September 22, 2026

టిడిపిలో కొత్తా దేవుడండీ!

  • పేరుకి అధికారపార్టీ.. వేరే పార్టీ నాయకుడికి పదవుల టీపార్టీ?
  • అయ్యో..ఏమి గతి!

( ఎలిశెట్టి సురేష్‌కుమార్)

మొన్నటికి మొన్న.. అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని సాధించి..రాష్ట్రంలో..ఎక్కడికక్కడ జిల్లాల్లో అప్రతిహతంగా ఏలుబడి సాగిస్తున్నా గాని..విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిజంగా
అంత గొడ్డుబారి పోయి ఉందా?

అంటే సరైన నాయకులు లేక..రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బరిలోకి దింపేందుకు అర్హులైన అభ్యర్ధులు కానరాక, వేరే పార్టీ నుంచి..అందునా సై అంటే సై అనుకునే జగన్ పార్టీ నుంచి మనుషుల్ని బోలెడు హామీలు ఇచ్చి మరీ తెచ్చుకునే దీన..హీన స్థితిలో ఉందా విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ?

ఏడుగురు ఎమ్మెల్యేలు.. వారిలో ఒకరు మంత్రి.. ఇంకొకరు సాక్షాత్తు అశోక్ గజపతి రాజు కూతురు.. ఇంకో సీనియర్ మోస్ట్ కళా వెంకటరావు.. వీరుగాక ఒక ఎంపి.. ఇందరు ఉండి వేరే పార్టీ నుంచి నాయకుల్ని ఎ(అ)రువు తెచ్చుకోవడం అంటే.. బరువు తెచ్చుకోవడం మాత్రమే కాదు..పరువుతీసుకోడం కూడా.. ఈ విషయం తెలుగుదేశం నాయకుల్లో చంద్రబాబు నాయుడుతో సహా జిల్లా స్థాయి నాయకులకు అర్ధం అవుతుందో లేదో గాని..జనం మాత్రం నవ్వుకుంటున్నారు.

రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమే అనుకున్నా..మరీ నిన్నమొన్నటి వరకు కూటమి ప్రభుత్వాన్ని.. స్వయంగా చంద్రబాబుని.. లోకేష్ ని..అసలు ఎవరూ కూడా పల్లెత్తు మాట అనడానికి సైతం సాహసించని అశోక్ గజపతిరాజుని నానా దుర్భాషలు ఆడిన వ్యక్తిని పార్టీలోకి..అది కూడాగప్చిప్ గా..రాత్రి సమయంలో..సాధారణంగా సొంత పార్టీ వారికే అపాయింట్మెంట్ దొరకడం కష్టమయ్యే ముఖ్యమంత్రి సన్నిధిలో ఆయనే స్వయంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారంటే..

వచ్చిన వ్యక్తి లెవెల్ని తాముగా పెంచడం మాత్రమే గాక.. తమ పార్టీ సరైన నాయకుడు లేక ఎంత
దీన స్థితిలో ఉందో చెప్పకనే చెప్పినట్టు అయింది.
ఇంతకీ ఆ వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటున్నట్టు పెద్దాయన జిల్లాలో ఎమ్మెల్యేలకు గానీ.. ఎంపీలకు గాని మాటమాత్రంగా అయినా చెప్పలేదట..హవ్వ..!. ముందస్తు సమాచారం లేకపోయినా గాని అధినేత పిలుపు అందుకుని ఎమ్మెల్యేలు..ఎంపీలో ఒక్కరు కూడా మిస్ కాకుండా బయటి పార్టీ నుంచి వచ్చిన ప్రత్యర్థి చేరికను మనసారా.. ఘనంగా స్వా”గతించిన” వైనం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు అద్దం పడుతోందని అనుకోవాలా? లేక “ఒక్క మగాడి” కోసం ఎదురు చూస్తున్న బ్యాచి దైన్య స్థితికి నిదర్శనమని భావించాలా?

ఇక్కడితో అయిపోలేదు.. పార్టీలో చేరిన ఆ వ్యక్తి జిల్లాకి తిరుగువచ్చి మొదట అశోక్ బంగళా..ఆపై రోజుకి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలను కలవడానికి వెళ్తుంటే.. రాజపుత్రికతో సహా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు హై హై నాయకా అన్న తీరున స్వాగతం పలికి.. ముందుగానే ప్రెస్ మీట్లు.. కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి..జేజేలు పలికిన తీరు అహో.. సైకిల్ పార్టీ నాయకుల క్షమాగుణాన్ని.. వచ్చిన వ్యక్తి ధీమా గుణాన్ని చూసి ఉభయ పార్టీల కార్యకర్తలు వీళ్ల కోసమా మనం కొట్టుకు చస్తున్నామనుకుని ముక్కున వేలేసుకున్న వైనం!అక్కడితో అయిపోలేదు.

