Suryaa.co.in

Editorial

నెల్లూరు పెద్దారెడ్డి గారి ‘మైకా’యస్వాహ!

  • నెల్లూరు జిల్లాలో ఆ పెద్దాయనదే ‘మైకా’యణం

  • ఎగుమతులన్నీ ఆయన కంపెనీకే ఇవ్వాలట

  • జగన్ జమానాలో టన్నుకు కప్పం వసూలు

  • ఇప్పుడు అసలు ఎగుమతులపైనే నిషేధం

  • తవ్వినా పెద్దారెడ్డి బినామీకే ఇవ్వాలట

  • రెండేళ్ల తర్వాత ఫ్యాక్టరీ ప్రారంభిస్తారట

  • అప్పటివరకూ మైకా ఎగుమతులపై అనధికార నిషేధం

  • తవ్వినా పెద్దారెడ్డి బినామీకే అమ్ముకోవాలన్న ఆదేశం

  • ఆయన బినామీ నెల్లూరు బెట్టింగ్‌రాజాగారట

  • ఐదువేల కోట్ల ఆదాయంపై కన్ను

  • చేతులె త్తేసిన మైనింగ్ మంత్రి

  • మైనింగ్‌మంత్రి గారి పేషీ అధికారితో హైదరాబాద్‌లో ఓ వైసీపీ రెడ్డిగారి చెట్టపట్టాల్

  • కన్నెర్ర చేస్తున్న కమ్మ వ్యాపారవర్గం

  • 60 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న వారినోట్లో మన్ను

  • ఉడికిపోతున్న టీడీపీ నెల్లూరు సీనియర్లు

  • ప్రత్యర్థులను ఏకం చేసిన ‘మైకా’యణం

  • మీడియా కథనాలతో పార్టీకి మాయని మచ్చ

  • పార్టీ పరువు పోతోందన్న ఆందోళన

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయనకు ఆ జిల్లాలో పెద్దమనిషి అన్న పేరు. డబ్బులు ధారాళంగా ఖర్చు పెడతారని, చేతికి ఎముక ఉండదని కీర్తి. ఖర్చు పెట్టడమే తప్ప.. అందరిలా డబ్బులకు కక్కుర్తి పడరని, రాజకీయాల ద్వారా వచ్చే ఆదాయం ఆయన తాకరన్నది ఉధృతంగా సాగే మరో ‘ప్రచారం’. ఆయనకు వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నందున, రాజకీయ వ్యాపారం ఆయనకేం కర్మ అన్నది చాలామందికి, ఆ పెద్దాయనపై ఉన్న ఒక ప్రగాఢ నమ్మకం. జగన్ జమానాలో జరిగిన ఎన్నికల్లో.. ఆ జిల్లాలో అసెంబ్లీ అభ్యర్ధులందరికీ ఆయనదే పెట్టుబడి. జగన్‌తో కలసి భోజనం చేసే అతికొద్దిమందిలో ఆయనొకరు. ఎన్నికల ముందు ఆ పెద్దాయన పార్టీ మారారు. కారణం జగన్ చేసిన బాసలు మర్చిపోవడమే బాగానే ఉంది. సరే రాజకీయాల్లో పార్టీలు మారడం ఇప్పుడు సర్వసహజం అనుకోండి.

ఇప్పుడు ఆ పెద్దాయన ఆ జిల్లాలోని మైకా గనులపై మనసుపడ్డారు. ఆ లాభసాటి వ్యాపారంపై హోల్‌సేల్ అనధికార హక్కులు పొందారు. మరి ఆయనేమో పెద్దమనిషి. నేరుగా ఈ వ్యాపారంలో కనిపిస్తే బాగుండదు. పైగా అసలు డబ్బులు పట్టించుకోరన్న పేరు పోతుంది.

అందువల్ల కార్పొరేషన్‌లో ఎన్నికల ముందు వరకూ.. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన ఓ ‘బెట్టింగ్‌రాజాగారికి, ఈ మైకా వ్యవహారాలు చూసుకోమని అప్పగించారు. అన్నట్లు సదరు ‘బెట్టింగ్ రాజా’గారిని టీడీపీలోకి తీసుకువచ్చింది కూడా ఆ పెద్దాయనే. ఆ ప్రకారంగా తన శిష్యుడైన బెట్టింగ్ రాజాకు నాలుగు క్వారీలకు, పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడేంత వేగంతో అనుమతులు ఇప్పించేశారట.

