-
మాజీ ఎమ్మెల్యేను నియోజకవర్గంలో కాలు పెట్టనివ్వడం లేదట
-
ఇన్నేసి దాడులు ఎప్పుడూ జరగలేదట
-
హత్యలు ఇప్పుడే చూస్తున్నారట
-
అదే తానుంటే జరిగేవి కాదట
-
తనది రామరాజ్యమైతే ఇది రావణ రాజ్యమట
-
రెండు నెలలకే రాష్ట్రపతిపాలన కావాలన్న మతిలేని వాదన
-
జగన్ సుభాషితాలపై సోషల్మీడియాలో సెటైర్లు
-
నాడు రఘురామరాజును నాలుగేళ్లు నియోజకవర్గానికి వెళ్లనీయని దుస్థితి
-
ఆయనపై డజన్ల కొద్దీ అక్రమ కేసులు
-
చివరికి ప్రధాని సభకూ రానీయని అణచివేత
-
హత్యలు, దాడులతో ముగిసిన జగన్ జమానా
-
బాబుకు జైల్లో వేడినీళ్లూ ఇవ్వని రాక్షసానందం
-
లోకేష్ మైకు, కుర్చీ లాగేసుకున్న కండకావరం
-
అగ్రనేతలను చెరపట్టిన పైశాచికానందం
-
జగన్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఎకసెక్కాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అయ్యో.. ఏమిటీ దౌర్జన్యాలు ? గతంలో ఎప్పుడూ లేవే?! బాబోయ్.. ఏమిటీ హత్యాకాండ? మా పాలనలో ఒక్క హత్యకూడా జరగలేదే?!
ఏమిటీ దాడులు? దౌర్జన్యాలు? మా హయాంలో ఎప్పుడ లేదే?! ఒక మాజీ ఎమ్మెల్యేను నియోజకవర్గానికి సైతం రానివ్వనంత దౌర్జన్యం చేస్తారా? అసలు ఆ పాలనలో అలా ఎప్పుడైనా జరిగిందా? ఇంత అప్రజాస్వామ్య పాలన సాగిస్తారా?
అదే మేముంటేనా.. పాలన ఎంత చక్కగా, జనరంజకంగా ఉండేది?.. రాయలవారు, గుప్తులు కూడా ఈర్ష్యపడేలా పాలించేవాళ్లమే కదా?.. ఏం ఫర్వాలేదు.. మరో నాలుగేళ్ల 10 నెలల ఓర్చుకోండి. రాత్రి తర్వాత పగలు వచ్చినట్లు.. వారి తర్వాత మనమే అధికారంలోకి వస్తాం.
– ఇవీ, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా చెప్పిన రాజకీయ సుభాషితాలు.
తన ఐదేళ్ల పాలన ముందు రామరాజ్యం కూడా బలాదూరేనని.. రాయలు-గుప్తులకాలం నాటి స్వర్ణయుగం కూడా తన పాలన ముందు చిన్నబోయిందనేది జగనన్న స్వకుచమర్దనకు సంబంధించిన ప్రసంగ సారాంశం. అదంతా ఓకే. కానీ ఒక మాజీ ఎమ్మెల్యేను నియోజకవర్గానికి సైతం రానీయకుండా అడ్డుకోవడం దారుణమంటూ.. జగనన్న కార్చిన కన్నీరు ముందు, గోదారి తల్లి కూడా ఈర్ష్యపడుతోందట.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకోవడం అప్రజాస్వామ్యం నియంతృత్వానికి నిదర్శనమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపయులే పుసుక్కున నవ్వుకుంటున్నారట. అదే నేను సీఎంగా ఉంటేనా.. అని దీర్ఘాలు తీసే జగనన్న అత్యాశ నవ్వులపాలవుతోంది. ఇంతకూ జగనన్న బాధేమిటంటే.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని, కూటమి సర్కారు ఆయన నియోజకవర్గంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమట. ఆ విధంగా తన జమానాలో ఎప్పుడూ చేయలేదన్న జగనన్న మాటలు విన్న తర్వాత బహుశా జగనన్నకు చిన్నతనంలోనే మతిమరుపు మాయరోగం వచ్చిందన్న అనుమానం వస్తోందట.
