-ఫలించిన అంబటి, రోజా, జోగి, గుడివాడ కష్టం
– అనూహ్యంగా తెరపైకొచ్చిన కొట్టు, ఉషశ్రీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న వారి జాబితాలో ‘వ్రతం చెడ్డా ఫలితం దక్కించు’కున్న వారి వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మూడేళ్ల నుంచి రాజకీయ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతూ, ఆ క్రమంలో సొంత సామాజికవర్గంలో వ్యతిరేకత ఎదుర్కొన్న వారికి ఈసారైనా పదవులు దక్కుతాయా? లేదా అన్న ఉత్కంఠకు మంత్రి పదవుల ప్రకటనతో తెరపడింది.
గత మూడేళ్ల నుంచి టీడీపీ-జనసేన-బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించి, సొంత కాపు వర్గ ఆగ్రహానికి గురయిన సతె్తనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మంత్రి పదవి దక్కడంపై కాపుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానంగా జనసేన అధిపతి పవన్‌పై ఆయన చేసే ఎదురుదాడిపై కాపు వర్గంలోనే అసంతృప్తి వ్యక్తమయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా అన్నట్లు.. ఆయనకు ఈసారయినా మంత్రి పదవి వస్తుందా లేదా అన్న ఉత్కంఠ కాపు వర్గంలో ఆదివారం ఉదయం వరకూ కొనసాగింది.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి వెళ్లి సంచలనం సృష్టించిన, గౌడ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే జోగి రమేష్ కష్టానికి మంత్రివర్గంలో తగిన ఫలితం దక్కింది. కృష్ణా జిల్లా నుంచి ఆయనొక్కరే గత కొంతకాలం నుంచీ టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఆది నుంచీ జగన్‌ను నిండుసభలోనే పొగడ్తల్లో ముంచెత్తి, బయట కూడా టీడీపీపై ఎదురుదాడి చేస్తున్న నగరి ఎమ్మెల్యే రోజా కష్టానికి తగిన ఫలితం దక్కింది. నిజానికి ఆమెకు ఈసారయినా మంత్రి పదవి వస్తుందా లేదా అని వైసీపీ శ్రేణులతోపాటు, ఆమె అభిమానుల ఉత్కంఠకు జగన్ తెరదించారు. పార్టీకి సంబంధం లేని వారు సైతం ఆమెకు మంత్రి పదవి రావాలని కోరుకున్నారంటే, రోజాపై సానుభూతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అదేవిధంగా ఆంధ్రా-తెలంగాణలోని అన్ని ఆలయాల చుట్టూ తిరిగిన ఆమెను దేవుళ్లు కూడా కరుణించినట్లున్నారు.
అదేవిధంగా విశాఖలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ కూడా, గత మూడేళ్ల నుంచి టీడీపీపై చేస్తున్న ఎదురుదాడికి తగిన ప్రతిఫలం దక్కింది. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డిదీ అదే దారి. జిల్లా నుంచి అనిల్, దివంగత మేకపాటి మంత్రులుగా ఉన్నప్పటికీ.. కాకాణి ఒక్కరే టీడీపీపై ఎదురుదాడి చేసేవారు. ఆయన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కినట్లయింది.
కాగా అందరూ అనుకున్నట్లుగానే ధర్మాన ప్రసాదరావు, దాటిశెట్టి రాజా, మేరుగ నాగార్జున, విడదల రజనికి మంత్రి పదవులు లభిచాయి. అయితే.. కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ముత్యాలనాయుడు, ఉషాశ్రీ చరణ్ పేర్లు అనూహ్యంగా క్యాబినెట్ జాబితాలో చోటుచేసుకోవడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచాయి.