(చాకిరేవు)
అధికారం చేజారినప్పుడు, వైఫల్యాలు వెంటాడినప్పుడు రాజకీయ నాయకులు ఎంచుకునే అతిపెద్ద ఆయుధం ‘పొరుగు బూచి’. ఇటివల బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పతనం తర్వాత అక్కడి తాత్కాలిక పాలకులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి భారత్‌పై నిందలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సరిగ్గా ఇదే ‘బంగ్లాదేశ్ మోడల్’ ఇప్పుడు తెలంగాణ భవన్లో కేసీఆర్ నోట వినిపిస్తోంది. పదేళ్ల అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు ‘వివక్ష’ అనే పాత పాట అందుకోవడం బాధ్యత నుంచి పారిపోవడమే!
అక్కడి భారత్.. ఇక్కడి ఉమ్మడి పాలకులు!
బంగ్లాదేశ్ ప్రస్తుతం సిరియాలా మారుతోంది. నాడు కాంగ్రెస్ పుణ్యమా అని పాకిస్తాన్ నుండి విడివడి బాగుపడ్డ ఆ దేశం, నేడు భారత్‌ను శత్రువుగా చూపిస్తూ మనుగడ సాగించాలని చూస్తోంది. కేసీఆర్ గారి తీరు కూడా అంతే. ఉమ్మడి రాష్ట్ర ఆదాయంతో, హైదరాబాద్ సంపదతో తెలంగాణ లాభపడినా.. ఇంకా ‘సమైక్య పాలకులు’ అంటూ పాత గాయాలను కెలికే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రా విడిపోయి కష్టాల్లో ఉన్నా, ఎక్కడా పొరుగువారిని బూచిగా చూపడం లేదు. కానీ, కేసీఆర్ మాత్రం తన పదేళ్ల అసమర్థతను, ఫోన్ ట్యాపింగ్ బాగోతాలను డైవర్ట్ చేయడానికి మళ్ళీ ‘వివక్ష’ మంత్రాన్ని జపిస్తున్నారు.
శిష్యుడి గతి.. గురువుకు గుణపాఠం కాలేదా?
కేసీఆర్ నేర్పిన ‘విద్వేష విద్య’తోనే ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ‘మూడు రాజధానులు’ అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. ఫలితంగా జనం ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మాడు పగలగొట్టారు. శిష్యుడికి పట్టిన గతే తనకు పడుతుందని తెలిసినా, కేసీఆర్ ఇంకా మారకపోవడం విచారకరం. కృష్ణా నదిపై అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టమని గ్రీన్ ట్రిబ్యునల్‌లో అఫిడవిట్ ఇచ్చి, ఇప్పుడు చంద్రబాబు మాటలు నమ్మి కేంద్రం ద్రోహం చేస్తోందని మొసలి కన్నీళ్లు కార్చడం ఒక ‘పొలిటికల్ కామెడీ’. ఈ రోజు హైదరాబాద్ ఆదాయం చంద్రబాబు కష్టం. అది మరిచి పదే పదే ఆయన మీద పడితే లోతుగా తన గోతిని తనే త్రవ్వుకున్నట్లే.
కూలేశ్వరం.. కమీషన్ల పర్వం!
లక్షల కోట్లు కుమ్మరించిన కాళేశ్వరం నేడు ‘కూలేశ్వరం’గా మారి తెల్ల ఏనుగులా రాష్ట్ర ఖజానాను మింగేస్తోంది. సింగోటం బ్రిడ్జి లాంటి చిన్న పనులకు వందల కోట్ల కమీషన్లు మేసి, పాలమూరు జిల్లాను ముక్కలుగా చేసి, ఇప్పుడు కృష్ణా జలాల కోసం జోగులాంబ నుంచి గద్వాల దాకా పాదయాత్ర చేశానంటే ప్రజలు నమ్ముతారా? బంగ్లాదేశ్‌లో మత విద్వేషాలు రగిల్చే వారిలాగే, ఇక్కడ ప్రాంతీయ విద్వేషాల పాచిక వేయడం కేసీఆర్ వినాశనానికి నాంది.
జనం ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రజలలాగా అమాయకులు కాదు. పొరుగున ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. ‘భారాస’ భ్రాంతి నుంచి తేరుకుని ‘తెరాస’ అని పలికిన కేసీఆర్, తన రాజకీయ పతనాన్ని తానే లిఖించుకుంటున్నారు. తుపాకీ రాముడి కబుర్లకు, విషపూరిత రాజకీయాలకు తెలంగాణ ప్రజలు త్వరలోనే శాశ్వత విరుగుడు ఇవ్వబోతున్నారు.