( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇది ఫైల్స్ జమానా. అర్ధం కాలేదా? అదేనండీ.. ఈమధ్య కాలంలో విడుదలయిన ‘క శ్మీర్ ఫైల్స్’ సినిమా తర్వాత.. అలాంటి పేర్లతో గుజరాత్ ఫైల్స్, తెలంగాణ ఫైల్స్ సినిమాలు రావాలన్న హడావిడి మొదలయింది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎవరైనా ఔత్సాహిక నిర్మాతలుంటే ‘ నెల్లూరు ఫైల్స్’ తీయవచ్చు. దానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. ఒక పాత కోర్టు బిల్డింగ్, మహా అయితే ఇద్దరు ముగ్గురు దొంగల క్యారెక్టర్లు, వీధి కుక్కలు, ఒక పోలీసు ఆఫీసర్, ఏడెనిమిదిమంది రిపోర్టర్ల క్యారెక్టర్లు, ఇద్దరు పొలిటీషియన్ పాత్రలు చాలు. అయితే ఇది.. సినిమావాళ్ల భాషలో చెప్పాలంటే ‘రొటీన్‌కు భిన్నం’గా ఉంటుంది. కావాలంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసిన విఠలాచార్య పాత క్యాసెట్లు ఉంటే, దాని మోడల్లో ‘నెల్లూరు ఫైల్స్’ కూడా ఫాలో అయితే, బ్రహ్మాండం బద్దలయ్యే బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఒట్టు!
కత్తియుద్ధం కాంతారావు, దెయ్యాలు మోహించే నరసింహరాజులతో తీసిన విఠలాచార్య సిన్మాలు గుర్తున్నాయా? బిందెలు, కత్తులు వాటంతట అవే కదులుతుంటాయి. గాల్లో ఒక బాణం, మరో కత్తితో నిప్పులు కక్కుతూ యుద్ధం చేసుకుంటాయి. రాజనాల బొడ్లో కత్తి దోపేసుకుని యువరాణిని అర్ధరాత్రి మంచంతో సహా కిడ్నాపు చేసి తీసుకువెళితే, కత్తియుద్ధం కాంతారావు అమాంతం ఆకాశంపైకెగిరి, ఆ మంచాన్ని పట్టుకుని వేళ్లాడుతుంటాడు. ఇలాంటి చిత్ర విచిత్రాల ఫైల్స్‌ను టెక్నాలజీ అందుబాటులోకి రాని ఆ జమానాలోనే, విఠలాచార్యుడు రసవత్తరంగా నడిపించాడు. ఇప్పుడు అంతా టెక్నాలజీమయమయిన ఈ జమానాలో ఇక వాటి పనితనం ఏమిటో చెప్పాల్సిన పనిలేదు.
అంటే… హిలన్.. అదేనండి రాజనాల లాంటి విలన్ గుట్టు, కోర్టులో దాచిపెట్టిన సొరుగు కింద ఉన్న ఇంకో చిన్న పెట్టెలో ఉంది. దాన్ని భద్రంగా రక్షకభటులతో రాజధానికి చేర్పించి, రాజనాలకు శిక్ష వేయించాలన్న కాంతారావు ప్రయత్నాన్ని రాజనాల పసిగట్టి, కుక్క అవతారమెత్తుతాడు. ఆ తర్వాత వెంటనే దొంగ అవతారమెత్తి, కోర్టులోకెళ్లి తన ప్రాణం ఉన్న పెట్టెను తెచ్చుకుని విజయగర్వంతో బయటకొస్తాడు. తీస్తే.. గీస్తే.. ‘నెల్లూరు ఫైల్స్’ సినిమా ఇలా సాగిపోతుందన్నమాట.
సీన్ కట్ చేస్తే..
నెల్లూరు జిల్లా కోర్టులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తాజా మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిపై అప్పట్లో వేసిన కేసుకు సంబంధించి, ఆధారాల డాక్యుమెంట్లను దొంగలెత్తుకెళ్లారు. కోర్టులోపల ఉన్న బీరువాలో చాలా వస్తవులున్నా.. ఐరన్ దొంగతనం
చేసే దొంగలకు కాకాణి ఫైల్స్ మాత్రమే దొరికాయట. దొంగలను ఆ ఫైల్స్ మాత్రమే ఎందుకు ఆకర్షించాయో మరి? బహుశా.. ఇసుకను కూడా తైలంగా మార్చినట్లు, ఫైల్స్‌ను కూడా ఇనుముగా మార్చవచ్చనుకున్నారేమో పిచ్చి వెధవలు! ఫ్లైఓవర్ల కింద కుక్కలతో సావాసం చేస్తూ జీవించే దొంగలు.. అవే కుక్కలు తరముతున్నా చేతుల్లో తాళాలు పగలకొట్టే రాడ్లను పెట్టుకుని పరుగెత్తి, జాగ్రత్తగా కోర్టులోకి వెళ్లడం, వెళ్లిన వారు మరే వస్తువులూ టచ్ చేయకుండా కాకాణి ఫైల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవడం బహు ముచ్చటగా ఉంది కదా?
మళ్లీ సీన్ కట్ చేస్తే..
