ఆలయాలకు వెలుగులు

-మరో 2,091 ఆలయాల్లో ‘నిత్య నైవేద్యం’
-అప్పుడు వైఎస్…ఇప్పుడు జగన్‌
-ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు జారీ

అమరావతి : రాష్ట్రంలోని మరిన్ని ఆలయాల్లో స్వామివార్లకు నిత్య నైవేద్యాలు జరగనున్నాయి. ఆలయాల అభివృద్ధి, నిత్యం ధూప, దీప, నైవేద్యాలకు ప్రాధాన్యతనిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి మరో 2091 ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. 30 వేల ఆదాయం కూడా లేక నిత్య పూజలు జరగని ఈ ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని (డీడీఎన్‌ఎస్‌) మంజూరు చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి ఆలయానికి స్వామివార్ల ధూప, దీప, నైవేద్యం ఖర్చులకు నెలకు రూ.2,000, పూజారి గౌరవ వేతనం మరో రూ. 3000 చొప్పున నెలకు రూ. 5000 ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఆలయ పూజారి బ్యాంకు ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు. అక్టోబరు నెల నుంచి ఇది అమల్లోకి వస్తుందని, నవంబరు ఒకటో తేదీ తర్వాత చెల్లింపులు జరుగుతాయని కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలవారీగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆలయాల వివరాలు, పూజారి పేరు, అతని బ్యాంకు ఖాతా వివరాలను కూడా పేర్కొన్నారు. దేవదాయ శాఖలో రిజిస్టర్‌ అయి ఉండి, గ్రామీణ ప్రాంతంలో రెండున్నర ఎకరాల లోపు మాగాణి భూమి, ఐదెకరాల లోపు మెట్ట భూమి ఉండి ఆలయానికి అన్ని రకాల ఆదాయం రూ. 30 వేలకు మించని ఆలయాలనే ప్రభుత్వం ఈ పథకానికి ఎంపిక చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ముందుగా జిల్లా దేవదాయ శాఖ అధికారులు ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారి ప్రతిపాదనలను కమిషనర్‌ కార్యాలయానికి పంపారు. వీటిని 11 మంది ఉన్నతాధికారులు పరిశీలించారు. ఒక్కొక్క అధికారి 20 ఆలయాలను ర్యాండమ్‌గా తనిఖీ చేసి నిర్ధారించుకున్న తర్వాతే తుది జాబితాను రూపొందించారు. ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ఆలయాల ఎంపికను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వాల హయాంలోనే : గ్రామీణ ప్రాంతాల్లో తగినంత ఆదాయం లేక నిత్య పూజలకు నోచుకోని ఆలయాలకు 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొలిసారి ధూప, దీప, నైవేద్యం పథకాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో తొలుత దాదాపు 3,600 ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. రాష్ట్ర విభజన సమయానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దాదాపు 1,900 ఆలయాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుండేది. 2014 తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ఒక్క ఆలయానికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. పైగా అప్పటిదాకా పనిచేస్తున్న పూజారులు చనిపోయిన ఆలయాలకు పథకాన్ని నిలిపివేయడం, ఇతర కారణాలతో 2019 ఎన్నికల సమయానికి ఆ ఆలయాల సంఖ్య 1,620కు తగ్గిపోయింది. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత మళ్లీ ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. తాజా ఆలయాలతో కలిపి ఈ మూడేళ్లలో ప్రభుత్వం 2,747 ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తం 4,367 ఆలయాలు ప్రయోజనం పొందుతున్నాయి.