– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఫస్ట్ ఇంటర్ నుంచి నీట్, ఐఐటీలో శిక్షణ ఇవ్వనున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా శిక్షణ అందజేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
బీసీ బిడ్డలకు ఉన్నత విద్యా అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దీనిలో భాగంగా ఎంజేపీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తూ, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు నీట్, ఐఐటీకి ఉచిత శిక్షణ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బాలురకు, బాలికలకు వేర్వేరుగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖలోని సింహాచలం ఎంజేపీలో బాలురకు, శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడు ఎంజేపీలో బాలికలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన బోధకులతో శిక్షణ అందజేస్తామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఎంజేపీలో నీట్, ఐఐటీలో ఉచిత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి సవిత ఆ ప్రకటనలో తెలిపారు.