– 12 ఏళ్ల మోదీ పాలన – ఒక్క అవినీతి మరక లేదు
– తెలంగాణలో కరప్షన్ కు మారుపేరుగా కాంగ్రెస్ పాలన
– 40 శాతం నుంచి 60 శాతం కమీషన్ల ప్రభుత్వంగా రేవంత్ పాలన.
– 2047 భారత్ లక్ష్యాలకు బడ్జెట్ బలమైన పునాది
– ఆత్మనిర్భర భారత్ దిశగా 2026-27 బడ్జెట్
– 11వ స్థానం నుంచి 4వ స్థానం వరకు – మోదీ ఆర్థిక మిరాకిల్
– దక్షిణాది రాష్ట్రాలకు అభివృద్ధి గోల్డెన్ ఛాన్స్
– హైదరాబాద్ కేంద్రంగా 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు
– కేంద్రం నిధులు ఇస్తుంది.. కృతజ్ఞతలు కూడా చెప్పని దౌర్భాగ్య కాంగ్రెస్ ప్రభుత్వం
– ‘బయో ఫార్మా శక్తి’తో గ్లోబల్ హబ్‌గా భారత్
– 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే
– తెలుగు రాష్ట్రాలకు డిజిటల్ బూమ్ అవకాశాలు
– సర్ ప్లస్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్
– ధరణి పోయింది… భూభారతి వచ్చింది… అవినీతి మాత్రం అలాగే ఉంది.
– కాంగ్రెస్ అవినీతిపై మండిపడ్డ మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోదీ 2047 భారతదేశ ఆర్థిక లక్ష్యాలకు బలమైన పునాదిగా నిలుస్తుందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. గత 11 సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దిన మోదీ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలనలో 11వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని కేవలం ఒక దశాబ్దంలోనే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చిందని గుర్తు చేశారు.
ఈ విజయాన్ని ప్రపంచ దేశాలు మాత్రమే కాకుండా భారత ప్రజలూ గుర్తిస్తున్నారని చెప్పారు. అందుకే వరుసగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు కొనసాగుతోందని తెలిపారు. ఈ బడ్జెట్ ఆత్మనిర్భర భారత నిర్మాణానికి కీలకమైనదని, ఇప్పటికీ విదేశాలపై ఆధారపడుతున్న కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా వంటి రంగాల్లో దేశీయ ఉత్పత్తిని పెంచే దిశగా స్పష్టమైన విధాన రూపకల్పన జరిగిందన్నారు. యువత, మహిళలు, రైతులు, పేదలు అన్నివర్గాలకు మేలు చేసే బడ్జెట్ ఇది అని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ఈ బడ్జెట్ అపార అవకాశాలను కల్పించిందని జీవీఎల్ వివరించారు. ప్రత్యేకంగా రైల్వే రంగంలో ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు హైదరాబాద్ కేంద్రంగా ఉండటం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు.
పుణే–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై కారిడార్లు లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మించనుండటం తెలంగాణ అభివృద్ధికి కీలకమని చెప్పారు. అయినా తెలంగాణ ప్రభుత్వం దీనికి ఇప్పటివరకు కృతజ్ఞతలు చెప్పకపోవడం దౌర్భాగ్య రాజకీయాల ప్రతిబింబమని విమర్శించారు.
ఫార్మా రంగంలో ‘బయో ఫార్మా శక్తి’ ఇనిషియేటివ్ ద్వారా భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోందని జీవీఎల్ కొనియాడారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)లను బలోపేతం చేయడం ద్వారా హైదరాబాద్ నైపర్‌కు, తెలంగాణకు భారీ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.