ఈ ప్రహసనం..కొత్తగా పార్టీలో చేరిన ప్రత్యర్థి పార్టీ నాయకుడి ఇంటికి తెలుగుదేశం నాయకులు..
కార్యకర్తలు మాత్రమే గాక..కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టి వెళ్ళి
దండలు వేసి..శాలువాలు కప్పి ఫోటోలు దిగి వాట్సాప్పుల్లో పోస్ట్ చేసి మురిసిపోతున్న తీరు..
ఉన్న నాయకులతో విసిగి వేసారిపోయి ఉన్న వైనమా? కొత్తా దేవుడొచ్చిన సంబరమా? ఇంతా చేస్తే
ఆ వ్యక్తి వెంట తెలుగుదేశం పార్టీలోకి తరలి వచ్చిన భారీ సమూహం ఏదైనా ఉందా అంటే..ఆయన..ఆయన కుమార్తె..ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది..ఇంకో ఇద్దరు చోటా నాయకులు..చూడగా చూడగా..చిన్న శ్రీను అనే వ్యక్తి పార్టీ మారడం వైసీపీకి కలిగించిన నొప్పి కంటే కూటమి.. ముఖ్యంగా సైకిల్ పార్టీ నేతలకు..చోటా మోటా నాయకులకు కలిగిస్తున్న సంబరమే ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఉంది పరిస్థితి.. అక్కడి నొప్పి ఇక్కడ బొప్పిగా మారిందేమిటా అన్న ఫీలింగ్
ఎవరిలోనూ కనిపించకపోవడం సైకిల్ పార్టీ దీన స్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించింది.

ఇది చాలదన్నట్టు..టీడీపీకి ఇంచుమించు ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా “సరైనోడు” కాపు సామాజిక వర్గం నుంచి దొరికినట్టు అదో రకమైన కలరింగ్..
అంతేనా..ఇక బంగళా ఆధిపత్యానికి..అశోక్ గజపతి డైనస్టీకి చిన్న శ్రీను రాక చరమగీతమే సుమా
అనుకునే రీతిలో ఒక ప్రణాళిక మేరకు జరుగుతున్న ప్రోపగాండా విడ్డూరంగా అనిపిస్తోంది. చిన్న శ్రీనుకి జిల్లా పార్టీ నాయకత్వ బాధ్యతలతో పాటు కోరిన అధికారపదవి.. ఆయన కుమార్తెకు నచ్చిన పీఠం ఇస్తారనే టాక్ ఒకటి.. ఇది తెలుగుదేశం డొల్ల తనాన్ని మరింతగా బహిర్గతం చేస్తోంది..

అంతేగాక రానున్న రోజుల్లో కొందరు జెడ్పీటీసీలను.. ఎంపిపిలను.. ఇతర నాయకులను చిన్న శ్రీను వైసిపి నుంచి తోలుకొస్తారని..అది కూడా వారికి టికెట్ ఇస్తేనే సుమా అనే కండిషన్ పైనే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి..ఎన్నో ఆటుపోట్లను..
జయాపజయాలను చూసి.. మొన్నటి ఎన్నికలలో ఘనాతి ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీ నిన్న గాక మొన్న ప్రత్యర్ధి పక్షం నుంచి ఇంచుమించు ఒంటరిగా వచ్చిన ఒక నాయకుడి షరతులకు నిజంగా తలొగ్గితే..
ఔరా..అంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా..అందునా నాలుగున్నర దశాబ్దాలకు పైగా అశోక్ గజపతిరాజు అనే వ్యక్తి ఒంటిచేత్తో వ్యవహారాలు నడిపిన ఆయన సొంత ఇలాకాలో.. ఇప్పటికీ ఫ్రంట్ సీట్లో ఆయన కుమార్తె ఉండగా..హవ్వ..
ఇవన్నీ చాలవన్నట్టు..

వైసీపీలో చిన్న శ్రీను బహుముఖ భాగస్వామి.. అశోక్.. అదితిల చిరకాల ప్రత్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారన్న టాక్ఇ ప్పుడు జోరుగా నడుస్తోంది..ఆయన కూడా కుమార్తెకు..తనకు పదవుల మేళా అనే షరతుతో వస్తున్నారని ప్రచారం..

ఈ ప్రచారాన్ని లోకల్ లీడర్స్ ఖండిస్తున్నా..చిన్న శ్రీను మాదిరి కథ అంతా అమరావతిలోనే నడుస్తుంది తప్ప ఇక్కడి నాయకత్వం ఎంతలే.. అనే ఇంకో మాట కూడా బలంగా వినిపిస్తోంది..

అది కూడా జరిగితే..పాపం తెలుగుదేశం పార్టీకి..జిల్లా స్థాయిలో చిన్న శ్రీను..విజయనగరం నియోజకవర్గం..కార్పొరేషన్ లెవెల్లో స్వామి రూపంలో అన్ని రకాలుగా బలమైన నాయకులు దిగుమతి అయినట్టే..
అయ్యో సైకిల్ పార్టీ..
అయ్యయ్యో అదితి గజపతీ..!

Total Visitors: 2,736,256