కోర్టులోపల చోరీ చేసిన కాకాణికి చెందిన ఆధారాలను కాలవలో పడేయటం, తర్వాత పోలీసులు వాటిని సేకరించడం, ఎస్పీ గారేమో అది ఇనుము దొంగతనం చేసే వారి పనేనని, వారికి ఇంకా 14 కేసుల్లో సంబంధం ఉందని సెలవిస్తారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే.. సదరు దొంగలగారికి అసలు కోర్టు తాళాలు బద్దలు పగలకొట్టాలన్న సద్బుద్ధి లేనేలేదు. కుక్కలు తరిమాయి కాబట్టి.. అనుకోకుండా పారిపోయి దారితప్పి కోర్టులోకి వెళ్లారు తప్ప, లేకపోతే మెయిన్‌రోడ్డు మీదనుంచే వారు. అప్పటిదాకా చోరశిఖామణులను వెంటాడిన కుక్కలు ( సంఖ్య ఎంత చెబితే బాగుండేది) వారు తాళాలు బద్దలు కొట్టేవరకూ
హచ్డాగ్ మాదిరిగా బయటే వెయిట్ చేసి, వాళ్లు లోపలకు వెళ్లడంతో విసుగుపుట్టి వెనక్కివెళ్లాయి. అంతేనా? కరెస్టేనా? ఎస్పీ గారి ప్రెస్‌మీట్ చూసిన క్రిమినల్ లాయర్లు మాత్రం, ఇలాంటి డౌటనుమానాలు రావడం కరెస్టేనంటున్నారు.
ఇంకో సీన్ కట్ చేస్తే..
మంత్రి కాకాణి గారు మాత్రం, రామ రామ.. సారీ జగన.. జగన.. తనకేపాపం తెలియదంటున్నారు. అదెవరో కావాలని కావాలని పథకం ప్రకారం చేసిన కుట్రగా
తేల్చేసి, కావాలంటే తనపై సీబీ విచారణ కోరాలని ఎదురు సవాల్ చేశారు. హన్నా.. ఆరోపణ ఎదుర్కొంటున్న నిష్కళంకితుడు, నిజాయితీకి నిలువుటద్దమయిన మంత్రిగారే అంతమాట అన్నాక ఇక సీబీఐ రంగంలోకి దిగడమే బెటర్. కాకపోతే.. ఎస్పీ గారు చెప్పిన దొంగల కథ కరెక్టా? లేక మంత్రి గారు చెప్పిన ఎవరో చేసిన కుట్ర కథ కరెక్టా? దీనిదుంపతెగ.. ఈ ‘నెల్లూరు
ఫైల్స్’, బాలచందర్ సినిమాలా మారింది.
అయినా… ఏ సోమిరెడ్డినో, ఇంకో నెల్లూరు పెద్దారెడ్డినో సీబీఐ విచారణకు డిమాండ్ చేయమనే బదులు.. మంత్రి గారే నేరుగా తాడేపల్లికి వెళ్లి ( అపాయింట్మెంట్ ఇస్తే) ‘‘ జగన్ బాబూ.. ఈ ఆరోపణలు భరించలేకపోతున్నా. స్వాతిముత్యంలో కమల్‌హసన్ లాంటి నన్ను, ఆ టీడీపోళ్లు రాజనాలను చేస్తుంటే భరించలేకపోతున్నా. తెల్లవన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లని నమ్మేంత అమాయకుడిని నేను. నా నిజాయితీ, నిబద్ధత గురించి మీకే కాదు, మా జిల్లావాళ్లకూ తెలుసు. అందుకే ఈ నీలాపనిందలు తొలగాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం’’ అని.. జగన్మోహన్రెడ్డినే సీబీఐకి లేఖ రాయమని అడిగితే సరిపోతుంది కదా?
సర్కారు లేఖ రాస్తే సీబీఐ రావడం ఎంతసేపూ? చిటికెలో పనికదూ! ఆ పనిచేయకుండా విపక్షాలను సీబీఐ విచారణ కోరమనడం, కాస్త వెటకారంగానే ఉంది. అయినా, సీబీఐ విచారణకు రమ్మంటే జగనన్న వెళ్లకపోవచ్చేమో గానీ.. జగనన్న సీఎం హోదాలో మరొకరిపై సీబీఐ విచారణకు లేఖ రాస్తే, అది రావడానికి పెద్ద ఇబ్బందులుండవు.
ఇంకో సీన్ కట్ చేస్తే..
తెలుగు సినిమాలకు కథలు కరువయ్యాయని, సరైన రచయితలు దొరకడం లేదని ప్రముఖ దర్శకుడు ఏమీరావు కృష్ణానగర్ గడ్డ కింద కొబ్బరిబోండాల దుకాణం వద్ద ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో అరవై టన్నుల ఆవేదన కురిపించారు. ఇటీవలి కాలంలో కొత్త కథలు గానీ, కొత్త రచయితలు గానీ రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త వారికి తాను అవకాశం కల్పిస్తానని, రాజకీయ నాయకులు, పోలీసులకు తొలి ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. ఉత్కంఠభరితంగా ఉండే కథలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుందని ఏమీరావు వివరించారు.