కెమికల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో మూడు డెడికేటెడ్ కెమికల్ పార్కులను ఛాలెంజ్ మోడ్ ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిందని, తెలంగాణకు ఈ రంగంలో ముందుకు వెళ్లే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. అలాగే మెగా టెక్స్టైల్ పార్కులు, సీఈఆర్ (City Economic Regions), యూనివర్సిటీ టౌన్‌షిప్స్ వంటి ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రాలు ముందుకొచ్చి ప్రతిపాదనలు పంపితేనే అమలవుతాయని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2047 వరకు డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం ద్వారా గ్లోబల్ ఐటీ, క్లౌడ్ కంపెనీలను భారత్‌కు ఆకర్షిస్తోందన్నారు. ఇప్పటికే తెలంగాణలో అనేక డేటా సెంటర్లు ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాలకు ఇది గొప్ప అవకాశమని తెలిపారు. అలాగే ఎంఎస్ఎంఈ రంగానికి ఈక్విటీ, లిక్విడిటీ సపోర్ట్ ఇచ్చి ‘చాంపియన్ ఎంఎస్ఎంఈలు’గా తీర్చిదిద్దే విధానాన్ని కేంద్రం ప్రకటించిందన్నారు.
ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కారిడార్ల అభివృద్ధి ద్వారా చైనా మీద ఆధారాన్ని తగ్గించి ఆత్మనిర్భరత సాధించడమే లక్ష్యమని జీవీఎల్ వెల్లడించారు. రక్షణ రంగంలో 15 శాతం, రైల్వే రంగంలో 10 శాతం, మొత్తం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను రూ.12.2 లక్షల కోట్లకు పెంచడం దేశాభివృద్ధికి నిదర్శనమన్నారు.
యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే గత 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు మూడింతలు నిధులు కేటాయించిందని, దక్షిణాది రాష్ట్రాలకు అయితే ఐదింతలు గ్రాంట్లు ఇచ్చిందని తెలిపారు. అయినా కేంద్రం ఏమి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం ‘స్పిట్ అండ్ రన్ పాలిటిక్స్’కు నిదర్శనమన్నారు.
తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్ప్లస్ రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రంగా మార్చాయని, అభివృద్ధి శూన్యమని, అవినీతి అనంతంగా మారిందని విమర్శించారు.
కాంగ్రెస్ పాలన అంటే నో గవర్నెన్స్, ఓన్లీ కరప్షన్
తెలంగాణలో కాంగ్రెస్ పాలన అంటే – నో గవర్నెన్స్, ఓన్లీ కరప్షన్ అని జీవీఎల్ నరసింహారావు గారు విమర్శించారు. పరిపాలన కనిపించదని, అవినీతి మాత్రమే దర్శనమిస్తోందన్నారు.
ధరణి పోయింది… భూభారతి వచ్చింది… కానీ అవినీతి మాత్రం మారలేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అవినీతికి పరాకాష్టగా మారిందని జీవీఎల్ గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని, అధికారంలోకి వచ్చాక భూభారతి పోర్టల్ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు అదే భూభారతి రైతులకు కొత్త సమస్యలు, అవినీతికి కేంద్రబిందువుగా మారిందని ఆయన మండిపడ్డారు.
ధరణి పోయి భూభారతి వచ్చింది… కానీ అవినీతి మాత్రం మారలేదని విమర్శించారు. భూ పరిపాలనను సంస్కరించాలనే నినాదంతో భూభారతిని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తీరా అదే వ్యవస్థలో లోపాలపుట్టగా, వివాదాలు, అవినీతి రాజ్యమేలుతోందని జీవీఎల్ ఆరోపించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత దారుణంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని జీవీఎల్ నరసింహారావు గారు ఘాటుగా విమర్శించారు. పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన సచివాలయం, కాంగ్రెస్ పాలనలో ధర్నా చౌక్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అడిగితే, 40 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు చెల్లిస్తామని మంత్రులు చెప్పిన ఘటనలు అవినీతికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.
అవినీతిలో కాంగ్రెస్ ప్రోగ్రెస్ రిపోర్ట్: 40 నుంచి 60 శాతం.