నర్సాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును నాలుగేళ్లపాటు.. ఆయన నియోజకవర్గంలో కాలు పెట్టనీయనంత వేధింపులకు పాల్పడిన జగన్ జమానా గురించి, వైకాపీయులు మర్చిపోయినా తెలుగు ప్రజలు మర్చిపోరు. మర్చిపోలేరు. సొంత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల శిలాఫలకాలపై కూడా పేరు లేనంత అవమానం మిగిల్చిన వైనాన్ని ఎవరు మాత్రం మర్చిపోతారు?
చివరకు సొంత నియోజకవర్గానికి ప్రధాని వచ్చినా, ఆ సభకు హాజరుకానీయకుండా, బేగంపేట రైల్వేస్టేషన్ నుంచే వెనక్కి పంపించిన దారుణాలు ఎవరు మర్చిపోతారు? ఆయనపై డజన్ల కొద్దీ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి, నర్సాపురం పొలిమేరలకు రాకుండా కట్టడి చేసిన రాక్షసచర్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇవన్నీ మర్చిపోయి.. తనది రామరాజ్యం అని మాట్లాడితే మరి జనం నవ్విపోరూ?!
ఇక ఏపీలో రావణరాజ్యం నడుస్తోందని, హత్యాకాండలు, దౌర్జన్యాలు, దాడులతో అట్టుడుకుతున్నందున.. రాష్ట్రపతి పాలన పెట్టాలన్న జగనన్న డిమాండు విన్నవారంతా.. అసలు జగన్కు ఏమైంది? ఆయన మానసిక పరిస్థితి-ఆరోగ్యం బాగుందా? లండన్ మందులు కూడా పనిచేయడం లేదా? అని సోషల్మిడియాలో ఎకసెక్కాలాడుతున్నారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఐదేళ్లపాటు పోస్టింగు ఇవ్వకుండా, సుప్రీంకోర్టును కూడా లెక్కచేయకుండా రెండుసార్లు సస్పెండ్ చేసిన జగన్ జమానా పైశాచికానందానికి ఏం పెట్టాలి? కమ్మ-కాపు పోలీసు అధికారులకు పోస్టింగులివ్వకుండా, రాక్షసానందం పొందిన జగన్నది రామరాజ్యమయితే.. అందుకు రాముడు కూడా సిగ్గుతో తలవంచుకుంటాడు.
తన జమానాలో వందలాదిమంది విపక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, మాస్కు అడిగిన పాపానికి దళిత డాక్టర్ చావుకు కారణమయి, డ్రైవరును చంపి అతని ఇంటికే పార్శిల్ పంపించిన ఎమ్మెల్సీ కండకావరం.. టీడీపీ అధినేత చంద్రబాబును 50 రోజులకు పైగా జైల్లో ఉంచి, జైలు పైన డ్రోన్లు ఎగరేసి, చివరకు స్నానానికి వేడినీళ్లు కూడా ఇవ్వని రాక్షసానందం ఇంకా అందరికీ గుర్తే. లోకేష్కు ఆటంకాలు కల్పిస్తే, చివరకు స్టూలు వేసుకుని ప్రసంగాల్సి వచ్చింది.
అనపర్తి ముందు బాబు ప్రసంగాన్ని అడ్డుకోవడంతోపాటు, ముందుకు కదలనీయకుండా బారికేడ్డు అడ్డం పెట్టి, కరెంట్ కట్ చేస్తే.. అంత రాత్రిలోనూ సెల్ఫోన్ వెలుగులో బాబును, 7 కిలోమీటర్లు నడిపించిన వికృతపాలనను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ఆలయానికి వెళుతున్న అమరావతి రైతులను నానాయాతన పెట్టిన పోలీసుల కండకావరాన్ని ఎవరు మర్చిపోతారు? అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, జెసి ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పట్టాభి వంటి నేతలను అక్రమ కేసులతో చెరపట్టిన జగన్ తన జమానాను రామరాజ్యంతో పోల్చుకుంటే..నవరంధ్రాలతో నవ్వుకున్నట్లే!