దానితో మైకా గనుల తవ్వకాల ఎగుమతులపై, నెల్లూరు బెట్టింగ్ రాజాగారు అనధికార నిషేధం విధించారట. ఆ జిల్లాలో అంటే.. ఆ మూడు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మైకా గనులు ఎవరు తవ్వినా, పెద్దాయన కంపెనీకే అమ్మాలట. లేకపోతే అసలు ఎగుమతులపై వేటు వేస్తున్నారట.

దీనితో మొన్నటి వరకూ ఎడమొఖం-పెడమొఖంగా ఉన్న ఆ జిల్లా సీనియర్లంతా, ఆ పెద్దాయనకు వ్యతిరేకంగా చేతులు కలిపారట. నెల్లూరు బెట్టింగ్ రాజా సదరు నెల్లూరు పెద్దారెడ్డికి బినామీ అన్న విషయం ఇప్పుడు జిల్లాలోని పార్టీ వర్గాలకు తెలిసిపోయిందట. గమ్మతేమిటంటే.. జగన్ జమానాలో దీని అక్రమ ఎగుమతులపై దీక్షలు చేసిన టీడీపీనే.. ఇప్పుడు ‘నెల్లూరు పెద్దాయన’ రూపంలో ‘మైకా’యస్వాహా చేయడం విచిత్రం. ఇదీ నెల్లూరులో ఓ పెద్దారెడ్డిగారి లేటెస్టు ‘మైకా’యణం!

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో మైకా క్వార్జ్డ్ గనులు విస్తరించి ఉన్నాయి. అంటే సైదాపురం రావూరు, గూడూరు ప్రాంతాల్లో తెల్లరాయి నిక్షేపాలు అధికం. అప్పట్లో దీనికి పెద్ద డిమాండు ఉండేది కాదు. అయితే ఇటీవలి కాలంలో వీటికి డిమాండ్ వచ్చింది. చైనాలో అయితే దీనికి యమా డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని టన్ను ధర, లక్ష నుంచి లక్షన్నర వరకూ పలుకుతోంది.

వెంకటగిరి నియోజవర్గంలో దొరికే మైకా నాణ్యతకు, బయట మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే గత వైసీపీ సర్కారులో నాటి యువ మంత్రికి, మైకా వ్యవహారాలు ధారాదత్తం చేశారు. తవ్వకాలు-అమ్మకాలన్నీ ఆయన శాసించినట్లే నడిచింది. రెండేళ్ల రాయబారం తర్వాత, టన్నుకు ఇంత ఇచ్చి తవ్వుకుని ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ వ్యాపారంలో అన్ని పార్టీలవారూ ఉన్నారట. ప్రధానంగా సైదాపురం మండలంలో దొరికే ఈ మైకా వ్యాపారంలో, కమ్మ సామాజికవర్గ వ్యాపారులే ఎక్కువ. వీరంతా దాదాపు 60-70 ఏళ్ల నుంచి ఈ ఎగుమతుల వ్యాపారంలో ఉన్నారు. అంట తరాల నుంచి ఇదే వ్యాపారంపై ఆధారపడ్డారన్నమాట. ఓ రాజాగారికి సైతం ఇక్కడ గనులున్నా.. ఆయన తన చెన్నై ఖర్చుల కోసం మాత్రమే అప్పుడప్పుడు తవ్వకాలు చేసి, అమ్ముకుంటారట. అలాంటిది ఆయన వద్ద కూడా క ప్పం కట్టించుకన్న వైనం ఆశ్చర్యపరిచింది.

జగన్ జమానాలో అడ్డగోలుగా జరిగిన మైకా అక్రమ తవ్వకాలు-రవాణాపై మాజీ మంత్రి, ఇప్పటి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దీక్షలు చేశారు. వాటికి అడ్డుపడి పోలీసులకు పట్టించారు. హిజ్రాలను దింపి, ఆయన దీక్షను అడ్డుకున్నారు. చివరకు మ్యాప్‌ల సాయంతో వాటి అక్రమ తవ్వకాలు-రవాణాపై ప్రధానికి ఫిర్యాదు చేశారు. దానితో స్పందించిన పీఎంఓ, వాటి వివరాలు, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని జగన్ సర్కారును ఆదేశించింది. దానితో ఆ దందాకు తెరపడింది. గమ్మతేమిటంటే.. సొమిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులపై, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడం! ఇదీ నెల్లూరుజిల్లాలో మైకా గనులకు సంబంధించిన కథ.

