థితి చూసి బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నానని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తే, బీజేపీ నేతలు మాత్రం తమ అభ్యర్థిని ఓడించేందుకు పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను చూసి బీజేపీ నాయకులు చాలా నేర్చుకోవాలని.. రాష్ట్ర బీజేపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో భంగపాటు తప్పదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమికి బాధ్యులెవరో చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి నవీన్ యాదవ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని.. కానీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ఓడించేందుకే, కొందరు బీజేపీ నాయకులు పనిచేశారని ధ్వజమెత్తారు. అందుకే కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఏం సమాధానం చెబుతారని రాజాసింగ్ ప్రశ్నించారు.