Suryaa.co.in

Telangana

సాగునీటి ప్రాజెక్టులపై గ‌త ప్ర‌భుత్వ‌ పదేళ్ల నిర్లక్ష్యం

– మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైద‌రాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి ఖండించారు. వెనుక‌బ‌డిన ప్రాంత‌మైన ఉమ్మ‌డి పాల‌మూర్ జిల్లాలోని ప్రాజెక్ట్ ల‌ను పూర్తి చేయ‌డానికి అవసరమైన నిధులను పదేళ్ల కాలంలో కేటాయించ‌లేద‌ని తెలిపారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెల్ల‌దీశార‌ని దుయ్యబట్టారు. వారు చేసిన పాపాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైకి నెట్టె ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, పాల‌మూరు బీఆర్ఎస్ నాయ‌కులు బురద జల్లుతూ అబద్ధాలు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప్రాజెక్ట్ ప‌నులు 20 శాతం పూర్తి కాకుండానే ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌డావుడిగా ప్రారంభించార‌ని దుయ్య‌బ‌ట్టారు.

మేజ‌ర్ కెనాల్స్, డిస్ట్రిబ్యూట‌రీ కాలువ‌లు త‌వ్వ‌కుండానే … ప్రాజెక్ట్ ను ప్రారంభించార‌ని, ఇప్పుడు నీళ్ళు ఎలా ఇస్తారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. మీరు ప‌దేళ్ల‌లో చేయ‌లేని వాటిని మ‌మ్మ‌ల్ని 7 నెల‌ల్లో చేయ‌మ‌ని అడగ‌టం సిగ్గుచేటన్నారు. నీళ్లు ఎత్తివేయ‌లేదు కానీ, ప్ర‌జా ధ‌నాన్ని మాత్రం ఎత్తుకుపోయార‌ని ద్వ‌జ‌మెత్తారు. ఇక‌నైనా బీఆర్ఎస్ నాయ‌కులు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

LEAVE A RESPONSE