అయితే కూటమి వచ్చిన తర్వాత ై‘మెకా’సురుల పీచమణిచేస్తారని అంతా భావించారు. టన్నుకు ఇంత అంటూ విధించిన కప్పంను ఎత్తేస్తారని వ్యాపారులు ఆశపడ్డారు. వచ్చిన నష్టాలు పూడ్చుకోవచ్చని ఆశించారు. అందుకు భిన్నంగా.. అందరి అంచనాలకు భిన్నంగా… అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న మాదిరిగా, ఈ వ్యాపారంపై ఓ ‘నెల్లూరు పెద్దారెడ్డి’గారు కన్నేశారు.

తనకు ఆల్రెడీ పెద్దమనిషి, డబ్బులకు కక్కుర్తిపడరు. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయనే పేరున్నందున.. దానిని అలాగే కాపాడుకుంటూనే, నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ అధికారంలో ఉండగా సెటిల్‌మెంట్లు, బెట్టింగ్‌లలో కింగ్ అయిన ఓ బెట్టింగ్‌రాజాను రంగంలోకి దింపారు. అంటే డబ్బు-పెట్టుబడి అంతా తనదే అయినప్పటికీ.. పేరు, ముసుగుమాత్రం నెల్లూరు బెట్టింగ్‌రాజాదన్నమాట. ఇదోరకమైన తెలివైన వ్యాపారం. ఆ ప్రకారంగా నెల్లూరు పెద్దారెడ్డికి.. ఉన్న పేరూ పోదు. వ్యాపారంతో ఆదాయానికి ఆదాయం అన్నమాట. తెలివంటే రెడ్డిగారిదే!

రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించేందుకు సిద్ధమవుతున్న నెల్లూరు పెద్దారెడ్డిగారు, అందుకు ముందస్తు సంపాదనకు బ్రహ్మాండమైన వ్యూహరచన చేశారు. ఇప్పటివరకూ ఆమూడు నియోజకవర్గాల్లో విస్తరించిన మైకాను తవ్వుకుని, టన్నుకు ఇంత అని వైసీపీ నేతలకు కప్పం కట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే నెల్లూరు పెద్దారెడ్డి గారు తన భవిష్యత్తు వ్యాపార సంపాదనకు తిరుగులేని స్కెచ్ వేశారట. ఆ ప్రకారంగా ఇకపై మైకాను ఎవరూ వారంతట వారు ఎగుమతి చేసుకునేందుకు వీలు లేకుండా.. దానిని తనకే.. అంటే తాను నియమించిన ‘నెల్లూరు కార్పొరేషన్ బెట్టింగురాజా’కే అమ్మేలా అనధికార శాసనం రూపొందించారు.

అనుకున్నట్లుగానే బెట్టింగ్ రాజాకు నాలుగు క్వారీలకు, ఆగమఘాలపై అనుమతి వచ్చేసింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ మిగిలిన వారికి మాత్రం ఆరునెల నుంచీ అనుమతులు ఇప్పటికీ రాలేదు. దానితో అనుమతులు రాని వ్యాపారులను బెట్టింగ్ రాజా పిలిచి, ‘మీ ఎగుమతులన్నీ నేను చెప్పిన ధరకే ఇచ్చేయండి. లేకపోతే వ్యాపారాలు మానేయండి. ఇవన్నీ కాకపోతే మీ క్వారీలు నాకు ఇచ్చేయండి. నన్ను కాదని ఎవరూ ఏమీ చేయలేరు’ అని నిర్మొహమాటంగా బెదిరించారట. ఇవన్నీ రహస్యమేమీ కాదు. మీడియా-సోషల్‌మీడియాలో వచ్చినవే. అయినా ఇప్పటిదాకా చర్యలు లేవు.

దానితో 60 ఏళ్ల నుంచి అదే వ్యాపారంలో ఉన్న కమ్మ వ్యాపారులు, జిల్లాలోని టీడీపీ ప్రముఖుల వద్ద తమ గోడు వినిపించుకున్నారట. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో ఆ వ్యాపారులే, ఆ మూడు నియోజకవర్గాల్లోని అభ్యర్ధులకు విరాళాలు ఇస్తుంటారు. నాయకులు కూడా వ్యాపారులకు ఏ సమస్యలు వచ్చినా పరిష్కరిస్తుంటారు. దానితో వారికి నేతలతో సహజంగానే ఆత్మీయబంధం ఏర్పడింది. అది విని తొలుత ఆశ్చర్యపోయిన టీడీపీ జిల్లా నేతలు, ‘మా నెల్లూరు పెద్దారెడ్డి అలాంటివాడు కాదు. చాలా మర్యాదస్తుడ’ని చెప్పి పంపించేశారట. తర్వాత విచారిస్తే.. ఆ వ్యాపారులు చెప్పింది నిజమేనని తెలిసి నోరెళ్లబెట్టారట. దానితో అప్పటివరకూ ఒకరంటే మరొకరికి పడని జిల్లా అగ్రనేతలంతా.. ఈ వ్యవహారంలో ఏకమయ్యారట.

