Suryaa.co.in

Editorial

‘కోడి’ కూసింది!

– ‘కోడికత్తి’ కేసు గుట్టు విప్పిన ఎన్‌ఐఏ
– జగన్‌పై దాడిలో కుట్ర లేదన్న ఎన్‌ఐఏ అధికారులు
– ఇక లోతు విచారణ అవసరం లేద న్న వాదన
– నిందితుడు శీను టీడీపీ సానుభూతిపరుడు కాదని స్పష్టీకరణ
– క్యాంటీన్‌ యజమాని హర్షవర్ధన్‌కి కేసులో సంబంధం లేదన్న ఎన్‌ఐఏ
– జగన్‌ పిటిషన్‌ కొట్టివేయాలని అభ్యర్ధన
– నిందల నుంచి బయటపడిన టీడీపీ
– మరి కోడికత్తి శ్రీనును ప్రోత్సహించింది ఎవరు?
– శ్రీను బయటకొస్తే నష్టం ఎవరికి?
– కోడికత్తి కేసులో కొత్త కోణం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఓ నాలుగేళ్లు ఆలస్యమైనప్పటికీ.. ‘కోడి’ కూసింది.ఇది రోజూ తెల్లారితే కూసే కోడి కాదు. ఎన్నికల ముందు విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత జగన్‌పై దాడిచేసిన కోడికత్తి. తెలుగు టీవీ సీరియల్స్‌ జీడిపాకం కూడా ఈర్ష్యపడేలా నాలుగేళ్లు ‘నడిచిన’ కోడికత్తి కేసులో ఎట్టకేలకు ఒక పురోగతి. అయితే దాని వెంట ఓ సందేహాల తెర. ఇప్పుడు అదే సస్పెన్స్‌.

కోడికత్తి కథ కొత్త మలుపు తిరిగింది. జగన్‌పై దాడి చేసిన ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ తేల్చింది. జగన్‌పై దాడి చేసిన శ్రీను టీడీపీ సానుభూతిపరుడు కాదని ఎన్‌ఐఏ ఈరోజు కోర్టులో స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌. కోడికత్తి శ్రీను టీడీపీ సానుభూతిపరుడు కాకపోతే.. దాడిలో కుట్రకోణం లేకపోతే.. శ్రీను దాడి ఎందుకు చేశాడు? మరి ఎవరి కోసం దాడికి పాల్పడ్డాడు? లేటెస్టుగా తెరపైకి వచ్చిన ప్రశ్నలివి.

కోడికత్తి కేసులో ఇక లోతైన దర్యాప్తు అవసరం లేదని, జగన్‌ పిటిషన్‌కు సమాధానంగా ఎన్‌ఐఏ నేడు కోర్టుకు స్పష్టం చేసింది. తాము చేసిన సుదీర్ఘ దర్యాప్తులో.. కోడికత్తి శ్రీను టీడీపీ సానుభూతిపరుడు కాదని, అతను పనిచేసే రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఐఏ అధికారులు, విజయవాడలోని ఎన్‌ ఐఏ కోర్టుకు స్పష్టం చేశారు. కేసు విచారణకు వచ్చినందున, ఇక దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది.

తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎన్నికల ముందు జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన వైనం వెనక.. అప్పటి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారని వైసీపీ కోడై కోసింది. ఆ తర్వాత రెస్టారెంట్‌ యజమానితో చేయించారని మాటమార్చింది. దానిని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసింది. దర్యాప్తు కోసం హైదరాబాద్‌కు వెళ్లిన పోలీసులకు, తాను సహకరించేది లేదని జగన్‌ ఖరాఖండీగా చెప్పారు. తాను ఏపీ పోలీసులను నమ్మనని కుండబద్దలు కొట్టారు.

తర్వాత కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీ చేపట్టింది. కోడికత్తి శ్రీను, రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌తోపాటు, విశాఖ ఎయిర్‌పోర్టు అధికారులను సుదీర్ఘంగా విచారించింది. సీసీ టీవీలు పరిశీలించింది. కోడికత్తి శ్రీను గ్రామానికి వెళ్లి, అతని గురించి ఆరా తీసింది. శ్రీనుకు-టీడీపీకి ఏమైనా సంబంధాలున్నాయా అని విచారించింది. చివరాఖరకు కోడికత్తి కేసులో నిందితుడయిన శ్రీను టీడీపీ సానుభూతిపరుడు కాదని తేల్చింది. అదేవిధంగా అనుమానితుడిగా భావిస్తున్న శ్రీను పనిచేసే రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ పాత్ర, ఈ కేసులో లేదని స్పష్టం చేసి, ఆ మేరకు ఎన్‌ఐఏ కోర్టుకు నివేదిక సమర్పించింది.

కోడికత్తి శ్రీనుతో టీడీపీకి సంబంధం లేదని, అతను ఆ పార్టీ సానుభూతిపరుడు కాదని ఎన్‌ఐఏ స్పష్టం చేసిన నేపథ్యంలో.. టీడీపీ ఊపిరి పీల్చుకుంది. ఎన్నికలకు ముందు ప్రశాంత్‌కిశోర్‌ వ్యూహబృందం దెబ్బకు, కుంగిపోయిన టీడీపీ.. కొలుకునేందుకు ఇన్నేళ్లు పట్టింది. కోడికత్తితో టీడీపీనే జగన్‌పై.. దాడి చేయించిందన్న ప్రచారానికి బాధితురాలైన టీడీపీ, ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో వైసీపీపై ఎదురుదాడి ప్రారంభించింది. ఎన్‌ఐఏ వాదన ఆధారంగా ఇప్పుడు టీడీపీ.. అధికార పార్టీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

మాజీ మంత్రి జవహర్‌ రంగంలోకి దిగి.. ఇప్పుడేమంటారు? ఇలాంటి చిల్లర డ్రామాలు ఆడటం, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్థిపొందడం మీకు మామూలేనని విరుచుకుపడ్డారు. కోడికత్తి కేసులో టీడీపీని అప్రతిష్ఠ చేసినందుకు, వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అయితే అసలు జగన్‌పై కోడికత్తి శ్రీను ఎందుకు దాడి చేశారు? నిందితుడిని ఎవరు ఉసిగొల్పారు? ఎవరి ఆదేశాల మేరకు శ్రీను, వైసీపీ అధినేతపై దాడి చేశారు? అటు టీడీపీ కాకుండా-ఇటు రెస్టారెంట్‌ యజమాని కాకుండా.. జగన్‌పై దాడిని ఉసిగొల్పింది ఎవరు? ఇంతకాలం బెయిల్‌పై బయటకు రాకుండా, శ్రీను జైల్లోనే ఎందుకు మగ్గుతున్నాడు? ఆయన బయటకు వస్తే నష్టం ఎవరికి? కోడికత్తి కేసును దర్యాప్తు చేసి, ఎన్‌ఐఏ అధికారులు అసలు విషయాలు తేల్చిన కూడా.. ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని స్వయంగా సీఎం జగన్‌ పిటిషన్‌ వేయడం వెనుక వ్యూహమేమిటి? అన్న ప్రశ్నలు తెరపైకొచ్చాయి.

LEAVE A RESPONSE