ఒకప్పుడు 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా ఉన్న పాలన, ఇప్పుడు 60 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.కేంద్రం ఆమోదించిన జాతీయ రహదారి ప్రాజెక్టులు, వేల కోట్ల పెట్టుబడులను కూడా గుర్తించకుండా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
దేశవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయాలు సాధిస్తోందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు అనేక చోట్ల ట్రిపుల్ ఇంజన్ సర్కార్‌గా మారిందని అన్నారు. తెలంగాణలో కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ కాంగ్రెస్ అవినీతి పాలనకు గుణపాఠం చెప్పే దిశగా బీజేపీ ముందుకెళ్తుందని చెప్పారు.
కేంద్రంలో గుడ్ గవర్నెన్స్ రేస్.. రాష్ట్రంలో కరప్షన్ రేస్.
దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన, అవినీతిరహిత పాలనతో మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా ఛాలెంజింగ్ గా ముందుకెళ్తుంటే.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అవినీతిలోనే చాలెంజ్ తీసుకుంటూ ముందుకు వెళ్తోందని జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు.
మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో అవినీతి మరకలేని, పారదర్శక పాలనకు ప్రతీకగా నిలిచింది. ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం 2028లో ప్రజల తీర్పుతో తప్పక తిరస్కరించబడుతుందని, బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎవరి వ్యక్తిగత సొమ్ము కాదని, అవన్నీ ప్రజల సొమ్మేనని జీవీఎల్ నరసింహారావు గుర్తుచేశారు. ఆ నిధులు సక్రమంగా వినియోగమవుతున్నాయా లేదా అన్నదాన్ని పర్యవేక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు, మార్పులన్నీ నిధుల మెరుగైన వినియోగం, నాణ్యమైన ఆస్తుల సృష్టి లక్ష్యంగా చేసినవేనని స్పష్టం చేశారు. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ వంటి పథకాల కింద నిరర్థక ఆస్తులు సృష్టించి, కాగితాలపై మాత్రమే పనులు చూపిన ఉదంతాలు సీఏజీ నివేదికల ద్వారా బయటపడ్డాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో జవాబుదారీతనం పెంచేందుకే కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలు తీసుకొచ్చిందన్నారు.
అభివృద్ధి పనులన్నీ కేంద్రం మాత్రమే చేయాలన్న భావన సరికాదని, రాష్ట్ర ప్రభుత్వాలకూ తగిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రాలకు అవసరమైన మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక రుణ సహాయం, క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో ఏటా లక్షన్నర కోట్ల రూపాయల వరకు నిధులు ఇస్తోందని చెప్పారు. ఆ నిధులను రాష్ట్రాలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దివ్యాంగుల సంక్షేమంపై మాట్లాడుతూ, “దివ్యాంగులు” అనే పదాన్ని గౌరవార్థంగా మొదటగా ఉపయోగించిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారేనని జీవీఎల్ గుర్తుచేశారు. గత ప్రభుత్వాల కాలంలో దివ్యాంగుల పట్ల సమాజంలో గానీ, పాలనలో గానీ సరైన సానుకూల దృక్పథం లేదని చెప్పారు. మోదీ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల గౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా విధానాలు రూపొందించిందని ఆయన తెలిపారు.
ప్రతి జిల్లాలో ప్రత్యేక క్యాంపుల ద్వారా దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు అనుకూల మౌలిక వసతులు కల్పించడం నిబంధనగా మారిందని, ఇది మోదీ ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనమన్నారు.
ప్రాంతీయ అభివృద్ధిపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్‌గా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. భారీ పెట్టుబడులు, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు అక్కడికి రావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు, లేని రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో స్పష్టమైన తేడా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం సుపరిపాలన, పారదర్శకత, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, రాజకీయ నాటకాలకే పరిమితమైందని జీవీఎల్ విమర్శించారు. అభివృద్ధిపై నిజమైన ఆసక్తి ఉంటే, కేంద్రం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని, ప్రజల సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమావేశంలో బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ , బిజెపి నాయకులు సునీతా రెడ్డి , వీరబాబు , తదితరులు పాల్గొన్నారు.