ఒకరకంగా దానిని వారు ప్రతిష్ఠగా తీసుకున్నారు. 60 ఏళ్లుగా చేసుకుంటున్న వ్యాపారాలను తమకే ధారాదత్తం చే యాలని.. లేకపోతే అసలు వ్యాపారాలే చేయవద్దన్న హుకుం వారిని అవమానపరిచింది. వారంతా ఏకం కావడానికి అదో కారణమట! తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా సాగిస్తున్న ఈ దందాను అడ్డుకోవాలని, జిల్లా పార్టీ పెద్దలు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

దానికంటే ముందు.. సైదాపురం మండలంలో 60 ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న కమ్మ వర్గానికి చెందిన వ్యాపారులు ఈ పరిణామాలకు ఖంగుతిన్నారు. నిజానికి దీనిపై కొంతకాలం క్రితం వరకూ పెద్దగా లాభాలు లేకపోయినా, తరాల నుంచి చేస్తున్న వ్యాపారం కావడంతో నష్టాలొచ్చినప్పటికీ డెడ్ రెంట్ కడుతున్నారు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి గిరాకీ వచ్చింది. సెమీ కండక్టర్‌లలో మైకాను వాడతారు. దానితో మైకాను చైనాకు అమ్ముకుని, తమ కష్టాల నుంచి బయటపడవచ్చని వ్యాపారులు ఆశపడ్డారు. కానీ వారు ఒకటి తలచుకుంటే, ‘నెల్లూరు పెద్దారెడ్డి’గారు ‘బెట్టింగ్ రాజా’ రూపంలో మరొకటి తలచారు. దానితో వారి ఆశలు ఆవిరయ్యాయి.

దీనిపై తే ల్చుకునేందుకు మైనింగ్ శాఖ మంత్రి వద్దకు వెళితే.. తానేమీ చేయలేనని చేతులెత్తేశారట. అయితే ఇందులో తమకు ఎలాంటి అధికారాలు లేవని, మీరు నెల్లూరు బెట్టింగ్ రాజాతో మాట్లాడుకోమని, మంత్రిగారి పేషీలో ఓ కీలక అధికారి తత్వం బోధపరిచారట.

దానితో ఇక్కడ తమకు కులం కూడా పనిచేయలేదని, డబ్బే శాసిస్తోందని తెలుసుకుని, తెల్లముఖం వేసుకుని బయటకొచ్చారట. ఇదంతా నెల్లూరు పెద్దారెడ్డికి అప్పగించారని, ఆయన తన ప్రతినిధిగా నెల్లూరు బెట్టింగ్ రాజాను నియమించడంతో, ఏం చేసినా ఆయనను శరణువేడాల్సిందేనని తెలుసుకున్నారట.

కాగా ఈ మొత్తం వ్యవహారంలో 5 వేల కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 180 వరకూ మైకా గనులున్న ఈ ప్రాంతంపై అధికారంలో ఏ పార్టీ ఉంటే వారిదే పట్టు. ఏడాదికి 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఒక అంచనా.

ఇదిలాఉండగా మైనింగ్ శాఖ మంత్రి పేషీలో పనిచేసే ఓ కీలక అధికారితో, ఈ వ్యాపారం చేస్తున్న ఓ రెడ్డిగారు, హైదరాబాద్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వ్యాపారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ్యవహారంలో అధికారిని నెల్లూరు బెట్టింగ్ రాజా ఎక్కువ సంతృప్తిపరిచారన్న ప్రచారం లేకపోలేదు.

కేవలం ఎన్నికలకు నెలరోజుల ముందు పార్టీలో చేరిన నెల్లూరు బెట్టింగ్ రాజాకు, ఏకంగా నాలుగు క్వారీలు అధికారికంగా దక్కించుకున్నారంటే, ఆయన వెనక ఎవరూ లేకుండా ఇది జరగన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుందని టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఇలాంటి దందాల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నది కార్యకర్తల ఆవేదన. ఎంతోకష్టపడి జగన్‌తో పోరాడి సాధించుకున్న అధికారం నిలబెట్టుకునే బదులు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి, వ్యాపారం చేసుకునే వారికి పార్టీని అప్పగిస్తే ప్రజల్లో పోయేది, పార్టీ పరువు-చంద్రబాబు ప్రతిష్ఠ మాత్రమేనంటున్నారు.

LEAVE A RESPONSE