– గార్మెంట్ ఫ్యాక్టరీల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధికల్పించడమే లక్ష్యంగా నూతన పాలసీ
అమరావతి :- రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడుల సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే 10కిపైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా టెక్స్ టైల్ పాలసీని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా నూతన టెక్స్ టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
రూ.10 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్ టైల్ పాలసీ రూపకల్పన చేశారు. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో భాగంగా కేపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై ప్రతిపాదించారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించవచ్చని సిఎం అన్నారు. కొత్త పాలసీ ద్వారా వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని సిఎం అన్నారు.
పాలసీపై డ్రాఫ్ట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన సిఎం దీనికి ఆమోదం తలిపారు. రానున్న రోజుల్లో దీన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నారు. టెక్స్ టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీపైనా సీఎం సమీక్ష చేశారు. మరింత కసరత్తు తరువాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.