Suryaa.co.in

Telangana

నేడో రేపో ఇంటర్‌ పరీక్షల కొత్త షెడ్యూల్‌:మంత్రి సబితా వెల్లడి!

మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. జిల్లాల వారిగా వివిధ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు నిర్వహించనున్న ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్‌ ను నేడు (మార్చి 14) ఖైరతాబాద్ లోని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంపై ట్రైనింగ్ ప్రోగ్రాంను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోధనకు కృషి చేస్తున్నాం. స్కూళ్ళ అభివృద్ధి కోసం బారీగా నిధులు కూడా కేటాయించాం. కరోనా తర్వాత కొత్తగా రాష్ట్రలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యను మరింత బలోపేతం చేసేందుకుగానూ వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించడానికి రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లోని 80 వేల మంది ఉపాధ్యాయులకు 2 వేల మంది ట్రైనర్లు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని మంత్రి కోరారు. ఆంగ్ల బోధనలో అనుభ వమున్న ఉపాధ్యాయులు సైతం శిక్షణకు హాజరు కావాలని సూచించారు. ఇది విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం. అంతేకాకుండా ఈ ఏడాది కొత్తగా 19 వేల ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టబోతున్నామని, బయట ఉపాధ్యాయుల ఖాళీల పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మకండన్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ త్వరలో భర్తీ చేస్తామన్నారు. జేఈఈ మెయిన్  పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా మారుస్తామన్నారు. జేఈఈ పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా కొత్త తేదీలతో రివైజ్డ్‌ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను నేడో, రేపో ప్రకటిస్తామని మంత్రి సబితా తెలిపారు.

ఏపీలోనూ పదో తరగతి తేదీలో మార్పులు..
మరోవైపుఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. నిజానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే రెండో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీనిని తొమ్మిదో తేదీకి మార్చనున్నట్లు సమాచారం. జేఈఈ పరీక్షలను ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరిగేలా ఎన్టీఏ తేదీలను ప్రకటించడంతో ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేశారు. దీంతో ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు జరగనున్నాయి. ఇక తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టెన్త్‌ పరీక్షలు మే రెండో తేదీ నుంచి 13 వరకు జరగాల్సి ఉంది. దీంతో ఒకేసారి ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. అక్కడ టెన్త్‌ పరీక్ష కేంద్రాలను వేరేచోటుకు మార్చడానికి వీలుపడటం లేదు. ఇంటర్, టెన్త్‌ పరీక్షలు ఒకేసారి జరిగితే రెండిటి ప్రశ్నపత్రాలు, సమాధానాల బుక్‌లెట్లు, ఇతర పరీక్ష సామగ్రి భద్రపరిచేందుకు పోలీసు స్టేషన్లలో వసతి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రతకు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకానికి కూడా సమస్య వస్తుంది. ఈ నేపథ్యంలో టెన్త్‌ పరీక్షలను వారం రోజులు వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మే 9 నుంచి లేదా 13 నుంచి పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ తెల్పింది. కొత్తగా మార్పులు చేసిన షెడ్యూల్‌ను ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత విడుదల చేయనుంది. అది కూడా నేడో రేపో తెలియజేస్తుంది.

LEAVE A RESPONSE